IIT Seats: దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి 18,160 బీటెక్, బీఎస్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. గతేడాది 17,740 సీట్లు ఉండగా.. ఈ ఏడాది 420 సీట్లు జతయ్యాయి. కొన్ని కొత్త కోర్సులు ప్రవేశపెట్టడంతో ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లోనూ సీట్లు పెరిగాయి. ఈసారి మొత్తం 127 విద్యా సంస్థల్లో 62,853 సీట్లను జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం 18,160 సీట్లలో ఓపెన్ కేటగిరీ-7,364; ఈడబ్ల్యూఎస్-1814; ఎస్సీ-2724; ఎస్టీ-1364; ఓబీసీ-4894 సీట్లలో ప్రవేశాలు కల్పించనున్నారు.
ఆయా విద్యాసంస్థల్లో మొత్తం సీట్లు ఎన్నంటే?గతేడాది అన్నింట్లో కలిపి మొత్తం సీట్ల సంఖ్య 59,917గా ఉండేది. ఈ విద్యాసంవత్సరానికి సూపర్ న్యూమరరీతో కలిపి మొత్తం 62,853 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఐఐటీ సీట్లు 18,160 ఉండగా.. ఎన్ఐటీలు 24,525; త్రిపుల్ ఐటీల్లో 9,940 సీట్లు; జీఎఫ్‌టీఐలు 10,228 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
| ఆయా విద్యాసంస్థల్లో మొత్తం సీట్లు (సూపర్ న్యూమరరీతో కలిపి) | ||||
| విద్యాసంస్థ | 2022 | 2023 | 2024 | 2025 |
| ఐఐటీ | 16,598 | 17,385 | 17,740 | 18,160 |
| ఎన్ఐటీ | 23,994 | 23,954 | 24,229 | 24,525 |
| ట్రిపుల్ ఐటీ | 7,126 | 7,746 | 8,546 | 9,940 |
| జీఎఫ్‌టీఐ | 6,759 | 8,067 | 9,402 | 10,228 |
| మొత్తం | 54,477 | 57,152 | 59,917 | 62,853 |
తెలుగు రాష్ట్రాల్లో 3,424 సీట్ల భర్తీ..జోసా కౌన్సెలింగ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 3,424 సీట్లను భర్తీ చేయనున్నారు. గతేడాది ఈ సంఖ్య 3,384గా ఉండేది. ఈ ఏడాదికి 40 సీట్లు అదనంగా చేరాయి. జోసా ద్వారా భర్తీ చేసే సీట్లలో ఐఐటీ హైదరాబాద్-630, ఐఐటీ తిరుపతి-254, ఎన్‌ఐటీ వరంగల్-1049, ఎన్‌ఐటీ ఏపీ-480, స్పా-విజయవాడ-132, హెచ్‌సీయూ-110, త్రిపుల్ ఐటీ-శ్రీసిటీ-438, త్రిపుల్ ఐటీ-కర్నూలు- 331 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఐటీ హైదరాబాద్‌లో గతేడాది 595 సీట్లుండగా... ఈసారి 35 పెరిగి.. 630కి చేరాయి. గతేడాది 10 సీట్లతో నాలుగేళ్ల ఇంజినీరింగ్ ఫిజిక్స్ కోర్సును అందుబాటులోకి తీసుకురాగా... ఆ సీట్లను 35కి పెంచారు. మిగిలిన 10 సీట్లు ఇతర కోర్సుల్లో పెరిగాయి.
| విద్యాసంస్థ | గతేడాది | ప్రస్తుతం |
| ఐఐటీ హైదరాబాద్ | 595 | 630 |
| ఐఐటీ తిరుపతి | 254 | 254 |
| ఎన్‌ఐటీ వరంగల్ | 1049 | 1049 |
| ఎన్‌ఐటీ ఏపీ | 480 | 480 |
| స్పా-విజయవాడ | 132 | 132 |
| హెచ్‌సీయూ | 110 | 110 |
| ట్రిపుల్ ఐటీ-శ్రీసిటీ | 437 | 438 |
| ట్రిపుల్ ఐటీ- కర్నూలు | 327 | 331 |
| మొత్తం | 3384 | 3424 |
ఈసారి 6 విడతల్లో జోసా కౌన్సెలింగ్..జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే ఇతర సాంకేతిక విద్యాసంస్థల్లో సీట్ల భర్తీకి జోసా కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈసారి ఆరు విడతలుగా జోసా కౌన్సెలింగ్ జరుగనుంది. గత ఏడాది ఐదు రౌండ్ల కౌన్సెలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 3 నుంచి జోసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది. విద్యార్థలు జూన్ 3 నుంచి 11 వరకు ఆప్షన్లు పెట్టుకోవచ్చు. ఆ సందర్భంగా రెండు సార్లు మాక్ సీట్ ఎలాట్‌మెంట్ నిర్వహిస్తారు. దాన్ని బట్టి తమకు ఎక్కడ సీటు వస్తుందో విద్యార్థులు ఒక అంచనాకు రావడానికి వీలవుతుంది. మొత్తం 127 విద్యా సంస్థలు జోసా కౌన్సెలింగ్‌లో పాల్గొననున్నాయి. గత ఏడాది కంటే ఈసారి నాలుగు సంస్థలు అధికంగా ఉన్నాయి. అవి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యాసంస్థలే.
జోసా కౌన్సెలింగ్ - సీట్ల కేటాయింపు ఇలా..
➤ మొదటి విడత: జూన్ 14;
➤ రెండో విడత: జూన్ 21
➤ మూడో విడత: జూన్ 28
➤ నాలుగో విడత: జులై 4
➤ ఐదో విడత: జులై 10
➤ ఆరో విడత: జులై 16