Stock Market Biggest Crash: ఈ రోజు (సోమవారం, ఏప్రిల్ 7, 2025) భారత స్టాక్ మార్కెట్‌లో రక్తపాతం కనిపించింది. సుంకాల సునామీలో షేర్లు ఎరుపు రంగు పులుముకుని పోటెత్తాయి. మార్కెట్ ప్రారంభ సమయంలోనే అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇండియా విక్స్ తప్ప ఏ ఒక్క సూచీ కూడా గ్రీన్‌లో కనిపించలేదు. మార్కెట్ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే BSE సెన్సెక్స్ 3,939.68 పాయింట్లు లేదా 5.27% పతనమై ఇంట్రాడేలో 71,425.01 కనిష్ట స్థాయికి చేరుకుంది. NSE నిఫ్టీ 1,160.8 పాయింట్లు లేదా 5.06% క్షీణించి ఇంట్రాడేలో 21,743.65 కనిష్ట స్థాయికి చేరుకుంది. ఇది భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోని అతి పెద్ద క్రాష్‌ల్లో ఒకటి. కాలం మారుతున్న కొద్దీ సెన్సెక్స్ & నిఫ్టీ చాలా క్రాష్‌లు ఎదుర్కొన్నాయి. పుస్తకాలలో నమోదైన మొదటి క్రాష్ 1865 నాటిది.
భారత స్టాక్ మార్కెట్‌లో టాప్-10 క్రాష్‌లు:
1. 2024 క్రాష్: 2024లో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు సెన్సెక్స్ దాదాపు 10,000 పాయింట్లు లేదా 11.79% పడిపోయింది. ఆ నాలుగు నెలల్లో నిఫ్టీ 12.38% జారిపోయింది. ముఖ్యంగా, 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత, జూన్ 3-4 వరకు నిఫ్టీ 1,380 పాయింట్లు లేదా 5.93% నేలచూపులు చూసింది.
2. 2020 క్రాష్: కోవిడ్-19 మహమ్మారి సెన్సెక్స్ & నిఫ్టీని వణికించింది. ఆ ఏడాది ఫిబ్రవరి 28న సెన్సెక్స్ 1,448 పాయింట్లు కోల్పోయింది & మార్చి 4, 6 తేదీల్లో 1,000 పాయింట్లు పడిపోయింది. తరువాత, సెన్సెక్స్ 2,713.41 పాయింట్లు (సుమారు 8%) పడిపోయింది, మార్చి 16న నిఫ్టీ కూడా 9,200 స్థాయి కంటే కిందకు జారిపోయింది. 2020 మార్చి 23న, సెన్సెక్స్ 3,934.72 పాయింట్లు (13.15%) & నిఫ్టీ 1,135 పాయింట్లు (12.98%) పడిపోయి ఒక్కరోజులో రక్తచరిత్ర చూపించాయి.
3. 2015 క్రాష్: 2015 ఆగస్టు 24న సెన్సెక్స్ 1,624 పాయింట్లు పడిపోయింది, & నిఫ్టీ 490 పాయింట్లు పడిపోయింది. చైనాలో ఆర్థిక మందగమనం & యువాన్ విలువ తగ్గింపు భయాలు ఆసియా మార్కెట్లను భయాందోళనకు గురిచేశాయి.
4. 2008 క్రాష్: లెమాన్ బ్రదర్స్ సంక్షోభం తర్వాత వచ్చిన ఆర్థిక మాంద్యం కారణంగా, ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్‌లు రక్తపాతాన్ని కళ్లజూశాయి. 2008 జనవరి 21న సెన్సెక్స్ 1,408 పాయింట్లు క్షీణించి 17,605కి చేరుకుంది, ఈ కారణంగా ఏర్పడిన సాంకేతిక లోపంతో ఆ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకే క్లోజ్ అయింది. దీనిని బ్లాక్ మండే అని కూడా పిలుస్తారు. అదే నెలలో, సెన్సెక్స్ 15,332 కనిష్ట స్థాయికి చేరుకుని 2,273 పాయింట్ల అతి పెద్ద ఇంట్రాడే పతనాన్ని చూసింది. జనవరి 22న కూడా, బీఎస్‌ఈలో ట్రేడింగ్ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే ఒక గంట పాటు నిలిపేశారు. ఎందుకంటే, సెన్సెక్స్ దాని సర్క్యూట్ పరిమితి 10%ను దాటింది.
5. 2007 క్రాష్: 2007లోనూ ఆర్థిక మాంద్యం కారణంగా మార్కెట్ ఒడుదొడుకులు ఎదుర్కొంది. ఈ ఒక్క సంవత్సరంలోనే ప్రధాన సూచీలు ఐదు పెద్ద పతనాలను చవిచూశాయి. ఏప్రిల్ 2న సెన్సెక్స్ 617 పాయింట్లు పడిపోయింది. ఆగస్టు 1 & 16 తేదీలలోనూ భారీ పతనం. అక్టోబర్ 18న సెన్సెక్స్ & నిఫ్టీ వరుసగా 1,428 పాయింట్లు & 208 పాయింట్లు కోల్పోయాయి. నవంబర్ 21 & డిసెంబర్ 17 రోజుల్లోనూ భారీ కోతకు గురయ్యాయి.
6. 2004 క్రాష్: సెన్సెక్స్ 2004 మే 17న 15.52% పడిపోయింది, చరిత్రలో ఇదే అతి పెద్ద పతనంగా మారింది. ఇది కూడా బ్లాక్ మండే. సార్వత్రిక ఎన్నికల్లో NDA ప్రభుత్వం ఓటమితో ఇది జరిగింది.
7. 1992 క్రాష్: హర్షద్ మెహతా స్కామ్ కారణంగా 1992 ఏప్రిల్ 28న సెన్సెక్స్ 12.77% జారిపోయి అథఃపాతాళాన్ని చూసింది.
8. 1991 క్రాష్: హర్షద్ మెహతా & కేతన్ పరేఖ్ వంటి పెద్ద ప్లేయర్లు చేసిన మోసాల కారణంగా స్టాక్ మార్కెట్‌లు తల్లడిల్లాయి. ప్రపంచ పరిస్థితులు కూడా కష్టాలను పెంచాయి.
9. 1982 క్రాష్: 1982లో, బెంగాల్‌కు చెందిన బేర్ కార్టెల్, షేర్లను, ముఖ్యంగా రిలయన్స్ షేర్లను షార్ట్ సెల్లింగ్ చేయడంతో మార్కెట్ నివ్వెరపోయింది. వరుసగా మూడు రోజులు BSEని మూసేశారు. ఓ అంచనా ప్రకారం, దాదాపు 1.10 లక్షల షేర్లలో షార్ట్ సెల్లింగ్ జరిగింది.
10. 1865 క్రాష్: BSE ఏర్పాటైనప్పుడు కూడా, 1865లో మొదటి క్రాష్ ల్యాండింగ్ జరిగింది. ఆ సమయంలో గుజరాతీలు, పార్సీలు రాంపార్ట్ రో & మెడోస్ స్ట్రీట్ జంక్షన్‌లో షేర్లను ట్రేడ్ చేసేవారని చరిత్ర చెబుతోంది.