China - US Reciprocal Tariff War: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), యూఎస్‌ వాణిజ్య భాగస్వామ్య దేశాలపై విధించిన అధిక సుంకాల రేట్లకు 90 రోజుల విరామం ఇచ్చి పెద్ద ఉపశమనం కలిగించారు. వాస్తవానికి, ఆ అధిక సుంకాలు బుధవారం (09 ఏప్రిల్‌ 2025) నుంచి అమల్లోకి రావలసి ఉండగా, చివరి నిమిషంలో "పాజ్‌" బటన్‌ నొక్కారు. కానీ, చైనాపై సుంకాన్ని 125 శాతానికి పెంచారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 46 దేశాలు & యూరోపియన్ యూనియన్‌ (EU)పై సుంకాలు విధించిన తర్వాత, గ్లోబల్‌ మార్కెట్లలో నెలకొన్న గందరగోళం, మాంద్యం ముప్పు కారణంగా ట్రంప్ తన నిర్ణయంపై యూ-టర్న్ తీసుకున్నారు.  

బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్‌ ప్రకారం, పారిశ్రామికవేత్తలు & పెట్టుబడిదారుల నుంచి ట్రంప్‌నకు తీవ్రమైన నిరసన, ఒత్తిడి ఎదురైంది. సుంకాలు పెంచుకుంటే వెళ్లడం "సెల్ఫ్‌ గోల్‌"తో సమానమని, "బూమరాంగ్‌" అవుతుందని, "తాను తీసిన గోతిలో తానే పడడం" వంటిదని చాలా మంది హెచ్చరించారు. అమెరికాలో మరో ఆర్థిక మాంద్యానికి ‍‌(Economic Recession) ట్రంప్‌ కారణమవుతున్నారని రీసెర్చ్‌ హౌస్‌లు హెచ్చరించాయి. సుంకాలు పెంచుకుంటూ వెళ్లడం ఆర్థిక ఆణు యుద్ధంతో సమానమని, దాని పరిణామాలను అమెరికానే ఎక్కువగా భరించాల్సి వస్తుందని వార్నింగ్‌ ఇచ్చారు. ఎవరెన్ని చెప్పినా వెనక్కు తగ్గని ట్రంప్‌, చివరి నిమిషంలో టారిఫ్‌లకు 90 రోజుల విరామం ప్రకటించారు. 

ట్రంప్‌ ఏం చెప్పారంటే?వాణిజ్య భాగస్వామ్య దేశాలపై హైయ్యర్‌ టారిఫ్స్‌, దాని పరిణామాలపై ట్రంప్‌ను అంతర్జాతీయ మీడియా ప్రశ్నించినప్పుడు, "ప్రజలు కొంచం ఎక్కువగా ఆలోచిస్తున్నారని నేను భావిస్తున్నా. నన్ను కొంచెం చికాకు పెడుతున్నారు, ఇంకొంచం భయపెడుతున్నారు. అమెరికా భవిష్యత్‌ కోసం గతంలో ఏ ఇతర అధ్యక్షుడు ఇలా చేయలేదు. దీనికోసం ఎవరో ఒకరు ముందడుగు వేసి ఉండాల్సింది. మిగిలిన ప్రపంచం అమెరికాను దోచుకోవడం ఇంకా ఎక్కువ కాలం కొనసాగకూడదు, కాబట్టి నేను దీనిని ఆపవలసి వచ్చింది. ఎవరో ఒకరు చేయాల్సిన ఈ పనిని నేను చేసినందుకు గౌరవంగా భావిస్తున్నా" అని ట్రంప్‌ చెప్పారు.

చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాన్ని 104 శాతం నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు, ఇది గురువారం (ఏప్రిల్ 10, 2025) అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది. ట్రంప్‌ ప్రకటన ప్రపంచంలోని రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఉద్రిక్తతను మరింత పెంచింది.

మిగతా ప్రపంచాన్ని ట్రంప్‌ ఎందుకు ఒదిలిపెట్టారు?యూఎస్‌ ప్రతీకార సుంకాలపై చైనా తప్ప మరే ఇతర దేశం కూడా ప్రశ్నించలేదు, సుంకాలను పెంచలేదు. ఇక్కడ, ట్రంప్‌ అహం (ఇగో) సంతృప్తి చెందినట్లు కనిపిస్తోంది. చైనా మాత్రం మాటకు మాట, సుంకానికి సుంకం అన్నట్లు ప్రతిస్పందించడంతో ట్రంప్‌ అసహనంగా ఉన్నారు. సాధారణంగా, "ప్రపంచంలో అందరికన్నా మేమే గొప్ప" అని అమెరికన్లు అనుకుంటారు. డొనాల్డ్‌ ట్రంప్‌ దగ్గర ఈ ఫీలింగ్‌ ఇంకాస్త ఎక్కువగా ఉంటుందని ఆయన వైఖరిని బట్టి అర్ధం అవుతుంది. 

చాలా వాణిజ్య భాగస్వామ్య దేశాలపై పరస్పర సుంకాల అమలుకు తాను బ్రేక్ వేస్తున్నానని, ఎందుకంటే అవన్నీ ప్రతీకార సుంకాలు వేయకుండా చర్చల కోసం తమను సంప్రదించాయని డొనాల్డ్‌ ట్రంప్‌ తన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.  చైనా తనను గౌరవించలేదని ఆరోపించారు. అంటే.. చైనాపై 125% విధించి, మిగిలిన దేశాలను 10%తో ఒదిలేయడానికి ట్రంప్‌ ఇగోనే కారణమన్నది చాలామంది అభిప్రాయం.