Musk To Zuckerberg Wealth Rise: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), వాణిజ్య సుంకాలపై (Trump Tariffs) 90 రోజుల విరామం ప్రకటించడంతో, బుధవారం నాడు అమెరికా స్టాక్ మార్కెట్ (US stock Market) జోరందుకుంది. దీంతో, ప్రముఖ కంపెనీల షేర్లు అనూహ్యంగా రాణించాయి. ఆ కంపెనీల యజమానులు & ప్రపంచ సంపన్నుల సంపద బుధవారం ఒక్క రోజులోనే భారీగా 304 బిలియన్‌ డాలర్లు పెరిగింది. ఇది, బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ చరిత్రలో ఒక రోజులో రికార్డ్‌ స్థాయి పెరుగుదల. వారం రోజుల భారీ నష్టాల తర్వాత మెటా షేర్లు & టెస్లా షేర్లు దాదాపు 10% పెరగడం వల్ల ఈ ఫీట్‌ సాధ్యమైంది. 

అమెరికన్‌ మార్కెట్‌లో, బుధవారం (09 ఏప్రిల్‌ 2025) నాడు, S&P 9.52% పెరిగి 5,456.90 కి చేరుకుంది, 2008 తర్వాత ఒక్క రోజులో వచ్చిన అత్యధిక రికార్డ్‌ స్థాయి గెయిన్‌ ఇది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 7.87% పెరిగి 2,962.86 పాయింట్లకు చేరుకోగా, నాస్‌డాక్ కాంపోజిట్ 12.16% పెరిగి స్పేస్‌X రాకెట్‌ను తలపించింది, గత 24 సంవత్సరాలలో మొదటిసారిగా ఇంత లాభాన్ని చూసింది.

గత వారం, డొనాల్డ్ ట్రంప్ సుంకాలను ప్రకటించిన తర్వాత, యూఎస్‌ స్టాక్ మార్కెట్‌లో పతనం కొనసాగింది. బుధవారం, ఆ నష్టాలను పూడ్చుకున్న రోజుగా మారింది. 2022 మార్చిలో బిలియనీర్ల సంపద ఒక్క రోజులో 233 బిలియన్లు పెరిగింది, ఆ రికార్డ్‌ను బుధవారం నాటి పెరుగుదల బద్దలు కొట్టింది.

36 బిలియన్లు పెరిగిన ఎలాన్‌ మస్క్ సంపద వైట్‌హౌస్‌ సుంకాల విరామం వల్ల, ట్రంప్ స్నేహితుడు ఎలాన్ మస్క్‌కు కంపెనీ టెస్లా ఎక్కువ లాభపడింది. ఈ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ స్టాక్ బుధవారం 23% పెరగడంతో, బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్ సంపద ‍‌(Elon Musk net worth) ఒక్క రోజులో 36 బిలియన్‌ డాలర్లు పెరిగింది. మెటా షేర్లు 12.66% రాణించడంతో మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg net worth) ఒక్క రోజులో 26 బిలియన్ల లాభం పొందారు. 

గ్లోబల్‌ చిప్‌ తయారీ కంపెనీ ఎన్‌విడియా షేర్లు దాదాపు 19% ర్యాలీ చేయడంతో, ఈ కంపెనీకి చెందిన జెన్సెన్ హువాంగ్ సంపద విలువ 15.5 బిలియన్‌ డాలర్లు పెరిగింది. శాతం పరంగా చూస్తే కార్వానా కంపెనీకి CEO ఎర్నెస్ట్ గార్సియా III అతి పెద్ద లాభం ఆర్జించారు, ఆయన సంపద సింగిల్‌ డేలో 25% పెరిగింది. ఆపిల్ షేర్లు 9.38%, అమెజాన్ షేర్లు 10.24%, మైక్రోసాఫ్ట్ షేర్లు 8.47%, గూగుల్ షేర్లు 7.83% చొప్పున పెరిగాయి.

ఆసియా మార్కెట్లుఅమెరికా స్టాక్‌ మార్కెట్ల జోరు ఆసియా-పసిఫిక్ ప్రాంత మార్కెట్లకు కూడా అంటుకుంది. గురువారం (10 ఏప్రిల్‌ 2025) ఆసియా మార్కెట్లు (Asia stock Markets) ఈ రోజు (గురువారం, 10 ఏప్రిల్‌ 2025) ప్రారంభ ట్రేడ్‌లో మహా హుషారు చూపించాయి. జపాన్‌ నిక్కీ 8 శాతం పైగా జంప్‌ చేసింది. ఆస్ట్రేలియా ASX ఇండెక్స్‌ 4.7 శాతం, దక్షిణ కొరియా కోస్పి 4.9 శాతం, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ 2.8 శాతం, తైవాన్‌ ఇండెక్స్‌ 9.2 శాతం చొప్పున ఎగబాకాయి.

మహవీర్‌ జయంతిని సందర్భంగా ఈ రోజు (గురువారం) భారతీయ స్టాక్‌ మార్కెట్లకు సెలవు.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. "abp దేశం" ఎవరికీ, ఎప్పుడూ పెట్టుబడి సలహాలు ఇవ్వదు. పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది.