Walmart Buys Stake In Flipkart: మన దేశంలో మోస్ట్‌ పాపులర్‌ ఇ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో, గ్రోబల్‌ జెయింట్‌ వాల్‌మార్ట్ (Walmart) మళ్లీ వాటా కొనుగోలు చేసింది. హెడ్జ్ ఫండ్ టైగర్ గ్లోబల్‌ (Tiger Global) నుంచి ఆ స్టేక్‌ తీసుకుంది. ఇందుకోసం టైగర్‌ గ్లోబల్‌కు వాల్‌మార్ట్‌ 1.4 బిలియన్‌ డాలర్లు (11.5 వేల కోట్ల రూపాయలు) చెల్లించిందని వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్‌ చేసింది.


ఈ లావాదేవీ కోసం, ఫ్లిప్‌కార్ట్ విలువను 35 బిలియన్ డాలర్లుగా లెక్క కట్టారు. 2021లో వాల్‌మార్ట్‌ సహా మరికొన్ని ఇన్వెస్టింగ్‌ కంపెనీలు ఫ్లిప్‌కార్ట్‌లో తమకున్న కొంత వాటాను అమ్మేశాయి. ఆ షేర్లను జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ గ్రూప్‌ కొనుగోలు చేసింది. ఆ ట్రాన్జాక్షన్స్‌ కోసం, అప్పట్లో ఫ్లిప్‌కార్ట్‌ విలువను 38 బిలియన్‌ డాలర్లుగా లెక్క కట్టారు. 


ఫ్లిప్‌కార్ట్ నుంచి టైగర్ గ్లోబల్ ఎగ్జిట్‌ 
ఫ్లిప్‌కార్ట్‌లో మొదట పెట్టుబడి పెట్టిన ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలు యాక్సెల్ (Accel), టైగర్ గ్లోబల్ (Tiger Global). ఈ రెండు కంపెనీలు, ఫ్లిప్‌కార్ట్‌లో తమకు మిగిలున్న వాటాను వాల్‌మార్ట్‌కు అమ్మడానికి కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. టైగర్ గ్లోబల్‌కు ఇ-కామర్స్‌ కంపెనీలో దాదాపు 4% స్టేక్‌ ఉంది. ఈ మొత్తం స్టేక్‌ ఇప్పుడు వాల్‌మార్ట్‌ చేతిలోకి వెళ్లింది, ఆ కంపెనీ ఓనర్‌షిప్‌ మరింత పెరిగింది.


ఫ్లిప్‌కార్డ్‌ను 2007లో సచిన్‌ బన్సల్‌, బిన్నీ బన్సల్‌ కలిసి స్టార్ట్‌ చేశారు. ఇండియన్‌ స్టార్టప్‌లో పెట్టుబడులు పెట్టే కీలక ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీల్లో టైగర్‌ గ్లోబల్‌ ఒకటి. 2009లో, ఫ్లిప్‌కార్ట్‌లో 8.6 మిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేసింది. ఆ తర్వాత 2010-2015 మధ్య కాలంలో టైగర్‌ గ్లోబల్‌ విడతల వారీగా స్టేక్‌ పెంచుకుంటూ వెళ్లింది, 1.2 బిలియన్‌ డాలర్లు పెట్టుబడిగా పెట్టింది. 2017లో, తన వాటాలో కొంత భాగాన్ని సాఫ్ట్‌బ్యాంక్‌కు అమ్మింది. ఫ్లిప్‌కార్ట్‌లో తన పెట్టుబడిపై 3.5 బిలియన్ల లాభం సాధించినట్లు ఇన్వెస్టర్స్‌కు రాసిన ఓపెన్‌ లెటర్‌లో టైగర్‌ గ్లోబల్‌ ప్రకటించింది.


ఫ్లిప్‌కార్ట్‌లోకి వాల్‌మార్ట్ ఎంట్రీ
2018లో, ఫ్లిప్‌కార్ట్‌లో 77% మెజారిటీ వాటాను సుమారు 16 బిలియన్‌ డాలర్లకు వాల్‌మార్ట్ కొనుగోలు చేసింది. మరో నాలుగేళ్లలో ఫ్లిప్‌కార్ట్‌ IPO తీసుకువచ్చి, స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ చేస్తామని కూడా ప్రకటించింది. వాల్‌మార్ట్‌ చెప్పిన గడువు పూర్తయినా ఆ కంపెనీ ఇప్పటి వరకు IPOకు రాలేదు. అతి త్వరలోనే ఐపీవో అనౌన్స్‌మెంట్‌ వినవచ్చని మార్కెట్‌లో చెప్పుకుంటున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో, లోకల్‌ స్టోర్లు, చిన్న వ్యాపారులను కలిపి ఒక ఆన్‌లైన్ రిటైలింగ్ యాప్‌ను కూడా వాల్‌మార్ట్ లాంచ్‌ చేసింది. 


మరో ఆసక్తికర కథనం: ఇప్పటివరకు 6 కోట్లకు పైగా ఐటీ రిటర్న్స్‌ - ₹5 వేల ఫైన్‌ తప్పించుకోవడానికి ఇదే లాస్ట్‌ ఛాన్స్‌


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial