CRISIL Report On Indian Thali Prices: మాంసాహారం కంటే శాఖాహారం ఎంతో ఆరోగ్యం అని చెబుతుంటారు. అయితే, వెజిటేరియన్‌ ఫుడ్‌ మాత్రమే తినేవాళ్లు కాస్త ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఫక్తు శాఖాహారుల మీద చిల్లర ద్రవ్యోల్బణం (Retail inflation) ప్రభావం ఎక్కువగా ఉంది. మన దేశంలో ఉల్లిపాయలు, టమోటాలు, బంగాళాదుంపల ధరలు పెరగడం వల్ల.. గత ఏడాది మార్చి నెలతో పోలిస్తే ఈ ఏడాది ఇదే కాలంలో శాఖాహార భోజనం ధర పెరిగింది. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ (CRISIL) ఈ డేటాను విడుదల చేసింది.


7 శాతం పెరిగిన వెజ్ థాలీ ధర
క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ & అనలిటిక్స్ 'రోటీ రైస్ రేట్' (RRR) ఇండెక్స్ ప్రకారం... ఉల్లిపాయలు, టమోటాలు, బంగాళాదుంపలు, ఇతర కూరగాయల రేట్లు పెరగడం వల్ల మార్చిలో వెజ్ థాలీ ధర 7 శాతం పెరిగింది. 2023 మార్చిలో రూ. 25.50 గా ఉన్న ప్లేట్‌ వెజ్ థాలీ ధర 2024 మార్చిలో రూ. 27.30 కి (Vegetarian Thali Price) చేరింది. అయితే, 2024 ఫిబ్రవరిలోని రూ. 27.40తో పోలిస్తే మార్చిలో శాఖాహార భోజనం ధర తగ్గింది. ఒక ప్లేట్‌ శాఖాహార భోజనంలో రోటీ, ఉల్లిపాయ, టమోటా, బంగాళదుంపలు, బియ్యం, పప్పు, పెరుగు, సలాడ్ ఉంటాయి. 


మన దేశంలో ఉల్లి, బంగాళదుంపలు వంటి కూరగాయల సరఫరాలో తగ్గిందని క్రిసిల్ తన నివేదికలో వెల్లడించింది. గత ఏడాది కంటే ఈసారి ఉల్లి ధరలు 40 శాతం, టమాటా ధరలు 36 శాతం, బంగాళదుంప ధరలు 22 శాతం పెరగడంతో శాఖాహార భోజనం ఖరీదుగా మారింది. ఏడాది క్రితంతో పోలిస్తే బియ్యం ధరలు కూడా 14 శాతం, పప్పుల ధరలు 22 శాతం పెరిగాయని నివేదికలో ఉంది.


తగ్గిన నాన్ వెజ్ థాలీ రేటు 
వెజ్ మీల్స్‌ మరింత ఖరీదుగా మారిన కాలంలోనే పౌల్ట్రీ ధరలు తగ్గడం వల్ల నాన్ వెజ్ థాలీ (Non-vegetarian Thali Price) ధర 7 శాతం తగ్గిందని క్రిసిల్ వెల్లడించింది. నాన్ వెజ్ థాలీ ధర 2023 మార్చిలో రూ. 59.20 ఉండగా, ఈ ఏడాది అదే నెలలో రూ. 54.90 గా ఉంది. అయితే, 2024 ఫిబ్రవరి నెలలోని రూ. 54తో పోలిస్తే ఇప్పుడు ధర ఇంకా పెరిగింది. ఒక ప్లేట్‌ మాంసాహార భోజనంలో బ్రాయిలర్ చికెన్ ఉంటుంది, మిగిలినవన్నీ వెజ్ థాలీలో ఉన్న ఐటమ్సే (పప్పు తప్ప) ఉంటాయి.


బ్రాయిలర్ చికెన్ ధరలు 16 శాతం తగ్గడంతో నాన్ వెజ్ థాలీ ధర తగ్గింది. మాంసాహార భోజనంలో బ్రాయిలర్ చికెన్‌ వాటా 50 శాతం. మార్చి నెలలో రంజాన్ మాసం ప్రారంభం కావడం, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఫిబ్రవరితో పోలిస్తే బ్రాయిలర్ ధరలు ఐదు శాతం పెరిగాయి. క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ డైరెక్టర్ రీసెర్చ్ పూషన్ శర్మ చెప్పిన ప్రకారం, గత ఐదు నెలల్లో వెజ్ & నాన్ వెజ్ థాలీ ధరల్లో చాలా మార్పు వచ్చింది. ఈ కాలంలో వెజ్ మీల్స్‌ రేటు పెరిగితే, నాన్‌ వెజ్‌ మీల్స్‌ చౌకగా మారింది.