Vande Bharat Train Ticket Reservation: మన దేశంలో అత్యంత వేగవంతమైన రైళ్లలో వందే భారత్ రైలు ఒకటి. ప్రస్తుతం, వివిధ మార్గాల్లో వివిధ నగరాలను కలుపుతూ దేశవ్యాప్తంగా 100కు పైగా వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. వందే భారత్ రైలు ఒక ప్రీమియం రైలు (Premium Train). ఇందులో ప్రయాణం చేసే వాళ్లకు చాలా సౌకర్యాలు లభిస్తాయి. చాలా మంది ప్రజలు వందే భారత్‌ రైల్లో జర్నీ చేసేందుకు ఇష్టపడటానికి ఇదే కారణం.


కిటకిటలాడుతున్న వందే భారత్‌ రైళ్లు
ఒక లెక్క ప్రకారం, వందే భారత్ రైలులో 92 శాతం వరకు సీట్లు నిండిపోతున్నాయి. అంటే, ఈ రైళ్లు ఎప్పుడు చూసినా కిటకిటలాడుతుంటాయి. కాబట్టి, వందే భారత్ రైలులో ప్రయాణించాల్సి వస్తే మీరు ముందుగానే సీట్‌ బుక్‌/ రిజర్వేషన్‌ చేసుకోవాలి. ముందు జాగ్రత్త పడిన వాళ్లే కన్ఫర్మ్ సీటు పొందగలరు. ఎన్ని రోజుల ముందు బుక్‌ చేసుకుంటే వందేభారత్ రైలులో సీట్‌ కన్ఫర్మ్‌ అవుతుందో తెలుసుకుంటే, మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ జర్నీని ఎంజాయ్‌ చేస్తారు.


ప్రయాణానికి ముందు అడ్వాన్స్‌ బుకింగ్‌
డిమాండ్‌ కారణంగా, వందే భారత్ రైళ్లు ఎప్పుడు చూసినా ప్రయాణికులతో నిండిపోయి కనిపిస్తాయి. మీరు ఈ ప్రీమియం ట్రైన్‌లో జర్నీ చేయాలి అనుకున్నప్పుడు, ప్రయాణానికి కేవలం కొన్ని రోజుల ముందు టిక్కెట్లు బుక్‌ చేసుకోవాలని చూస్తే ఫలితం ఉండకపోవచ్చు. ఊదాసీనంగా ఉండకుండా, మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసిన వెంటనే మీ టిక్కెట్లను బుక్ చేసుకోవడం ముఖ్యం. వందే భారత్‌ రైళ్లలో రద్దీని బట్టి చూస్తే, సాధారణ రోజుల్లో, మీ ప్రయాణ తేదీకి కనీసం 30 రోజుల ముందుగానే, అంటే ఒక నెల ముందే రిజర్వేషన్‌ కోసం ప్రయత్నించాలి. పీక్ టైమ్‌లో ప్రయాణించాలంటే, అంటే ఏదైనా పండుగ లేదా నూతన సంవత్సర సమయం వంటి సందర్భాల్లో 30 రోజులకు బదులు 60 రోజుల ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం మంచిది. ఇలా చేస్తేనే మీకు సీట్‌ కన్ఫర్మేషన్‌ అవకాశాలు పెరుగుతాయి.


ముందస్తు టిక్కెట్ బుకింగ్ రూల్స్‌లో మార్పు
రైలు ప్రయాణీకుల భద్రత, ప్రయోజనాల కోసం భారతీయ రైల్వే చాలా నియమాలు (Indian Railway Rules) అమలు చేస్తోంది. వీటిలో, అడ్వాన్స్ టిక్కెట్‌ బుకింగ్ (Advance Ticket Booking) విషయంలోనూ ఓ రూల్ ఉంది. గతంలో, రైలు ప్రయాణం కోసం అడ్వాన్స్ బుకింగ్ చేయడానికి 120 రోజులు సమయం ఉండేది. అంటే, ప్రయాణ తేదీకి దాదాపు 4 నెలల ముందుగానే ట్రైన్‌ టిక్కెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. కానీ నవంబర్ 01, 2024 నుంచి భారతీయ రైల్వే ఈ నిబంధన మార్చింది. 120 రోజుల అడ్వాన్స్‌ బుకింగ్‌ వ్యవధిని 60 రోజులకు తగ్గించింది. ఇప్పుడు, ప్రయాణీకులకు టిక్కెట్‌ అడ్వాన్స్ బుకింగ్ కోసం కేవలం రెండు నెలల సమయం మాత్రమే లభిస్తుంది. వందే భారత్‌ రైళ్లకు కూడా ఇదే నియమం వర్తిస్తుంది. కాబట్టి, మీరు వందే భారత్‌లో ప్రయాణించాలనుకుంటే, 60 రోజుల ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోండి. దీనివల్ల టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. 


మరో ఆసక్తికర కథనం: మీ హోమ్‌ లోన్‌లో లక్షలాది రూపాయలు ఆదా + అదనపు లాభం - ఈ చిన్న మార్పుతో..