Signature Bank: అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (Silicon Valley Bank) తుపాను ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ తుపాను దెబ్బకు ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అయ్యాయి, సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ గాలివాన ప్రభావం ఇంకా తగ్గకముందే, అగ్రరాజ్యంలో మరో టెక్‌ ఫ్రెండ్లీ బ్యాంక్‌ మూతబడింది. ఆ బ్యాంక్‌ పేరు సిగ్నేచర్‌ బ్యాంక్‌ (Signature Bank). న్యూయార్క్‌ కేంద్రంగా పని చేస్తోందిది. స్థిరాస్తి, డిజిటల్‌ అసెట్స్‌ బ్యాంకింగ్‌ సహా మొత్తం తొమ్మిది విభాగాల్లో ఈ బ్యాంకు సేవలు అందిస్తున్నా... మొత్తం డిపాజిట్లలో మూడో వంతు క్రిప్టో రంగం నుంచే వచ్చాయి.


బ్యాంక్‌ మరింత కుప్పకూలకుండా..
గత బుధవారం సాయంత్రం నుంచి సిగ్నేచర్‌ బ్యాంక్‌ విలువ పతనమవుతూ వచ్చింది, మొత్తం విలువలో మూడింట ఒక వంతును కోల్పోయింది. దీంతో ఈ బ్యాంక్‌ను మూసివేస్తున్నట్లు అక్కడి ఆర్థిక, బ్యాంకింగ్‌ నియంత్రణ సంస్థలు ఆదివారం ప్రకటించాయి. బ్యాంక్‌ మరింత కుప్పకూలకుండా నియంత్రణ సంస్థలు తీసుకున్న చర్య ఇది. అమెరికాలో రెండు రోజుల వ్యవధిలో మూతబడిన రెండో బ్యాంక్‌ ఇది. ఈ వార్త బయటకు వచ్చాక ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా ఆందోళనలోకి జారుకున్నాయి. మదుపర్లు విచ్చలవిడిగా అమ్మకాలకు దిగారు, ముఖ్యంగా బ్యాంక్‌ స్టాక్స్‌ను విపరీతంగా అమ్మడం మొదలు పెట్టారు.


భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు
ప్రపంచ సంకేతాలు ప్రతికూలంగా మారడంతో భారత స్టాక్‌ మార్కెట్లు కుదేలయ్యాయి. ఇవాళ నష్టాల్లోనే ప్రారంభం అయినా, ఆ తర్వాత క్రమంగా పడిపోతూ భారీ నష్టాల్లోకి మారాయి. ఇవాళ (సోమవారం, 13 మార్చి 2023) మధ్యాహ్నం 2.30 గంటల సమయానికి BSE సెన్సెక్స్‌ 1.61% లేదా 950 పాయింట్ల నష్టంతో 58,201 వద్ద ఉంది. NSE నిఫ్టీ50 1.57% లేదా 272 పాయింట్ల నష్టంతో 17,140 వద్ద ఉంది. ఇదే సమయానికి నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2.27% లేదా 921 పాయింట్లు క్షీణించి 39,561 వద్ద ఉంది.


బ్యాంక్‌ డిపాజిట్ల ఇన్సూరెన్స్‌ కంపెనీ ‘ది ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌' (FDIC), సిగ్నేచర్‌ బ్యాంకును తన ఆధీనంలోకి తీసుకుంది. 2022 చివరి నాటికి సిగ్నేచర్‌ బ్యాంక్‌ వద్ద 110.36 బిలియన్‌ డాలర్ల ఆస్తులు, 88.59 బిలియన్‌ డాలర్ల విలువైన డిపాజిట్లు ఉన్నాయి. ఈ బ్యాంకు డిపాజిటర్లు ఆందోళన చెందవద్దని, నిధులు ఉపసంహరించుకునేందుకు అనుమతి ఉంటుందని FDIC ప్రకటించింది. ఇందుకోసం తాత్కాలికంగా ఓ ‘బ్రిడ్జ్‌ బ్యాంక్‌’ను ఏర్పాటు చేశామని వెల్లడించింది. దీని ద్వారా సిగ్నేచర్‌ కస్టమర్లు, డిపాజిటర్లు తమ ఫండ్స్‌ను యాక్సెస్‌ చేయవచ్చని తెలిపింది. 


SVB విషయంలో US ట్రెజరీ ఒక కీలక ప్రకటన చేసింది. SVB డిపాజిటర్లు సోమవారం నుంచి (మార్చి 13) "వారి డబ్బు మొత్తాన్ని" యాక్సెస్‌ చేసుకోవచ్చని వెల్లడించింది.


SVB, సిగ్నేచర్‌ బ్యాంక్‌ ఉదంతం తర్వాత డిపాజిట్‌దార్లు అమెరికాలోని అన్ని బ్యాంక్‌ శాఖల ఎదుట క్యూ కట్టారు, డిపాజిట్లు వెనక్కు తీసుకోవడం మొదలు పెట్టారు. దీంతో, బ్యాంకులకు అవసరమైన డబ్బు అందుబాటులో ఉంచడానికి 25 మిలియన్‌ డాలర్లతో తాత్కాలిక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ఫెడ్‌ ప్రకటించింది. 


రంగంలోకి అమెరికా అధ్యక్షుడు
రెండు వరుస రోజుల్లో రెండు బ్యాంక్‌లు పతనం కావడంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్వయంగా రంగంలోకి దిగారు. బ్యాంక్‌ల పతనానికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. డిపాజిట్‌దార్లు ఆందోళన చెందవద్దని, వాళ్ల డబ్బు సురక్షితంగా ఉందని హామీ ఇచ్చారు.