Uber Moto Women Service: యాప్ ఆధారిత టాక్సీ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ ఉబెర్‌, "ఉబెర్‌ మోటో ఉమెన్" (Uber Moto Women) పేరిట కొత్త సర్వీస్‌ను ప్రారంభించింది. ఇది, ప్రపంచంలోనే తొలిసారిగా, మహిళలు నిర్వహించే మొట్టమొదటి బైక్ రైడింగ్ సర్వీస్. మొదటి దశలో, బెంగళూరులో ఈ కొత్త సేవను ఉబెర్‌ ప్రారంభించింది. ఆ తర్వాత దిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌ సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ త్వరలో ప్రారంభించబోతోంది. ఉబెర్‌ మోటోకు చెందిన మహిళా రైడర్‌లు మహిళా కస్టమర్‌లకు సర్వీస్‌ అందిస్తారు, తద్వారా భద్రత విషయంలో వారి ఆందోళనలు దూరం చేస్తారు. ఈ మహిళా రైడర్‌లు పురుషులకు కూడా ఈ సేవను అందించవచ్చు.

మహిళా రైడర్ల సర్వీస్‌ మాత్రమే కాకుండా, స్త్రీ లేదా పురుష ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఉబెర్‌ మరికొన్ని లక్షణాలను (features) కూడా జోడించింది. కస్టమర్‌ రైడ్‌ కోసం టాక్సీ లేదా బైక్‌ బుక్‌ చేసుకున్నప్పుడు, ఆ రైడ్‌ వివరాలను మీ ఐదుగురు సన్నిహుతులతో పంచుకోవచ్చు. తద్వారా, మీరు ఏ వాహనంలో ఉన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడి వెళ్తున్నారు, సురక్షితంగా గమ్యస్థానం చేరారా లేదా వంటి వివరాలన్నింటినీ మీ సన్నిహుతులు గమనిస్తారు. రైడ్‌ కోసం బుక్ చేసిన తర్వాత, మీ సంప్రదింపు వివరాలు బయటవారికి వెళ్లకుండా కంపెనీ గోప్యంగా ఉంచుతుంది. అపరిచితులు లేదా అనుమానాస్పద వ్యక్తులకు మీ ప్రయాణ వివరాలు అందకుండా చూస్తుంది.

రైడ్‌ చెక్‌ ఫీచర్‌ఇది కాకుండా, రైడ్‌ చెక్‌ (RideCheck) అనే ఫీచర్‌ను కూడా ఉబెర్‌ జోడించింది. దీని ద్వారా, రైడ్‌ బుక్‌ చేసిన వ్యక్తి, తన ప్రయాణ సమయంలో మొత్తం మార్గాన్ని పర్యవేక్షించగలడు. దీంతో పాటు, మహిళలకు 24x7 హెల్ప్‌లైన్ సర్వీస్‌ కూడా అందుబాటులో ఉంటుంది.

బెంగుళూరులో బైక్ టాక్సీ సర్వీస్‌కు డిమాండ్‌KPMG డేటా ప్రకారం, భారతదేశంలో బైక్ టాక్సీ (Bike Taxi) సర్వీస్‌కు డిమాండ్ పెరుగుతోంది. బెంగళూరులోని పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్‌ను ఛేదించుకుని సకాలంలో గమ్యస్థానానికి చేరడానికి బైక్ రైడింగ్ సేవను ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పైగా, క్యాబ్‌తో పోలిస్తే దీని ధర తక్కువ. ఈ టెక్‌ వ్యాలీలో, ఒక నెలలో, సగటున 10 లక్షల మందికి పైగా యూజర్లు బైక్ రైడింగ్ సర్వీస్‌ను వినియోగించుకుంటున్నారు. ఈ రంగంలో 60 శాతం మార్కెట్ వాటాతో రాపిడో (Rapido) అగ్రగామిగా కొనసాగుతోందని వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే, కస్టమర్లను, ముఖ్యంగా మహిళా కస్టమర్లను పెంచుకునేందుకు ఉబెర్‌ కంపెనీ 'ఉబెర్‌ మోటో ఉమెన్'ను ప్రారంభించింది.

కొన్ని రాష్ట్రాల్లో బైక్‌ టాక్సీ సర్వీస్‌పై నిషేధంబైక్ టాక్సీ సేవలను ఓలా (Ola), ఉబెర్‌, రాపిడో అందిస్తున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాలు రైడ్ సేవల కోసం ద్విచక్ర వాహనాల వినియోగాన్ని నిషేధించాయి. తక్కువ ధర కారణంగా ప్రజలు బైక్‌ ట్యాక్సీ సేవలను ఎక్కువగా వినియోగిస్తున్నారని,  తమకు నష్టం వాటిల్లుతుందని టాక్సీ యూనియన్‌లు, ఆటో డ్రైవర్లు బైక్‌ టాక్సీలను వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో, మోటార్‌ సైకిళ్లను కాంట్రాక్ట్ క్యారేజీ కింద చేర్చేందుకు మోటారు వాహనాల చట్టాన్ని సవరించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కాంట్రాక్ట్ క్యారేజ్ అంటే ప్రయాణీకులను తీసుకెళ్లేందుకు అద్దెకు తీసుకున్న వాహనం.

మరో ఆసక్తికర కథనం: ఈ ఏడాది UPIలో వచ్చిన కీలక మార్పులు, ఆశ్చర్యపరిచే ఫీచర్‌లు ఇవీ