UPI Changes in 2024: బజ్జీలు కొన్నా - బెంజ్ కార్ కొన్నా ఆన్‌లైన్ ద్వారా చెల్లింపు చేయడం ఇప్పుడు భారతీయుల అలవాటుగా మారింది. నేరుగా డబ్బులిచ్చే ధోరణి క్రమంగా తగ్గుతోంది. ఆన్‌లైన్ పేమెంట్ కోసం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (Unified Payments Interface - UPI)ని ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. నవంబర్ 2024లో NPCI (National Payments Corporation of India) విడుదల చేసిన డేటా ప్రకారం, 2024లో ఇప్పటి వరకు UPI ద్వారా దాదాపు 15,482 మిలియన్ల లావాదేవీలు జరిగాయి. ఈ మొత్తం లావాదేవీల విలువ రూ. 21,55,187.4 కోట్లు. యూపీఐ వ్యవస్థలో, ఈ ఏడాది (2024) కొన్ని కీలక మార్పులు వచ్చాయి, జనానికి మరింత చేరువయ్యాయి.
కొన్ని కేటగిరీల్లో పెరిగిన UPI పరిమితి
2024 ఆగస్టులో, NPCI కొన్ని కేటగిరీల కింద UPI లావాదేవీల పరిమితిని రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచింది. వీటిలో.. ప్రత్యక్ష పన్నులు & పరోక్ష పన్నుల చెల్లింపు, ఆసుపత్రులు & విద్యా సంస్థలకు ఫీజుల చెల్లింపు ఉన్నాయి. దీంతోపాటు, IPO లేదా RBI రిటైల్ డైరెక్ట్ స్కీమ్ కోసం దరఖాస్తు చేస్తుంటే, దాని పరిమితి రూ. 5 లక్షల వరకు పెంచారు. బీమా & స్టాక్ మార్కెట్లకు సంబంధించిన లావాదేవీల పరిమితి రూ. 2 లక్షలుగా ఉంచారు.
వాలెట్ పరిమితి పెంపు
ఆర్‌బీఐ, ఈ సంవత్సరం, యూపీఐ లైట్ (UPI Lite), యూపీఐ123పే (UPI123Pay) రెండింటి పరిమితులను పెంచింది. దీనికి ముందు, యూపీఐ లైట్ కోసం వాలెట్ పరిమితి రూ. 2,000గా ఉంటే, దానిని రూ. 5,000కు పెంచింది. చిన్న చెల్లింపులకు UPI లైట్ మంచి ఆప్షన్‌గా మారింది. దీని ద్వారా చెల్లింపు పరిమితిని రూ. 500 నుంచి రూ. 1,000 కు పెంచింది.
UPI123PAY పరిమితిని కూడా రూ. 5,000 నుంచి రూ. 10,000కి కేంద్ర బ్యాంక్ పెంచింది. దీని ద్వారా, స్మార్ట్ ఫోన్ లేదా ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా కూడా UPI పేమెంట్స్ చేయవచ్చు. ఇందులో, వినియోగదారులు మిస్డ్ కాల్ ఇవ్వడం లేదా IVR నంబర్‌ను డయల్ చేయడం ద్వారా లావాదేవీలు చేయవచ్చు.
యూపీఐ సర్కిల్ పేరుతో కొత్త ఫీచర్
NPCI, ఈ సంవత్సరం, యూపీఐ సర్కిల్ (UPI Circle) అనే కొత్త ఫీచర్ ప్రారంభించింది. దీని ద్వారా, కుటుంబ సభ్యులను యాడ్ చేసుకోవచ్చు. UPI - బ్యాంక్ ఖాతా లింక్ కాకపోయినప్పటికీ సర్కిల్‌లోని వ్యక్తి UPI ద్వారా పేమెంట్ చేయగలడు. దీనిలో, ద్వితీయ వినియోగదారు UPI ద్వారా చెల్లింపు చేసినప్పుడు, దాని నోటిఫికేషన్ ప్రాథమిక వినియోగదారుకు వస్తుంది. ప్రాథమిక వినియోగదారు ఆమోదం పొందిన తర్వాత మాత్రమే చెల్లింపు పూర్తవుతుంది. ఇందులో, UPI IDని కలిగి ఉన్న వ్యక్తి ప్రాథమిక వినియోగదారుగా, UPI సర్కిల్‌లోకి లింక్ అయిన వ్యక్తిని ద్వితీయ వినియోగదారుగా పిలుస్తారు. దీనిలో నెలవారీ పరిమితిని రూ. 15,000 వరకు సెట్ చేయవచ్చు. అంటే, UPI సర్కిల్‌కు కనెక్ట్ అయిన యూజర్లు ఒక నెలలో రూ. 15,000 వరకు చెల్లింపులు చేయగలరు. చెల్లింపు చేయాల్సిన ప్రతిసారీ ప్రైమరీ యూజర్ అనుమతి అవసరం.
UPI లైట్ వాలెట్ యూజర్లకు కూడా సౌలభ్యం
RBI, ఈ సంవత్సరం, యూపీఐ లైట్ వాలెట్ల కోసం అదనపు ప్రమాణీకరణ లేదా ప్రి-డెబిట్ నోటిఫికేషన్ అవసరాన్ని తొలగించింది. అంటే... మీ వాలెట్‌లోని డబ్బులు మీరు సెట్ చేసిన పరిమితి కంటే తక్కువగా ఉంటే, లింక్డ్ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు ఆ వాలెట్‌కు ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్ అవుతాయి. తద్వారా, వాలెట్ ఎప్పుడూ నిండుగా ఉంటుంది, ఆన్‌లైన్ చెల్లింపుల సమయంలో మీరు ఇబ్బంది పడకుండా చూస్తుంది.
మరో ఆసక్తికర కథనం: స్విగ్గీ కొత్త ప్రీమియం ప్లాన్ - అపరిమిత ఫ్రీ డెలివెరీలు, డిస్కౌంట్‌లు, OTT ఆఫర్లు!