YCP has boycotted the elections of irrigation societies: ఎన్నికల్లో పోటీ చేయడానికి వైసీపీ ముందుకు రావడం లేదు. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించిన వైసీపీ తాజాగా సాగునీటి సంఘాల ఎన్నికలనూ బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించింది. సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఆయా జిల్లాల్లో ప్రభుత్వ సూచనలతో అధికార యంత్రాంగం సాయంతో అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తోంది. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న అత్యంత దారుణ వైఖరికి నిరసనగా, ఎన్నికలు బహిష్కరించాలని జగన్ నిర్ణయించారు.
అక్రమాలు చేశారని వైసీపీ ఆరోపణలు
సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి నేతలు రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాన్ని ప్రయోగించి నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని ఆరోపించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం సాగునీటి సంఘాల అడిగిన చోట్ల సీక్రెట్ బ్యాలెట్ ప్రకారం ఎన్నికలు జరపాల్సిఉందన్నారు. కానీ అధికారుల ఏకపక్షంగా వ్యవహరించారని ఎన్నికల్లో పాల్గొనాలనుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దౌర్జన్యాలకు దిగారని న్నారు. పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారని మండిపడుతున్నారు. కూటమి పార్టీలకు చెందిన వారు, తమకు గెలిచే అవకాశం లేకపోయినా, దౌర్జన్యంతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎలాగైనా సరే గెలవాలనే ఉద్దేశంతో రౌడీయిజానికి కూడా దిగుతున్నారని ఎన్నికల్లో పాల్గొనడం సరి కాదని వైదొలుగుతున్నట్లుగా ప్రకటించారు.
ఇప్పటికే గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బహిష్కరణ
ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించింది. అధికారంలో ఉన్నప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకే కాదు.. టీచర్ ఎమ్మెల్సీల్లోనూ పోటీ చేసేవారు. అయితే అధికారం పోయే సరికి ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేని పరిస్థితికి వచ్చారు. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో బ్యాలెట్ తో జరుగుతాయి. ఎన్నికల ఫలితాలు ఈవీఎంల వల్ల వచ్చాయని ఆరోపిస్తున్న వైసీపీ నిరూపించడానికి ఎక్కువ అవకాశం ఉండేది. కానీ అెదికారంలో ఉన్నప్పుడు జరిగిన మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలోనూ ఘోర పరాజయం పాలయ్యారు. ఆ అనుభవంతో ఇప్పుడు పోటీ చేయకపోవడమే మంచిదని అనుకున్నారు.
అధికార పార్టీ అక్రమాలు చేస్తుందన్న కారణంగానే ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఓ ఏడాది తర్వాత స్థానిక ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు జరగాల్సి ఉంది. అప్పుడు కూడా ఇదే కారణంతో బహిష్కరిస్తారా అన్న డౌట్స్ వస్తాయి. ఎందుకంటే ఆ ఎన్నికల్లో గెలవడానికి అధికార పార్టీ అప్పుడు కూడా వైసీపీ చెబుతున్న అధికార దుర్వినియోగం చేసి తీరుతుంది. గతంలో పంచాయతీలు, మున్సిపల్ ఎన్నికలు వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన తీరునకు నిరసనగా టీడీపీ ఎన్నికలను బహిష్కరించింది. ఇప్పుడు వైసీపీ కూడా అలా చేస్తే స్థానిక సంస్థల్లో అసలు ప్రజా ప్రతినిధులే లేకుండా పోతారు. ఎన్నికలు ఎలా జరిగినా పోటీ చేయడమే ప్రజాస్వామ్యంలో పార్టీ బలంగా ఉండటానికి ఉపయోగపడుతుందని అంటున్నారు.