Adani Group Stocks: అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో సుప్రీంకోర్టు ప్యానెల్ కమిటీ నివేదిక తర్వాత, అదానీ గ్రూప్ స్టాక్స్ ప్రతిరోజూ ఆకాశాన్ని అంటుతున్నాయి. జనవరి 24న హిండెన్‌బర్గ్ రీసెర్చ్ బ్లాసింగ్ రిపోర్ట్ తర్వాత దారుణంగా నష్టపోయిన అదానీ కౌంటర్లు ఇప్పుడు లాభాలతో కళకళలాడుతున్నాయి. గ్రూప్‌లోని రెండు స్టాక్స్ మల్టీబ్యాగర్లుగా మారాయి.
రెండు మల్టీబ్యాగర్ స్టాక్స్
అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ (Adani Enterprises) కేవలం మూడు రోజుల్లోనే 38% ర్యాలీ చేసింది. అంతేకాదు, జనవరి చివరి నుంచి వచ్చిన నష్టాలన్నింటినీ భర్తీ చేసింది. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ తర్వాత టచ్ చేసిన 52 వారాల కనిష్ట స్థాయి నుంచి ఇప్పటి వరకు ఈ స్టాక్ 129% పెరిగింది. ఈ రోజు (మంగళవారం, 23 మే 2023) ట్రేడ్‌లో స్టాక్ రూ. 2,759.45 కి పెరిగింది. ఇది, ఫిబ్రవరి 1 నుంచి గరిష్ట స్థాయి.
స్టేబుల్ నుంచి మల్టీబ్యాగర్‌గా మారిన మరో స్టాక్ అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy). ఇది జనవరి కనిష్ట స్థాయి నుంచి 114% జూమ్ అయింది. కేవలం 3 సెషన్లలోనే కౌంటర్ 15% లాభపడింది.
అదానీ గ్రూప్ మీద వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సుప్రీంకోర్టు మరో రెండు నెలల గడువే ఇచ్చినప్పటికీ, రిపోర్ట్‌లోని ప్రాథమిక అంశాలు అదానీ గ్రూప్‌నకు వ్యతిరేకంగా లేవు. దీంతో దలాల్ స్ట్రీట్ ఊపిరి పీల్చుకుంది, ఆ ఉత్సాహం షేర్ ధరల్లో కనిపించింది.
87% వరకు ర్యాలీ చేసిన గ్రూప్ షేర్లు
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ తర్వాత బాగా నష్టపోయినా, తిరిగి లాభాల వైపు చూసిన గ్రూప్‌లోని మొదటి కంపెనీ అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్ (Adani Ports and SEZ). ఈ షేరు ఈ రోజు 8% వరకు ర్యాలీ చేసి ఇంట్రాడే గరిష్ట స్థాయి రూ. 785.95ని తాకింది. జనవరి 24న, హిండెన్‌బర్గ్ రిపోర్ట్ బయటకు రావడానికి ముందు, ఈ షేరు రూ. 761.20 వద్ద ముగిసింది. ఇప్పుడు, 52 వారాల కనిష్ట స్థాయి నుంచి 84% పుంజుకుంది.
వరుసగా మూడో సెషన్‌లో 5% అప్పర్ సర్క్యూట్‌ను తాకిన అదానీ పవర్ (Adani Power) షేర్లు, 52 వారాల కనిష్ట స్థాయి నుంచి 87% ర్యాలీ చేశాయి.
న్యూఢిల్లీ టెలివిజన్ (NDTV), అదానీ ట్రాన్స్‌మిషన్ (Adani Transmission), అదానీ విల్మార్ (Adani Wilmar), అంబుజా సిమెంట్స్ (Ambuja Cements) కూడా వాటి 52 వారాల కనిష్ట స్థాయి నుంచి వరుసగా 25%, 31%, 34%, 36% కోలుకున్నాయి.
జనవరి కనిష్టాల నుంచి ఇంకా రికవరీ కనిపించని స్క్రిప్స్ ACC, అదానీ టోటల్ గ్యాస్ (Adani Total Gas). ఈ రెండు స్టాక్‌లు వాటి 52 వారాల కనిష్ట స్థాయుల నుంచి కేవలం 14% మాత్రమే పుంజుకున్నాయి.
అదానీ గ్రూప్ స్టాక్స్‌లో, హై వాల్యుయేషన్ కారణంగా అదానీ టోటల్ గ్యాస్ ఎక్కువగా దెబ్బతింది.
ఇది కూడా చదవండి: బెజోస్ తన ప్రియురాలికి ప్రజెంట్ చేసిన పడవ ఎంత స్పెషలో తెలుసా?
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.