Twitter Blue Tick News: నెలనెలా ఛార్జీ చెల్లించిన వారికి మాత్రమే ట్విట్టర్ అకౌంట్ లెగసీ బ్లూ చెక్ మార్క్‌ను ఏప్రిల్ 20, 2023 నుంచి ఇస్తామన్న ఎలాన్ మస్క్ ప్రకటన అమల్లోకి వచ్చింది. బుధవారం అర్థరాత్రి తర్వాత (తెల్లవారితే గురువారం), చాలా మంది సెలబ్రిటీల బ్లూ టిక్‌లు ఒక్కసారిగా మాయమయ్యాయి. ట్విట్టర్ బ్లూ కోసం సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారికి మాత్రమే ఇకపై బ్లూ టిక్ మార్క్‌ను ఆ మైక్రో బ్లాగింగ్ సంస్థ ఇస్తుంది.
గుర్తింపు కోల్పోయిన వ్యాపార సామ్యాధినేతలు
భారతదేశంలోని వ్యాపార సామ్యాధినేతలు, బిలియనీర్ల ట్విట్టర్ అకౌంట్లలో బ్లూ టిక్‌లు మాయం అయ్యాయి. వెటరన్ బిలియనీర్ రతన్ టాటా, మహీంద్ర అండ్ మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర, అదానీ గ్రూప్ ఓనర్ గౌతమ్ అదానీ మొదలుకుని చాలా మంది ప్రముఖ వ్యాపారవేత్తల బ్లూ టిక్‌లు మాయం అయ్యాయి.
రాజకీయ, సినీ, క్రికెట్ రంగాల్లోనూ..
ఒక్క వ్యాపారవేత్తలే కాదు.. అన్ని రంగాల ప్రముఖులు ఎలాన్ మస్క్ బాధితులుగా మారారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సినీ నటులు చిరంజీవి, రామ్‌చరణ్, అల్లు అర్జున్, నాని, రజనీకాంత్, షారుక్‌ఖాన్, సల్మాన్ ఖాన్, క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాల నుంచి బ్లూ చెక్ మార్క్ తొలగించారు. ఇంతకు ముందు, ట్విట్టర్ ఖాతాలో బ్లూ టిక్ తొలగింపునకు సంబంధించిన తేదీని చాలాసార్లు మార్చారు, కానీ ఈసారి నిజంగానే బ్లూ టిక్ తొలగించారు.
ఎన్ని ఖాతాల నుంచి బ్లూ టిక్ తీసివేశారు?
ట్విట్టర్ ఒరిజినల్ బ్లూ చెక్ సిస్టమ్ కింద, దాదాపు 3,00,000 ధృవీకరించిన ఖాతాల గుర్తింపును రద్దు చేశారు. అంటే, ఈ ఖాతాల నుంచి బ్లూ టిక్ కనిపించకుండాపోయింది. వీటిలో ఎక్కువ ఖాతాలు పాత్రికేయులు, క్రీడాకారులు, కళాకారులు ఉన్నారు. గురువారం బ్లూ చెక్‌లను కోల్పోయిన హై-ప్రొఫైల్ యూజర్‌లలో బియాన్స్, పోప్ ఫ్రాన్సిస్, ఓప్రా విన్‌ఫ్రే, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఉన్నారు.
బ్లూ టిక్ తిరిగి పొందడానికి ఏం చేయాలి?
ట్విట్టర్ బ్లూ టిక్ అంటే, సదరు వ్యక్తి లేదా ప్రముఖుడి అధికారిక ట్విట్టర్ ఖాతా అదేనని ధృవీకరించే గుర్తు. ఒక ప్రముఖుడి పేరు మీద ఎన్ని ట్విట్టర్ ఖాతాలు ఉన్నా, బ్లూ టిక్ ఉన్న ఖాతాను అధికారిక ఖాతాగా ఫాలోవర్లు గుర్తిస్తారు, ఆ ఖాతాలో కనిపించే సమాచారాన్ని విశ్వసిస్తారు. ఏప్రిల్ 20, 2023 ముందు వరకు ఈ బ్లూ టిక్ ఉచితం. ఇప్పుడు, ట్విట్టర్ ఆదాయాన్ని పెంచుకునే వ్యూహాల్లో భాగంగా, బ్లూ టిక్‌కు సబ్‌స్క్రిప్షన్ తీసుకువచ్చారు ఎలాన్ మస్క్. అంటే, బ్లూ టిక్ పొందడానికి వినియోగదార్లు నెలనెలా డబ్బు చెల్లించాలి. బ్లూ టిక్ కోసం నెలవారీ రుసుము రూ. 900. వెబ్ వినియోగదార్లు రూ. 650 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. బ్లూ టిక్ అవసరం లేదనుకున్నవాళ్లు ఉచితంగానే ట్విట్టర్ ఖాతాను నిర్వహించుకోవచ్చు.
2022 అక్టోబర్‌లో, మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ట్విట్టర్‌లో చాలా పెద్ద మార్పులు చేశారు. సగం మందికిపైగా ఉద్యోగులను కూడా తొలగించారు.