భారత్పై పగబట్టినట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. రష్యాతో సంబంధాలు కలిగి ఉండమే తప్పు అన్నట్టు ట్రంప్ తన తిక్కనంతా చూపిస్తున్నారు. 2025 ఆగస్టు 7న భారత్పై టారిఫ్ రేటు 50% విధిస్తున్నట్టు పేర్కొన్నారు.రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తున్నందుకు గతంలో విధించిన 25 శాతం టారిఫ్నకు అదనంగా మరో 25 శాతం విధించారు.
రష్యన్ ఆయిల్ విషయంలో అసంతృప్తి: భారతదేశం 2024-25లో రష్యా నుంచి 87.4 మిలియన్ టన్నుల ముడిచమురును దిగుమతి చేసుకుంది, ఇది మొత్తం చమురు దిగుమతులలో 36% వాటా కలిగి ఉంది. యుద్ధానికి ముందు రష్యా వాటా కేవలం 2% లోపు మాత్రమే ఉండేది. 2024లో రష్యా చమురు దిగుమతుల విలువ 52.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
ట్రంప్ ప్రభుత్వ వైఖరి: రష్యాతో భారత్ పెంచుకుంటున్న సంబంధాలు, కొనుగోలు చేస్తున్న ముడిచమురును "జాతీయ భద్రత" సమస్యగా ట్రంప్ పేర్కొంటున్నారు. రష్యా చమురు కొనుగోలు చేసి మాస్కో యుద్ధ యంత్రానికి ఆర్థిక సాయం చేస్తోందనే వాదన తెరపైకి తీసుకొచ్చారు. చైనా, టర్కీ వంటి ఇతర దేశాలు రష్యా చమురు కొనుగోలు చేస్తున్నప్పటికీ, వాటిపై ఇటువంటి టారిఫ్లు విధించలేదు.
ప్రభావితమయ్యే రంగాలు
రష్యా- భారత్ సంబంధాలు తప్పుపడుతూ ట్రంప్ వేసిన 50 శాతం టారిఫ్ వల్ల ప్రధానంగా చాలా రంగాలు ప్రభావితం అవుతాయి. అందులో కొన్నింటి గురించి ఇక్కడ చూద్దాం.
వస్త్ర రంగం
ట్రంప్ టారిఫ్‌ల వల్ల వస్త్ర రంగం అత్యధిక దెబ్బతింటుంది. అమెరికాకు 2024-25లో 10.3 బిలియన్ డాలర్ల విలువైన వస్త్రాలు భారత్ నుంచే ఎగుమతి అయ్యాయి. ఇప్పుడు 50% టారిఫ్ వల్ల ఈ రంగం దారుణమైన పరిస్థితి ఎదుర్కొనే ఛాన్స్ ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ (CITI) అంచనా వేస్తోంది.
ప్రభావిత ఉత్పాదనలు:
- కాటన్ టీ-షర్టులు (9.71% వాటా)
- మహిళల దుస్తులు (6.52% వాటా)
- పిల్లల దుస్తులు (5.46% వాటా)
గోకల్దాస్ ఎక్స్పోర్ట్, వెల్స్పన్ లివింగ్, ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలకు ఆదాయం 50 నుంచి 70 శాతం అమెరికా మార్కెట్ నుంచే వస్తున్నాయి. ఇప్పుడు ఆ ఆదాయంపై పెను ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
జెమ్ అండ్ జ్యువెలరీ రంగం
ట్రంప్ టారిఫ్తో రత్నాలు -నగల రంగం కూడా తీవ్ర ప్రభావానికి గురవుతుంది. 2024-25లో అమెరికాకు ఇండియా దాదాపు 10 బిలియన్ డాలర్ల జెమ్స్ అండే జ్యువెలరీలు ఎగుమతి చేసింది. 30 శాతం వాటా కలిగిన అమెరికా టారిఫ్లు పెంచడం కచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుందని జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
రొయ్యల ఎగుమతులు
రొయ్యల ఎగుమతులు అత్యధిక టారిఫ్ను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పటికే 5.77 శాతం కౌంటర్వైలింగ్ డ్యూటీ, 2.49 శాతం యాంటీ-డంపింగ్ పన్ను అమెరికా విధిస్తోంది. ఇప్పుడు వీటికి అదనంగా 50 శాతం టారిఫ్ అమలు అయితే మాత్రం పన్ను భారం 58.26 శాతానికి చేరుకుంటుంది. కేవలం 15 శాతం టారిఫ్తో ఉన్న ఈక్వడార్తో భారత్ పోటీ పడాల్సి ఉంటుంది.
ఔషధ రంగం
ప్రస్తుతం మెడిసిన్పై టారిఫ్ ప్రభావం లేదు. కానీ భవిష్యత్లో మాత్రం ఫార్మా రంగంపై కచ్చితంగా 250కుపైగా టారిఫ్ వేస్తామని ఈ మధ్యే ట్రంప్ హెచ్చరించారు. అమెరికాలో ఔషధాల తయారీని పెంచుకునేందుకు చేసే ప్రయత్నాల్లో పన్నులు పెంచుతామని చెబుతున్నారు. భారత్ నుంచి 2024-25లో $10.5 బిలియన్ల ఔషధాలు అమెరికా దిగుమతి చేసుకుంది. ఫార్మా ఎగుమతుల్లో 31% అన్నమాట. దీన్ని వీలైనంత తగ్గించాలని ట్రంప్ ఆలోచిస్తున్నారు.
ఆటో కాంపోనెంట్స్
ఆటో కాంపోనెంట్స్ రంగం అమెరికా టారిఫ్స్తో ప్రభావితమవుతుంది. మిగతా రంగాలతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. గతేడాది ఈ రంగం నుంచి అమెరికాకు $7 బిలియన్ల ఆటోపార్ట్స్ ఎగుమతి అయ్యాయి. ఇప్పటికే ఈ రంగంపై 25 శాతం టారిఫ్ అమలులో ఉంది. ఇప్పుడు కొత్తగా ఎలాంటి టారిఫ్ విధించలేదు.
ఈ ట్రంప్ టారిఫ్‌లపై గ్లోబల్ ట్రేడ్ రిసర్చ్ ఇనిషియేటివ్ లెక్కలు వేసింది. వీటి ఫలితంగా 40 నుంచి 50 శాతం వరకు ఎగుమతులపై ప్రభావం పడుతుందని ఓ అంచనా ఉంది. దీని ప్రభావంతో దాదాపు 45.4 బిలియన్ డాలర్లు ఎఫెక్ట్ అవుతాయి. ఇది భారత్ జీడీపీ ప్రభావం చూపుతుంది. 7% నుంచి 6%కి తగ్గించగలవని అంటున్నారు.
అమెరికాలో ధరలు పెరిగే వస్తువులు
- భారత్ దేశం నుంచి ఎగుమతి అయ్యే వస్తువుల ధరలు అమెరికాలో పెరగబోతున్నాయి.
- వస్త్రాలు: భారతీయ టీ-షర్టులు, దుస్తులు, హోమ్ టెక్స్టైల్స్ 50% వరకు ధర పెరుగుతాయి.
- నగలు: వజ్రాలు- బంగారు నగలు
- రొయ్యలు: భారతీయ రొయ్యలు 58శాతం మేర ధరలు పెరిగే అవకాశం ఉంది.
భారత్, బ్రెజిల్పై సమానంగానే ట్రంప్ 50 శాతం టారిఫ్ వేశారు. చైనా, శ్రీలంకపై 30 శాతం, వియత్నాం, ఫిలిప్పీన్స్పై 20శాతం, బంగ్లాదేశ్పై 35 శాతం, మలేషియాపై 25 శాతం, థాయిలాండ్, కంబోడియాపై 36 శాతం టారిఫ్ వేశారు.
ట్రంప్ టారిఫ్ భారత-అమెరికా వాణిజ్య సంబంధాల్లో ఇదో కొత్త దశగా చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. ఇలాంటి సంక్షోభ సమయాన్ని భారతీయ ఎగుమతుదారులు ఆల్ట్రనేటివ్ ప్రయత్నాలు చేయాలని వస్తువుకు మరింత వాల్యూ జోడించాలని సూచిస్తున్నారు. సాంకేతికంగా అప్గ్రేడ్ అవ్వాలని చెబుతున్నారు.