Visa New Rules: చదువు కోసం, ఉద్యోగం చేయడానికి, ఆఫీస్ పని మీద, వ్యాపారం కోసం, వైద్యం కోసం, కొత్త ప్రదేశాలు చూడడానికి, కుటుంబ సభ్యులు/బంధువుల ఇంటికి వెళ్లడానికి, విశ్రాంతి కోసం.. ఇలా రకరకాల కారణాలతో వివిధ దేశాలకు మన వాళ్లు ఫ్లైట్ ఎక్కుతుంటారు. విదేశాలను విజిట్ చేసే భారతీయుల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. దీంతో, ఇండియన్ పాస్‌పోర్ట్ హోల్డర్ల కోసం చాలా దేశాలు రూల్స్ సడలిస్తున్నాయి. వీసా ఆన్ అరైవల్, ఫ్రీ ట్రాన్సిట్ వీసా, డిజిటల్ స్కెంజెన్ వీసా, వీసా క్యూలో నిలబడే బాధను తప్పించడం.. ఇలా, గత కొన్ని నెలల్లో వీసా రూల్స్ విషయంలో మార్పులు జరిగాయి.
రీసెంట్‌గా మారిన వీసా రూల్స్:
1) ఇండోనేషియా
రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా తన వీసా-ఫ్రీ (వీసా లేని) ప్రయాణంపై నిషేధాన్ని అధికారికం చేసింది. కరోనా మహమ్మారి సమయంలో అమలులోకి తెచ్చిన నిషేధం ఇకపైనా కొనసాగుతుందని అర్థం. ఇండోనేషియా వెళ్లే ఇండియన్ 'వీసా ఆన్ అరైవల్' వెసులుబాటుతో ఇక్కడ ఫ్లైట్ ఎక్కవచ్చు.
2) యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
యుఎస్ విజిటింగ్ కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. బిజినెస్, టూరిస్ట్ సహా కొన్ని కేటగిరీల్లో వీసా ఫీజ్ పెంచారు. ఈ నెల (జూన్ 2023) 17 నుంచి, వ్యాపారం & టూరిజం (B1 & B2 కేటగిరీలు) విజిటర్ వీసాలు; నాన్ పిటిషన్ ఆధారిత NIVల ఫీజులు $160 (రూ. 13,125) నుంచి $185 (రూ. 15,176)కు పెరిగాయి.
పాస్‌పోర్ట్‌పై "క్లియరెన్స్ రిసీవ్‌డ్" లేదా "డిపార్ట్‌మెంట్ ఆథరైజేషన్" స్టాంప్ ఉన్న వాళ్లు ఫ్రెష్ వీసా కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు ఇంటర్వ్యూ మినహాయింపు కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ స్టాంప్ లేని ట్రావెలర్ వీసా గడువు ముగియడానికి 48 నెలల సమయం ఉంటే ఈ సర్వీస్ పొందవచ్చు.
3) కజకిస్థాన్
వీసా లేకపోయినా ఇండియన్ ట్రావెలర్స్‌ను అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు తక్కువ ధరకే డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభించింది. లో కాస్ట్ క్యారియర్ ఫ్లైఅరిస్టాన్, దిల్లీ నుంచి షైమ్‌కెంట్ మధ్య నేరుగా తిరుగుతుంది. వన్ సైడ్ ఛార్జ్ రూ. 4,500 కంటే తక్కువ.
4) సౌదీ అరేబియా
సౌదీ అరేబియాలో పర్యటించడానికి సౌదియా ఎయిర్‌లైన్స్ లేదా ఫ్లైనాస్ ఎయిర్‌లైన్ టిక్కెట్ తీసుకుంటే, నాలుగు రోజుల ట్రాన్సిట్ వీసాను ఫ్రీగా పొందేందుకు మీరు అర్హులవుతారు. మీ టిక్కెట్‌పై వీసా జారీ అవుతుంది, 90 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది.
5) ఈజిప్ట్
ఈజిప్ట్, భారతీయులకు దాదాపు $25లకు (రూ. 2,060) 30 రోజులు చెల్లుబాటు అయ్యే సింగిల్ ఎంట్రీ వీసాను త్వరలో జారీ చేయనుంది.
6) చైనా
కొవిడ్ తరువాత, టూరిస్ట్‌లను తిరిగి స్వాగతించడానికి చైనా ఇటీవల తన బార్డర్స్ ఓపెన్ చేసింది. మార్చి 28 2020కి ముందు జారీ అయిన వాలిడ్ వీసా ఉన్న పర్యాటకులు, డ్రాగన్ కంట్రీని దర్శించడానికి ఇప్పుడు దానిని ఉపయోగించవచ్చు, అయితే ఇతరులు ఫ్రెష్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి.
7) యూరప్
EU సభ్య దేశాలు ప్రస్తుత స్కెంజెన్ వీసా వ్యవస్థను డిజిటల్‌లోకి మార్చేందుకు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీంతో పాస్‌పోర్ట్‌లో ఫిజికల్ స్టిక్కర్ అవసరం ఇకపై ఉండదు. దీనిని అధికారికంగా ఆమోదిస్తే, కొత్త చట్టం చాలా సులభంగా ఉంటుంది. వీసా కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి వీలవుతుంది. మొత్తం వీసా ప్రక్రియ చౌకగా, వేగవంతంగా మారుతుంది.
మరో ఆసక్తికర కథనం: ఐటీ రిఫండ్ ఇంకా అందలేదా?, ఎప్పట్లోగా వస్తుందో తెలుసుకోవచ్చు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial