Apple CEO Tim Cook Salary in 2023: మార్కెట్ విలువ ప్రకారం, ప్రపంచంలోని అతి పెద్ద కంపెనీల్లో ఒకటి ఆపిల్. ఈ టెక్నాలజీ జెయింట్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (CEO) పని చేస్తున్న టిమ్ కుక్ జీతభత్యాల గురించి ఆ కంపెనీ వెల్లడించింది. సీఈవోకు ప్రతి సంవత్సరం ఇచ్చే వేతన గణాంకాలను ఆపిల్ ఏటా విడుదల చేస్తుంటుంది. 2023 సంవత్సరానికి కూడా కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు భారీ జీతం ఇచ్చింది. అయితే, 2022లో ఇచ్చిన జీతభత్యాల కంటే గత ఏడాది ఇచ్చింది చాలా తక్కువ. జీతభత్యాల్లో జీతంతోపాటు ఆపిల్ షేర్లు, ఇతర ప్రోత్సాహకాలు (Apple shares & other incentives) కలిసి ఉంటాయి.
2023లో టిమ్ కుక్ సంపాదన
అమెరికన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు ఆపిల్ ఇంక్ ఇచ్చిన సమాచారం ప్రకారం, టిమ్ కుక్‌కు మొత్తం 3 మిలియన్ డాలర్లను జీతభత్యాల రూపంలో కంపెనీ చెల్లించింది. భారతీయ రూపాయిల్లో చెప్పుకుంటే, 2023లో టిమ్ కుక్‌కు రూ. 25 కోట్లు అందాయి. ఇది 2022 & 2021 సంవత్సరాల్లో తీసుకున్న మొత్తానికి సమానం. దీంతో పాటు, టిమ్ కుల్‌కు గత ఏడాది 46,970,283 డాలర్లు లేదా రూ. 389.25 కోట్ల విలువైన ఆపిల్ షేర్లను స్టాక్ అవార్డ్ (Stock Award) రూపంలో కంపెనీ అందించింది.
ఇది మాత్రమే కాకుండా, 2023లో, ఈక్విటీయేతర ప్రోత్సాహకంగా 10,713,450 డాలర్లు (రూ. 88.78 కోట్లు), పరిహారంగా (Compensation) 2,526,112 డాలర్లు (రూ. 20.93 కోట్లు) ఆపిల్ సీఈవో పొందారు. ఈ మొత్తం కలిపితే, 2023 సంవత్సరంలో ఆపిల్ సీఈవో మొత్తం సంపాదన 63,209,845 డాలర్లు లేదా దాదాపు రూ. 523.83 కోట్లుగా ఉంది. 2022 సంవత్సరంలో ఇది 99,420,097 డాలర్లు లేదా రూ. 823.91 కోట్లుగా ఉంది. ఈ లెక్కలను బట్టి, గత ఏడాది కాలంలో టిమ్ కుక్ జీతం అతి భారీగా, 36 శాతం తగ్గింది.
వాస్తవానికి, టిమ్ కుక్ జీతభత్యాలను ఆపిల్ కంపెనీ తగ్గించలేదు. కంపెనీ వ్యయాలను తగ్గించడానికి టిమ్ కుక్ స్వయంగా తన జీతాన్ని తగ్గించుకున్నారు.
టిమ్ కుక్, తన దగ్గరున్న ఆపిల్ షేర్లను అడపాదడపా అమ్ముతుంటారు. 2023 మే నెలలో 5,11,000 షేర్లను విక్రయించారు. ఆ లావాదేవీ ద్వారా అతను 87.8 మిలియన్ డాలర్లు సంపాదించారు. 2021 ఆగస్టులోనూ 750 మిలియన్ డాలర్ల విలువైన ఆపిల్ షేర్లను టిమ్ కుక్ సెల్ చేశారు. తన దగ్గరున్న ఆపిల్ షేర్లను విక్రయించినప్పటికీ, యాన్యువల్ కాంపెన్షేషన్ ప్లాన్ (Annual Compensation Plan) కింద కంపెనీ నుంచి అదే సంఖ్యలో షేర్లను కుక్ అందుకుంటున్నారు. కాబట్టి, కంపెనీలో అతి వాటా మారకుండా స్థిరంగా ఉంటోంది.
ఇతర సీనియర్ అధికార్ల జీతభత్యాలు
2023 సంవత్సరంలో టిమ్ కుక్‌కు జీతం & పరిహారంగా మొత్తం 63,209,845 డాలర్లు ఇచ్చినట్లు ఎక్సేంజ్ ఫైలింగ్‌లో ఆపిల్ తెలిపింది. కంపెనీలోని ఇతర సీనియర్ అధికార్ల వేతనాలను కూడా వెల్లడించింది. ఆపిల్ CFO (Chief Financial Officer) లుకా మాస్త్రి 2023 సంవత్సరంలో 26,935,883 డాలర్లను సంపాదించారు. ఆపిల్ జనరల్ కౌన్సిల్ & సెక్రటరీ కేట్ ఆడమ్ 26,941,705 డాలర్లు డ్రా చేశారు.
మరో ఆసక్తికర కథనం: నాలుగు రోజుల్లో రూ.6.88 లక్షల కోట్లు, స్టాక్ మార్కెట్ చాలా ఇచ్చింది