Nominated Posts In Telangana: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతల్లో జోష్ కనిపిస్తోంది. నాయకులను నామినేటెడ్ పోస్టులు ఊరిస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టిపెట్టింది. పార్టీని నమ్ముకుని ఏళ్ల తరబడి కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తొలి విడతగా పది మందికి అవకాశం కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. సంక్రాంతి పండుగ తర్వాత ఆయా పదవులు దక్కిన నేతల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. 


తొలివిడతతో 10 నుంచి 15 మందికి అవకాశం
లోక్ సభ ఎన్నికల్లోపు నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. పార్టీ కోసం కష్టపడిన వారికి అవకాశం ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తద్వారా లోక్ సభ ఎన్నికల్లో పార్టీ నేతలను ప్రోత్సహించినట్లు ఉంటుందని, ఐదేళ్ల పాటు పార్టీని పటిష్టంగా ఉంచేందుకు ఈ పదవులు ఉపయోగపడతాయని కాంగ్రెస్  భావిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే 10 నుంచి 15 మందితో ఓ లిస్టును తయారు చేసినట్టు కాంగ్రెస్ కీలక నేత ఒకరు తెలిపారు. 


సీఎం రేవంత్ సమీక్ష
నామినేటెడ్ పదవుల ఎంపికపై శుక్రవారం రాత్రి కీలక సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జ్ దీపాదాస్ మున్షి తదితరులు ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవులకు సంబంధించి కసరత్తు చేసినట్టు చెప్పారు. కేసీ వేణుగోపాల్‌‌తో భేటీ సందర్భంగా ఆ లిస్టును సీఎం రేవంత్, దీపాదాస్ అందజేశారని తెలుస్తున్నది. ఆ లిస్టుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీలతో చర్చించి ఫైనల్ చేస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.


నేతల పైరవీలు
పదవుల జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకునేందుకు కొందరు నేతలు ప్రయత్నం ముమ్మరం చేశారు. ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవుల కోసం రాష్ట్ర సచివాలయం, గాంధీభవన్ చుట్టూ ఆశావహులు తిరుగుతున్నారు. సీఎం, మంత్రులకు విజ్ఞప్తులు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 54 కార్పొరేషన్ల చైర్మన్లు, ఆరు ఎమ్మెల్సీలు, మరో ఆరు మంత్రి పదవులు భర్తీ చేయాల్సి ఉన్నది. ఎమ్మె ల్సీ పదవుల కోసం సీనియర్‌ నేతలు షబ్బీర్‌ అలీ, మధుయాష్కీగౌడ్‌, జగ్గారెడ్డి వంటి వారు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. 


అలాగే ఎమ్మెల్యే టికెట్‌ దక్కని అద్దంకి దయాకర్‌ వంటి నేతలకు అధిష్ఠానం ఎమ్మె ల్సీ హామీ ఇచ్చింది. దీంతో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ తీవ్రంగా నెలకొంది. వీటికి తోడు పార్టీకి చెందిన ఆర్గనైజేషన్ల చైర్మన్లు, పార్టీ అనుబంధ విద్యార్థి సంఘాల నేతలు నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్లను వదులుకున్న తమకు తొలి విడతలోనే అవకాశం దక్కుతుందని కొందరు నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 


వారికే ప్రాధాన్యమా?
పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ చాలా మంది ఏళ్ల తరబడి పార్టీనే అంటిపెట్టుకొని ఉన్నారు. పార్టీ కోసం నిరంతరం కృషి చేశారు. అలాంటి నేతలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడిన వారికి మాత్రమే ఇవ్వాలనేది అధిష్ఠానం ఉద్దేశమని ప్రచారం జరుగుతోంది. పార్టీలోనే ఉంటూ పార్టీని దెబ్బతీసేందుకు ప్రయత్నించిన వారిని, ఎన్నికల సమయంలో పార్టీ మారే ఆలోచన చేసిన వారిని పక్కన పెట్టాలని భావిస్తున్నట్టు తెలిసింది.