Investors Wealth in Bombay Stock Exchange: 2024 ప్రారంభమైన తర్వాత, స్టాక్‌ మార్కెట్‌లోని కంపెనీలు & పెట్టుబడిదార్లకు బాగా కలిసి వస్తోంది. మదుపర్ల సంపదగా పరిగణించే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ (Market capitalization of BSE listed companies) రూ.373 లక్షల కోట్లకు చేరుకుంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఇన్వెస్టర్లు రూ.6.88 లక్షల కోట్లు పోగేశారు. ఈ నాలుగు రోజుల్లో సెన్సెక్స్ పరుగులు తీసింది, గత ట్రేడింగ్‌ సెషన్‌లో (శుక్రవారం, 12 జనవరి 2024) గరిష్ట స్థాయి 72,720.96కి చేరుకుంది.


30 షేర్ల బీఎస్‌ఇ సెన్సెక్స్ శుక్రవారం 847.27 పాయింట్లు లేదా 1.18 శాతం పెరిగి 72,568.45 వద్ద ముగిసింది. శుక్రవారం ఐటీ స్టాక్స్‌లో భారీ జంప్ కనిపించింది, 999.78 పాయింట్లకు పెరిగింది. ఈ విధంగా నాలుగు రోజుల్లోనే బీఎస్‌ఈ బెంచ్‌మార్క్‌లో 1,213.23 పాయింట్ల జంప్ నమోదైంది. ఈ కాలంలో ఇన్వెస్టర్లు రూ.6,88,711.19 కోట్లు ఆర్జించగా, మార్కెట్ క్యాప్ రూ.3,73,29,676.27 కోట్లకు చేరింది.


ఐటీ స్టాక్స్‌లో భారీ వృద్ధి
శుక్రవారం బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ 5.06 శాతం పెరిగింది. ఇన్ఫోసిస్ (Infosys) షేర్లు 8 శాతం పెరిగాయి. TCS (Tata Consultancy Services) షేర్లు కూడా దాదాపు 4 శాతం మేర లాభపడ్డాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్‌ కంపెనీల Q3 ఫలితాలు ఆశించిన స్థాయిలోనే ఉండడంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం కనిపించింది. దీంతో ఇతర ఐటీ స్టాక్స్‌ కూడా ర్యాలీ చేశాయి. టెక్ మహీంద్ర, విప్రో, HCL టెక్నాలజీస్ ఈ పెరుగుదల నుంచి లాభపడ్డాయి.


BSE స్మాల్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌
ఐటీ కంపెనీలతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల స్టాక్స్‌ కూడా మంచి పనితీరు కనబరిచాయి. దీంతో, గత వారంలో ఇన్వెస్టర్ల సంపద గణనీయంగా పెరగడంతో పాటు మార్కెట్లు కొత్త శిఖరాలను తాకాయి. గత వారంలో, BSEలో మొత్తం 2,112 షేర్లు పెరిగాయి, 1,742 తగ్గాయి, 88 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. BSE స్మాల్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.41 శాతం, మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.36 శాతం పెరిగాయి.


చారిత్రాత్మక గరిష్టానికి చేరిన సెన్సెక్స్, నిఫ్టీ
శుక్రవారం రోజు ఐటీ షేర్లలో భారీ కొనుగోళ్ల కారణంగా, బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు సెన్సెక్స్ & నిఫ్టీ చారిత్రాత్మక గరిష్టాల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌ దాదాపు 847 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 247 పాయింట్లు ర్యాలీ చేశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్, 72,720.96 పాయింట్లతో తాజా గరిష్టాన్ని ‍(Sensex fresh all-time high) నమోదు చేయగా, నిఫ్టీ 21,928.25 పాయింట్లతో కొత్త రికార్డ్‌ (Nifty fresh all-time high) సృష్టించింది, 22,000 మైలురాయికి అతి దగ్గరలో ఉంది. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి