Changes from 1st November: సోమవారం అర్ధరాత్రితో అక్టోబర్ నెల చీకట్లో కలిసిపోతుంది. మంగళవారం నుంచి 2022 నవంబర్ నెల మొదలవుతుంది. కొత్త నెలతో పాటు కొన్ని కొత్త మార్పులూ మన జీవితంలో వస్తాయి. అవి ప్రత్యక్షంగా, పరోక్షంగా మన ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తాయి. కొత్త మార్పుల గురించి నెలనెలా మిమ్మల్ని మేం హెచ్చరిస్తూనే ఉన్నాం. నవంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్లు సహా అనేక అంశాల్లో మార్పులు జరగబోతున్నాయి. అవేంటో ముందే తెలుసుకోకపోతే మన జేబు మీద భారం పెరిగే అవకాశం ఉంది.
LPG ధరలు పెరిగే అవకాశం
వంట గ్యాస్ సిలిండర్ల కొత్త ధరలు ప్రతి నెలా మొదటి తేదీన మారుతుంటాయి. గ్యాస్ బండ రేటు కొన్నిసార్లు తగ్గొచ్చు, మరి కొన్నిసార్లు పెరగొచ్చు. ఈసారి కూడా, నవంబర్ 1న... గృహ అవసరాలకు ఉపయోగించే గ్యాస్, వాణిజ్య అవసరాలకు ఉపయోగించే గ్యాస్ రెండింటికీ కొత్త ధరలను ప్రకటిస్తారు. అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు పెరుగుతున్నందున, ఈసారి LPG సిలిండర్ల ధరలను పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. 14.2 కిలోల డొమెస్టిక్ LPG సిలిండర్, 19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్ రెండింటికీ ఈ పెంపు ఉండవచ్చు.
బీమా క్లెయిమ్‌లకు KYC తప్పనిసరి
కరోనా కాలం నుంచి ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది, తీసుకునే బీమా పాలసీల సంఖ్య కూడా పెరిగింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) నవంబర్ 1 నుంచి కొత్త రూల్ తీసుకువస్తోంది. దాని ప్రకారం... బీమా చేసే సంస్థలు KYC (నో యువర్ కస్టమర్) వివరాలను తప్పనిసరి చేయవచ్చు. ప్రస్తుతం, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసేటప్పుడు KYC వివరాలు అందించడం ప్రస్తుతం స్వచ్ఛందంగా ఉంది. నవంబర్ 1 నుంచి ఇది మారుతుంది. KYC కంపల్సరీ అవుతుంది. ఈ నియమం కొత్త పాలసీలకే కాదు, పాత కస్టమర్‌లకు తప్పనిసరి చేయవచ్చు. అంటే, ఇప్పటికే ఉన్న పాలసీహోల్డర్లు కూడా KYC వివరాలు అందించాల్సి రావచ్చు. KYC లేకపోతే... బీమా క్లెయిమ్ చేస్తున్నప్పుడు మీ క్లెయిమ్‌ను బీమా కంపెనీలు తిరస్కరించే అవకాశం ఉంది.
రైళ్ల కొత్త టైమ్ టేబుల్
భారతీయ రైల్వేల కొత్త టైమ్ టేబుల్ ప్రకారం నవంబర్ 1 నుంచి వేల రైళ్ల టైమింగ్స్ మారతాయి. కొన్ని రైళ్ల సమయాలను ముందుకు, మరికొన్ని రైళ్ల సమయాలను వెనక్కు జరిపారు. కొన్ని ట్రైన్ స్టాప్స్ తగ్గించారు, మరికొన్నింటి స్టాప్స్ పెంచారు. మీరు నవంబర్ 1, లేదా ఆ తర్వాతి తేదీల్లో రైలు ప్రయాణం పెట్టుకుంటే.. రైల్వే స్టేషన్‌కు వెళ్లకముందే సదరు రైలు సమయాన్ని కచ్చితంగా తనిఖీ చేయండి. దేశంలో నడుస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ల సమయాలు కూడా మారుతున్నాయి.
దిల్లీలో విద్యుత్ సబ్సిడీ
దేశ రాజధాని దిల్లీలో విద్యుత్ సబ్సిడీ వ్యవస్థ నడుస్తోంది. ఈ సబ్సిడీ కోసం నమోదు చేసుకోని వారికి నవంబర్ మొదటి తేదీ నుంచి డిస్కౌంట్ కట్ చేయవచ్చు. ప్రస్తుతం, పేరు నమోదు చేయించుకున్నా, చేయించుకోకపోయినా దిల్లీ ప్రజలు ఒక నెలలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందుతున్నారు. అక్టోబర్ 31 వరకే ఇది చెల్లుతుంది. నవంబర్ 1 నుంచి విద్యుత్ సబ్సిడీ పొందాలంటే కచ్చితంగా రిజిస్ట్రర్ చేయించుకోవాలి. మీరు దిల్లీలో నివశిస్తుంటే వెంటనే పేరు నమోదు చేసుంకోండి. ఒకవేళ మీ బంధుమిత్రులు అక్కడ ఉంటే, ఈ సమాచారాన్ని వాళ్లకు తెలియజేయండి.