Tesla CEO Elon Musk Denies He Sexually Harassed Flight Attendant : టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌కు ఎప్పుడూ వార్తల్లో ఉండటం అలవాటే! ఏదో ఒక కంపెనీ లేదా అంశంపై ఆయన ట్వీట్‌ చేస్తూ ఫాలోవర్లను ఆకర్షిస్తుంటారు. జనాలు మాట్లాడుకొనేలా చేస్తుంటారు. తాజాగా ఆయన అనుకోని వివాదంలో చిక్కుకున్నారు. 2016లో ఓ ఫ్లయిట్‌ అటెండెంట్‌ను లైంగికంగా వేధించారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.




2016లో ప్రైవేట్‌ జెట్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఓ యువతిని ఎలన్‌ మస్క్‌ లైంగికంగా వేధించారని బిజినెస్‌ ఇన్‌సైడర్‌ గురువారం కథనం ప్రచురించింది. ఆ యువతి స్నేహితురాలు ఇచ్చిన స్టేట్‌మెంట్స్‌తో వార్త రాసినట్టు ఇన్‌సైడర్‌ తెలిపింది. ఈ కేసు నుంచి బయట పడేందుకు 2016లో ఆ యువతికి మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ కంపెనీ 250,000 డాలర్లను చెల్లించినట్టు పేర్కొంది. అయితే ఈ వార్తలను ఎలన్‌ మస్క్‌ ఖండించారు. అవన్నీ అబద్ధాలని ట్వీట్‌ చేశారు.


'ఆ అబద్ధాల కోరుపై నేను సవాల్‌కు వెళ్తాను. ఆమె స్నేహితురాలు నన్ను నగ్నంగా చూడటం అబద్ధం. ఒక్క గుర్తైనా చెప్పడం చూద్దాం! ప్రజలకు తెలియని నా ఒంటిపైన మచ్చలు, టాటూస్‌ గురించి చెప్పండి. ఆమె ఆ విషయం చెప్పలేదు. ఎందుకంటే అలాంటి ఎప్పుడూ జరగలేదు' అని మస్క్‌ ట్వీట్‌ చేశారు. ఇన్‌సైడర్‌లో వచ్చిన కథనం రాజకీయ ప్రేరేపితమని ఆయన ఆరోపించారు. 


'నాపై జరిగిన దాడిని రాజకీయ అద్దంలోంచి చూడాలి. ఇది వారి ప్రామాణిక పుస్తకం. మాట్లాడే స్వేచ్ఛ, మెరుగైన భవిష్యత్తు కోసం చేసే నా పోరాటాన్ని ఎవ్వరూ ఆపలేరు' అని మస్క్‌ అన్నారు. ట్విటర్‌ కొనుగోలు వ్యవహారంలో తల దూర్చడానికే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. డెమొక్రాట్లు తనపై చేస్తున్న చెత్త ప్రచారంగా కొట్టిపారేశారు. అంతకు ముందు ఆయన రిపబ్లిక్‌ పార్టీ నుంచి అధ్యక్షుడిగా పనిచేసిన డొనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతు ఇస్తున్నానని  చెప్పడం గమనార్హం.