తలకాయ కూర మటన్ విభాగం కిందకే వస్తుంది. మేక, గొర్రెల తలలతోనే ఈ కూరను వండుతారు. అందుకే మటన్ తినడం వల్ల కలిగే లాభాలన్నీ ఈ కూర తిడనం వల్ల కలుగుతాయి. మటన్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మహిళలు అధికంగా తింటే మంచిది. వీరికి రక్తహీనత సమస్య అధికంగా ఉంటుంది. ఈ మటన్లో బి విటమిన్లు అధికంగా లభిస్తాయి.గర్భిణులు మటన్ తినడం వల్ల పుట్టబోయే బిడ్డకు చాలా లాభాలు కలుగుతాయి. మటన్లో ఉండే పొటాషియం రక్తపోటు, గుండెజబ్బులు, కిడ్నీ సంబంధ వ్యాధులు రాకుండా కాపాడతాయి. ఇందులో ఉండే కాల్షియం దంతాలు, ఎముకల గట్టిదనానికి సహకరిస్తాయి. తలకాయ కూర సులువుగా ఎలా వండాలో చూడండి.
కావాల్సిన పదార్థాలు
తలకాయ మాంసం - అరకిలో
ఉల్లిపాయ - ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు
కారం - ఒక స్పూను
పసుపు - ఒక స్పూను
గరం మసాలా - ఒక స్పూను
కొత్తమీరు తరుగు - నాలుగు స్పూనులు
ధనియాల పొడి - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
కొబ్బరి తురుము - ఒక స్పూను
మిరియాల పొడి - అరస్పూను
(కొబ్బరి తురుము మీకు నచ్చితే వేసుకోవచ్చు. వేయకపోయినా రుచి బాగానే ఉంటుంది)
తయారీలో ఇలా
1. తలకాయ కూరను బాగా కడిగి పెట్టుకోవాలి.
2. ఉల్లిపాయలు నిలువుగా సన్నగా తురమాలి. స్టవ్ పై కుక్కర్ పెట్టి అందులో నూనె వేయాలి.
3. నూనె వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
4. అల్లం వెల్లుల్లి పేస్టు కూడా వేయించాలి. పసుపు, కారం కూడా కలపాలి.
5. అందులో తలకాయ కూర వేసి మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి.
6. స్టవ్ మీద మరో కళాయి పెట్టి కుక్కర్లోని కూరను ఇందులోకి మార్చాలి.
7. ఉప్పు కూడా వేసి కాసేపు ఉడికించాలి.
8. ముక్క 90 శాతం ఉడికిపోయాక మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కొబ్బరి తురుము వేసి ఉడికించాలి. అప్పటికే కూర బాగా ఉడికి మంచి వాసన వస్తుంది.
9. స్టవ్ కట్టేశాక పైన కొత్తిమీర చల్లి సర్వ్ చేయాలి. నాన్ వెజ్ ప్రియులెందరికీ తలకాయ కూరంటే ప్రాణం. ప్రత్యేకంగా వండుకుని తింటారు. ఇలా వండుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
Also read: గర్భం ధరించలేకపోతున్నారా? ఒత్తిడి కారణమేమో చూసుకోండి