ప్రతి చిన్న నొప్పి పెయిన్ కిల్లర్స్ వాడడం సరైన పద్ధతి కాదు. ఇలా ఆ మందులను అధికంగా వాడడం వల్ల ఇతర సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా శరీరంలోని రోగనిరోధక వ్యవస్థపై ఆ ప్రభావం పడుతుంది. వెంటనే నొప్పి తగ్గిపోవాలన్న ఉద్దేశంతో ఇలా పెయిన్ కిల్లర్స్ బాట పడుతున్నారు ఎక్కువ మంది. తలనొప్పి, పీరియడ్స్ నొప్పి, కాస్త కడుపు నొప్పి... ఇలాంటివి తరచూ కలిగేవే. వీటికి కూడా పెయిన్ కిల్లర్స్ అధికంగా వాడితే శరీరంలోవాటిని అలవాటు పడిపోతుంది. ఇలాంటి వాటికి ఇంట్లోనే దొరికే కొన్ని ఆహారాపదార్థాలతో ఉపశమనం పొందవచ్చు. ఇవి సహజంగానే పెయిన్ కిల్లర్ లక్షణాలను కలిగి ఉంటాయి. 


పైనాపిల్
ఈ పండులో బ్రోమెలైన్ అనే సహజ రసాయనం ఉంటుంది. ఇది ఉబ్బరం, గ్యాస్, పంటి నొప్పి వంటివి తగ్గించడంలో ముందుంటుంది ఈ సహజ రసాయనం బరువు తగ్గడానికి, మంట నొప్పి వంటివి తగ్గించేందుకు సహాయపడుతుంది. పైనాపిల్ జ్యూస్, లేదా పైనాపిల్ ముక్కలను తింటే మంచి ఫలితం కనిపిస్తుంది. 


బ్లూబెర్రీలు
ఇవి మంచి రుచిగా ఉంటాయి. నొప్పిని తగ్గించే గుణాలు కూడా అధికం. ఇవి ఫైటో న్యూట్రియెంట్లతో నిండి ఉంటాయి. ఇవి నొప్పి, మంటను తగ్గించేందుకు సహకరిస్తాయి. ఒత్తిడికి గురవుతున్న కండరాలను సడలించగలవు కూడా. బ్లూబెర్రీలను తప్పకుండా తీసుకోవడం వల్ల మూత్రాశయం, మూత్రనాళాల ఇన్ఫెక్షన్ల చికిత్సలో సహాయపడుతుంది. 


అల్లం
వ్యాయామం, క్రీడలు తరవుత కండరాలు నొప్పులు రావడం సహజం. అల్లం సహజంగానే  కండరాలను శాంతపరుస్తుంది. గాయాల నొప్పులే కాదు, డిస్మెనోరియాకు సంబంధించిన తీవ్రమైన పీరియడ్స్ నొప్పులను కూడా తగ్గించడంలో అల్లం సహాయపడుతుంది. సాలిపిలేట్స్ అనే సమ్మేళనం సాలిసిలిక్ యాసిడ్ అనే రసాయన పదార్థంగా రూపాంతరం చెందుతుంది. ఇది నొప్పి మరియు అసౌకర్యాన్ని మరింత తగ్గిస్తుంది. అల్లం టీ తయారుచేసుకుని గోరువెచ్చగా తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. 


పసుపు
దేశీ మందు పసుపు. పూర్వం నుంచి దెబ్బ తాకిందంటే వెంటనే పసుపు అద్దుతారు. పొట్ట క్లీన్ చేయాలన్న పసుపు కలిపిన అన్నం ముద్ద తినేవారు. ఇది క్రిమినాశక లక్షణాలు కలిగి ఉండడమే దీనికి కారణం. శరీరంలోని అంతర్గత నొప్పులను నయం చేయడానికి పసుపు పాలను ఉపయోగించడం ప్రాచీనపద్ధతి. దీనిలోని ముఖ్ సమ్మేళనాన్ని కర్కుమిన్ అంటారు. ఇది వాపు, మంటలను తగ్గిస్తుంది. 


లవంగాలు
అన్ని రకాల దంతాలు, చిగుళ్ల వాపులకు లవంగాన్ని నమలడం అమ్మమ్మల కాలం నాటి రెమెడీ. దీనిలో యూజీనాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది సహజంగానే మత్తుమందులా పనిచేస్తుంది. అందుకే లవంగం తిన్నాక నొప్పి వచ్చే ప్రాంతం మొద్దుబారినట్టు అయి నొప్పి తగ్గుతుంది. 


చెర్రీలు
చెర్రీ పండ్లలో ఆంథోసైనిన్స్ అనే యాక్టివ్ సమ్మేళనం నొప్పి నుంచి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. దాదాపు 20 నుంచి 25 చెర్రీస్ తింటే ఏ నొప్పయిన కాస్త తగ్గుముఖం పడుతుంది. తలనొప్పి, కీళ్ల నొప్పును దూరం చేయడంలో ఇవి సహకరిస్తాయి. చెర్రీలను బాగా శుభ్రం చేశాక పచ్చిగా అలా తినేయాలి. 


Also read: గోడ కుర్చీ శిక్ష కాదు ఆరోగ్యానికి రక్ష, రోజుకు అయిదు నిమిషాలు వేస్తే ఎన్ని ప్రయోజనాలో


Also read: ఎంత కోపం వచ్చినా మీ పిల్లలతో ఈ మాటలు అనవద్దు, వారి మనసులో ఉండిపోతాయి