Mobile Tariff Hike Likely: కొత్త సంవత్సరంలో (2023) మొబైల్ ఫోన్ టారిఫ్‌ మరింత ఖరీదైనది కావచ్చు. నూతన ఏడాది రాగానే, మొబైల్ టారిఫ్‌లను 10 శాతం వరకు పెంచుతామని అన్ని టెలికాం కంపెనీలు (రిలయన్స్‌ జియో, భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా) ఒకదాటి తర్వాత మరొకటి ప్రకటించవచ్చు. ప్రభుత్వ రంగంలో పని చేస్తున్న భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL) మాత్రం ఈ రేట్ల రేసులో పాల్గొనకపోవచ్చు. 


విదేశీ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ (Jefferies) విశ్లేషకులు ఇండియన్‌ టెలికాం కంపెనీల మీద ఇచ్చిన రిపోర్ట్‌లో ఈ విషయాన్ని వివరించారు.


కంపెనీల మార్జిన్లు, రాబడి మీద పెరిగిన ఒత్తిడి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-23 లేదా FY23) నాలుగో త్రైమాసికంలో భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో తమ మొబైల్ టారిఫ్‌లను 10 శాతం వరకు పెంచవచ్చని జెఫరీస్ నివేదికలో ఉంది. ఈ రేట్ల పెంపు తర్వాత.. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24 లేదా FY24) & ఆ తర్వాత వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ (2024-25 లేదా FY25) నాలుగో త్రైమాసికంలో (జనవరి- మార్చి కాలం) రేట్ల పెంపు ఉండవచ్చని తమ రిపోర్ట్‌లో జెఫరీస్‌ విశ్లేషకులు అంచనా వేశారు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఈ రేట్ల పెంపు ఉంటుందని తెలిపారు.


గతంలో పెంచిన టారిఫ్‌ల వల్ల అందాల్సిన ప్రయోజనం ఆయా కంపెనీలకు ఇప్పటికి అందిందని చెప్పిన జెఫరీస్‌, కంపెనీ ఆదాయం & మార్జిన్‌ మీద మళ్లీ ఒత్తిడి పెరుగుతోందని నివేదికలో చెప్పింది. దీని కారణంగా ఈ టెలికాం కంపెనీలకు ఏమీ మిగలడదం లేదని, టారిఫ్‌లు మరోసారి పెంచడం తప్ప మరో ఆప్షన్‌ లేదని విశ్లేషించింది.


ఆర్పులో స్వల్ప పెరుగుదల
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో, టెలికాం కంపెనీల 'ఒక్కో వినియోగదారుడి మీద సగటు ఆదాయం'లో (ARPU - ఆర్పు) స్వల్ప పెరుగుదల ఉంది. రిలయన్స్ జియో ఆర్పు 0.8 శాతం, భారతీ ఎయిర్‌టెల్ ఆర్పు 4 శాతం, వొడాఫోన్ ఐడియా ఆర్పు 1 శాతం పెరిగాయి. కొన్ని ఎంపిక చేసిన సర్కిళ్లలో భారతీ ఎయిర్‌టెల్ రూ. 99 ప్రీపెయిడ్ టారిఫ్ ప్లాన్‌ను రద్దు చేసింది. ఇప్పుడు 28 రోజుల టారిఫ్ ప్లాన్ కోసం రూ. 99 కి బదులుగా రూ. 155 చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుతం, ఈ రీఛార్జ్ ప్లాన్‌ను హరియాణా, ఒడిశాలో ఈ కంపెనీ అమలు చేస్తోంది. రాబోయే రోజుల్లో దేశంలోని మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ దీనిని అమలు చేయవచ్చని భావిస్తున్నారు.


5G సేవలు ప్రారంభించడంతో పెరిగిన ఒత్తిడి
రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ దేశంలోని అనేక నగరాల్లో 5G మొబైల్ సేవలను ప్రారంభించాయి. ఈ కంపెనీలు 5 స్పెక్ట్రంను పొందడానికి వేలంలో వేల కోట్ల రూపాయల డబ్బును వెచ్చించాయి. 5జీ స్పెక్ట్రం కోసం, ప్రస్తుతం ఉన్న మూడు ప్రైవేట్‌ టెలికాం కంపెనీలు (రిలయన్స్‌ జియో, భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా) కలిసి రూ. 1,50,173 కోట్లు వెచ్చించాయి. దీనికి సంబంధించిన లైసెన్స్ ఫీజు చెల్లించేందుకు ఈ కంపెనీలు తమ ఆదాయాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి, ఈ పరిస్థితుల్లో ఈ టెలికాం కంపెనీలు మొబైల్ టారిఫ్‌లను పెంచాల్సి ఉంటుంది. 


2021 సంవత్సరంలో... భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో ప్రి-పెయిడ్ మొబైల్ టారిఫ్‌లను పెంచాయి. రాబోయే కాలంలో, ఈ 3 టెలికాం కంపెనీలు ప్రి-పెయిడ్‌తో పాటు పోస్ట్‌- పెయిడ్ టారిఫ్‌లను పెంచవచ్చు. మరో మొబైల్ టారిఫ్‌ హైక్‌ ఉండవచ్చని ఇప్పటికే అన్ని టెలికాం కంపెనీల టాప్ మేనేజ్‌మెంట్లు ప్రకటించాయి.