TS TDP Politics :  తెలంగాణలో టీడీపీ ఉందా లేదా అని నిన్నటి వరకూ చెప్పుకున్నారు. కానీ చంద్రబాబునాయుడు కాసాని జ్ఞానేశ్వర్ ను  టీ టీడీపీ చీఫ్‌గా నియమించిన తర్వాత ఆ పార్టీలో కాస్త కదలిక కనిపించింది. ఖమ్మంలో బహిరంగసభ తర్వాత ఒక్క సారిగా పరిస్థితి మారిపోయింది. భారత్ రాష్ట్ర సమితిగా మారిన టీఆర్ఎస్ ఒక్క సారిగా చంద్రబాబుపై టీడీపీపై తీవ్రంగా ఎదురుదాడి దాడి ప్రారంభించారు. కేసీఆర్, కవిత సహా పలువురు మంత్రులు విమర్శలు గుప్పించారు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే.. బీఆర్ఎస్ నేతలు తప్ప ఇంకెవరూ టీడీపీ సభపై అటు పాజిటివ్ గా కానీ.. ఇటు నెగెటివ్ గా కానీ స్పందించలేదు. దీంతో ఒక్క బీఆర్ఎస్సే ఎందుకు కంగారు పడుతోందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీడీపీ పోటీ అంటూ చేస్తే ఒక్క బీఆర్ఎస్ పార్టీకే నష్టం జరుగుతుందా ? ఇతర ప్రధాన పార్టీలు ఎఫెక్ట్ అవ్వవా ? అసలకు టీడీపీ యాక్టివ్ కావడానికి వెనుక ఉన్న రాజకీయ సమీకరణాలేంటి ?


తెలంగాణలో టీడీపీ కార్యకలాపాలు తమకు ముప్పుగా భావిస్తున్న బీఆర్ఎస్ !


చంద్రబాబునాయుడు ఖమ్మం బహిరంగసభలో  పార్టీని వీడిన పాత నేతలందర్నీ కలసి రమ్మన్నారు. తెలంగాణను మళ్లీ కలపడం అనే మాటలు మాట్లాడిన వారిపై సెటైర్లు వేశారు. అధికార పార్టీ బీఆర్ఎస్ ను విమర్శించలేదు. ఇంకా చెప్పాలంటే.. తన తర్వాత సీఎం అయిన వాళ్లను అభివృద్ధి దిశగా తీసుకెళ్లారని అభినందించారు. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం చంద్రబాబు రాజకీయాల్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆయనకు తెలంగాణలో ఏం పని ప్రశ్నిస్తున్నారు. కవిత సహా బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా తెరపైకి వచ్చి చంద్రబాబుపై ఘాటుగా విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ ఇంత సీరియస్‌గా తీసుకోవడానికి కారణం  ఓ రకంగా వచ్చిన ఊహించని జన స్పందన అయితే.., మరో రకంగా టీడీపీ బలపడితే ఆ మేరకు తమకే నష్టం జరుగుతుందనే అంచనాకు బీఆర్ఎస్ రావడమేనని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. 


టీఆర్ఎస్ ..బీఆర్ఎస్‌గా మారడం .. టీడీపీకి ప్లస్ అయిందా ?


తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ వాదాన్ని దాదాపుగా వదిలేసింది. ఇప్పుడు తమది అంతా జాతీయ వాదం అని భారత రాష్ట్ర సమితిగా పార్టీని మార్చేశారు. తమ పార్టీ దేశం అంతా పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఏపీలోనూ క్రిస్మస్ తర్వాత బీఆర్ఎస్ కిసాన్ సెల్ శాఖను పెట్టబోతున్నారు. బీఆర్ఎస్ ఏపీలోకి వస్తున్నప్పుడు టీడీపీ .. తెలంగాణలో మళ్లీ యాక్టివ్ అవడానికి పెద్ద అవకాశం చిక్కినట్లే. గతంలో టీడీపీపై ఆంధ్రాపార్టీ అనే ముద్ర వేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ నే ఏపీలో పోటీ చేయడానికి రెడీ అవుతున్నందున.. బీఆర్ఎస్ నేతలు.. టీడీపీపై అలాంటి ముద్ర వేయలేరు. ఒక వేళ వేసినా ప్రజల్లో అంత సీరియస్ నెస్ అనిపించదు. బీఆర్ఎస్ జాతీయ స్ఫూర్తిగా దేశవ్యాప్తంగా పోటీకివెళ్తుంది కదా అనే వాదన వస్తుంది. కేసీఆర్ తీసుకున్న జాతీయరాజకీయ నిర్ణయాలను చంద్రబాబు తెలంగాణలో పార్టీని మళ్లీ పునర్ నిర్మించడానికి ఉపయోగించుకుంటున్నారని అనుకోవచ్చు. 



టీడీపీ యాక్టివ్ కావడంపై ఇతర పార్టీలు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాయి ?


తెలంగాణలో తెలుగుదేశం యాక్టివ్ కావడంపై ఒక్క బీఆర్ఎస్ మాత్రమే ఫైర్ అయింది. ఇతర పార్టీలు ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ , బీజేపీల నుంచి ఎవరూ స్పందించలేదు. నిజానికి టీడీపీ యాక్టివ్ అయితే ఎఫెక్ట్ అయ్యే పార్టీల్లో  కాంగ్రెస్ కూడా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉంటారు. దీనికి కారణం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లారు .ఆయన టీడీపీపై ఎప్పుడూ ఘాటు విమర్శలు చేయలేదు. చంద్రబాబుపై అభిమానం చూపుతారు. దీనికి కారణం.. తెలంగాణలో డీలాపడిపోయిన టీడీపీ సానుభూతి పరుల ఓట్లను తన వైపు ఉంచుకోవడమేనని చెబుతూంటారు. రేవంత్  పై టీడీపీ సానుభూతిపరులు అభిమానం చూపుతారనేది బహిరంగ రహస్యం. ఇప్పుడు టీడీపీనే యాక్టివ్ అయితే ఆ మేరకు ఆయన సపోర్టర్ల సంఖ్య తగ్గిపోతుంది. ఇక ఈ ప్రభావం బీజేపీపైన ఉంటుంది. తెలుగుదశం పార్టీలో చేరిన వారు బీఆర్ఎస్‌లో చేరగా. మిగిలిన వారు చాలా మంది టీ  బీజేపీలో చేరారు. వారిలో కొంత మంది చాలా యాక్టివ్ గా ఉన్నారు. వీరేందర్ గౌడ్, గరికపాటి మోహన్ రావు.. ఇలా కొంత మంది ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల వైపు వెళ్లలేని కొంత క్యాడర్ కూడా బీజేపీ వైపు మొగ్గింది. ఇప్పుడు టీడీపీ యాక్టివ్ అయితే.. ఆ మేరకు క్యాడర్ టీడీపీకి తిరిగి వస్తే రెండు పార్టీలకూ నష్టమే. అయినప్పటికీ జరగబోయే రాజకీయ పరిణామాలపై రెండు పార్టీలు గుంభనంగా ఉంటున్నాయి. 
 


అసలు టీడీపీ.. తెలంగాణలో ఎలాంటి రాజకీయ లక్ష్యాలను నిర్దేశించుకుంది ?


తెలంగాణలో బలపడిపోయి అధికారం చేపడుతుందని..టీడీపీ గురించి ఎవరూ అనుకోవడం లేదు. కానీ ఎంతో కొంత ఓటు  బ్యాంక్  ను మాత్రం ఖచ్చితంగా తెచ్చుకుంటుందని నమ్ముతున్నారు. ఇప్పటికే తెలంగాణలో రాజకీయ పార్టీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బీఆర్ఎస్ అధికార పార్టీగా ఉంది. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఊహించని రీతిలో బీజేపీ అధికార పీఠానికి పోటీ పడుతోంది.  అధికారం కోసం జరిగే పోరులో ఈ మూడు పార్టీలో పోటీ పడతాయి. కానీ తమ ఉనికి బలంగా చాటడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని బీఎస్పీ, షర్మిల నేతృత్వంలోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. నిన్నటిదాకా పోటీ చేస్తుందా లేదా అన్న స్థితిలో ఉన్న తెలుగుదేశం కూడా ఈ జాబితాలో చేరింది. గత చరిత్ర దృష్ట్యా చూస్తే.. టీడీపీని తక్కువగా అంచనా వేయలేరు. ఆ పార్టీకి బలమైన అభ్యర్థులు ఉంటే.. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఖమ్మం జిల్లాలో కొన్ని సీట్లకు గట్టిపోటీ ఇవ్వవొచ్చన్న అంచనా ఉంది. అయితే టీడీపీ చీల్చే ఓట్లే కొన్ని రాజకీయ పార్టీల గెలుపోటములని తారుమారు చేయవచ్చన్నది ఎక్కువ మంది అంచనా. ఇదే ఇప్పుడు కీలకం అవుతోంది.