మైలవరం నియోజకవర్గంలో వసంత, దేవినేని మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. దేవినేని ఉమాను టార్గెట్ చేస్తూ మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత్ కృష్ణ ప్రసాద్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. దేవినేని ఉమా రాజకీయ వ్యభిచారి అంటూ వసంత మండిపడ్డారు. అతీగతి లేని తాడు బొంగరం లేని వెధవ దేవినేని ఉమామహేశ్వరరావు అంటూ వ్యాఖ్యానించారు. తాను ప్రభుత్వానికి పన్ను చెల్లించి వ్యాపారాలు చేసి ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించానని, దేవినేని ఉమా తండ్రికి గవర్నమెంట్ ఒక సెంటులో 6 గజాలు భూమి ఇస్తే ఇందులో ఆరో భాగం నుంచి ఉమ బతుకు ప్రారంభమైందన్నారు. అలాంటి వ్యక్తి  తనను అవినీతిపరుడు అనేవారా అని నిలదీశారు. అవినీతిపరుడు కాకపోతే ఎక్కడ నుంచి సంపాదించి గత ఐదుసార్లు ఎన్నికల్లో పోటీ చేశారో ఉమా చెప్పాలన్నారు. తాను అచెంలంచెలుగా ఎదిగి రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేస్తున్నానని, ఆయన చేశారో చెప్పాలంటూ ఫైర్ అయ్యారు. 


దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి థర్డ్ గ్రేడ్ పొలిటీషియన్స్‌ను నమ్ముకుంటే నట్టేట మునిగినట్టేనని అన్నారు వసంత్‌. తన అన్న చనిపోతే, కనీసం ఆయన చిన్నపిల్లలకు అచ్చట ముచ్చట కూడా తీర్చని వెధవ అంటూ దుయ్యబట్టారు. ఉమ తన రాజకీయం తాను చూసుకోవాలన్నారు. ఇంకా ఏమైనా మాట్లాడదలుచుకుంటే రా ఒకే వేదిక మీద చర్చకు దిగుదాం అని సవాల్ విసిరారు. ఎక్కడో ఏదో పైపులు లీకై బూడిద నీరు పోతుంటే దానికి కూడా తనపై ఆరోపణలు చేయడం ఏంటని నిలదీశారు. బురద కాల్వలను కూడా తవ్వి దాన్ని కూడా గీకి దోచుకునే పంది దేవినేని ఉమ అన్నారు. శవాల పక్కన చిల్లర పెంకులు ఏరుకునే వైఖరి ఉమాదని, తాము రైట్ రాయల్‌గా బతుకుతామని సవాల్ చేశారు. తాను రాజకీయంగా దేవినేని ఉమాను ఓడించేందుకు రాజకీయాల్లోకి వచ్చానని, ఆ పని పూర్తయ్యిందన్నారు. అంతే కాదు ఎవరు పోటీ చేస్తే దేవినేని ఉమాను ఓడించగలరో జగన్‌కు తెలుసని తెలిపారు. జోగికి కూడా ఇదే విషయాన్ని చెప్పానని, తామిద్దం కలసి చర్చించుకుంటామని అన్నారు.


ఉమా కౌంటర్...


దేవినేని ఉమా కూడా వసంత పై ద్వజమెత్తారు. బూడిద రాజకీయాలు చేసుకుంటూ కోట్ల రూపాయల అవినీతికి వసంత పాల్పడుతున్నారని, ఇందుకు అధికార యంత్రాంగాన్ని సైతం వినియోగించుకుంటున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో వసంత అవినీతిపై పోరాటం చేస్తామని తెలిపారు. కొండపల్లిలో ఇసుక దోపిడి, మత్య్సకారుల ఇళ్లు ఖాళీ చెయ్యించడంతోపాటు అక్రమంగా చేసే ఇసుక రవాణాల గురించి వసంత ఏం చెబుతారని నిలదీశారు. కొండపల్లి ప్రజలకు దేవినేని ఉమా ద్రోహం చేస్తున్నారన్నారని మాట్లాడటం వెనుక రాజకీయం ఏంటని నిలదీశారు. కొండపల్లి ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థలు అన్ని కూడా కుళ్లిపోయాయని ధ్వజమెత్తారు. బూడిద రవాణాపైన వెంటనే చర్యలు తీసుకోవాలని... పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదన్నారు. ఎమ్మెల్యే ఎంత పనికి మాలీన వాడు కాబట్టే కనీసం అధికారులు కూడా మాట వినటం లేదని ఎద్దేవా చేశారు.


ఇప్పుడే ఎందుకు ఇలా....


మూడు సంవత్సరాల కాలంలో దేవినేని, వసంత మధ్య ఇంత స్థాయిలో రాజకీయాలు లేవు. అయితే ఇటీవల వసంతకు మంత్రి జోగికి మధ్య రాజకీయపరమైన పంచాయితీ జరిగింది. దీన్ని కేంద్రంగా చేసుకొని టీడీపీ పావులు కదిపింది. ఇందులో భాగంగానే దేవినేని ఉమా వసంతను టార్గెట్ చేశారు. బీసీ వర్గానికి చెందిన మంత్రి కావటంతో జోగిని దేవినేని టచ్ చేయలేదని, తన వర్గానికి చెందిన వ్యక్తి కావటంతోపాటుగా, వసంత వలనే తాను పరాజయం పాలయ్యాను కాబట్టి, అదే కోణంలో దేవినేని రాజకీయం మొదలు పెట్టారని అంటున్నారు. వసంత కూడా జోగి ఎపిసోడ్ రాజకీయంగా చర్చనీయాంశం కావటంతో దాని నుంచి బయటకు వచ్చేందుకు దేవినేనిని టార్గెట్‌గా చేసుకొని రాజకీయం మొదలు పెట్టారని ప్రచారం జరుగుతుంది.