Chinese AI Model DeepSeek News: చైనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ 'డీప్‌సీక్‌' (AI model DeepSeek) దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగం షేర్లు విలవిలలాడుతున్నాయి. చైనీస్ చాట్‌బాట్ మంచి సామర్థ్యాన్ని ప్రదర్శించడంతో పాటు, అత్యంత తక్కువ ఖర్చుతో ఈ మోడల్‌ను అభివృద్ధి చేయడంతో గ్లోబల్‌ టెక్నాలజీ కంపెనీలకు భయం పట్టుకుంది. చాలా తక్కువ ఖర్చుతో 'డీప్‌సీక్‌' తయారైన నేపథ్యంలో, గ్లోబల్‌ కంపెనీలు AI మోడల్స్‌ కోసం బిలియన్‌ డాలర్లను ఎందుకు ఖర్చు చేస్తున్నాయన్న ప్రశ్నలు ప్రారంభమయ్యాయి. దీంతో, జపనీస్ టెక్నాలజీ షేర్లు ఈ రోజు (మంగళవారం, 28 జనవరి 2025) తీవ్రంగా నష్టపోయాయి.


టెక్‌ కంపెనీల ఆధిపత్యానికి గండి
పాశ్చాత్య మార్కెట్లలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీల రికార్డ్‌ స్థాయి అధిక విలువలు & ఆధిపత్యానికి 'డీప్‌సీక్‌' సవాలు విసిరింది. చాలా తక్కువ పెట్టుబడితో, సమర్థవంతమైన AI మోడల్‌ను చైనీయులు తయారు చేసిన తర్వాత, పాశ్చాత్య దేశాల కంపెనీల్లో పెట్టుబడులపై సందేహాలు తలెత్తాయి. ఆయా కంపెనీల షేర్‌ విలువలపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో, US మార్కెట్లలో, గ్లోబల్‌ టెక్ దిగ్గజం ఎన్‌విడియా షేర్‌ ధర సోమవారం 17 శాతం పతనమై రక్తపాతం చూసింది. ఇటీవలి సంవత్సరాల్లో AI బూమ్ నుంచి ఎన్‌విడియా కంపెనీ విపరీతంగా లబ్ధి పొందింది, ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. ఇప్పుడు, 'డీప్‌సీక్‌' కొట్టిన దెబ్బకు ఎన్‌విడియా మార్కెట్ విలువ నుంచి ఒక్కసారిగా రికార్డ్‌ స్థాయిలో 593 బిలియన్‌ డాలర్ల విలువ తుడిచిపెట్టుకుపోయింది. ప్రపంచంలో ఏ సంస్థ ఒక్క రోజులో ఇంత నష్టాన్ని మూటగట్టుకోలేదు.


ఎన్‌విడియా షేర్లు కుప్పకూలిన తర్వాత, అమెరికాలో అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా ఆపిల్ మళ్లీ మొదటి స్థానంలోకి వచ్చింది. 'డీప్‌సీక్‌' తుపాను మైక్రోసాఫ్ట్ షేర్లు 7 బిలియన్‌ డాలర్ల విలువను కోల్పోయాయి. గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్‌ (Alphabet Inc.) మూలధన విలువ 100 బిలియన్‌ డాలర్లు తగ్గింది. ఎన్‌విడియా స్టాక్‌లో పతనం యుఎస్ స్టాక్ మార్కెట్ చరిత్రలో చూసిన అతి పెద్ద పతనాల్లో ఒకటిగా నిలిచింది.


ఓపెన్ఏఐ ప్రశంస
గత వారం, చైనీస్ స్టార్టప్ కంపెనీ డీప్‌సీక్‌, ఉచిత AI అసిస్టెంట్‌ను లాంచ్‌ చేయడంతో టెక్ స్టాక్స్‌లో బ్లడ్‌ బాత్‌ స్టార్‌ అయింది. చాలా తక్కువ వ్యయంతో ఈ AI మోడల్‌ను అభివృద్ధి చేసినట్లు డీప్‌సీక్‌  తెలిపింది. ఇది ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. వాస్తవానికి, డీప్‌సీక్‌ ఏఐ మోడల్‌, 'ఓపెన్ఏఐ' (OpenAI)కి చెందిన ఛాట్‌జీపీటీ (ChatGPT) మోడల్‌కు పోటీగా వచ్చింది. 'డీప్‌సీక్‌' గొప్పదనాన్ని ఒప్పుకోవడానికి తొలుత తటపటాయించినప్పటికీ, చివరకు, ఇది ఒక 'ఆకట్టుకునే మోడల్' అని ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ (Sam Altman) అంగీకరించారు.


యుఎస్ టెక్-హెవీ ఇండెక్స్ నాస్‌డాక్ కాంపోజిట్ సోమవారం 3.1 శాతం క్రాష్ అయ్యింది. ఫలితంగా, ఈ ఇండెక్స్ నుంచి 1 ట్రిలియన్ డాలర్లకు పైగా సంపద తుడిచిపెట్టుకుపోయింది. చైనాకు చెందిన డీప్‌సీక్‌ ఏఐ మోడల్‌నుస అమెరికాకు చెందిన 'ఓపెన్ఏఐ'కి పోటీగా పెట్టుబడిదార్లు భావించారు.


భారతీయ మార్కెట్లలో, ఈ రోజు, ఓవరాల్‌గా మార్కెట్లు భారీగా పెరిగినప్పటికీ, నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ మాత్రం రెడ్‌లో ట్రేడ్‌ అవుతోంది. 'డీప్‌సీక్‌' ఎఫెక్ట్‌ మన దగ్గర కూడా కనిపించింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: మనం ఎక్కువ పన్ను చెల్లిస్తున్న వస్తువుల లిస్ట్‌ ఇదిగో - వీటిని కొన్నప్పుడల్లా మోత మోగిపోద్ది