Finance Minister Nirmala Sitharaman: స్టాక్ మార్కెట్ లావాదేవీలపై కేంద్రం విధించే పన్నులపై ఒక ఇన్వెస్టర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఒక్కసారిగా నవ్వేశారు. ఆర్థిక మంత్రి, మంగళవారం (14 మే 2024న), ముంబైలోని BSE ఆఫీస్‌లో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. 'డెవలప్‌డ్ ఇండియా 2047' అంశంపై మాట్లాడారు. ప్రసంగం అనంతరం ప్రశ్నోత్తరాల పరంపర మొదలైంది. స్టాక్ మార్కెట్‌లో వాటాల కొనుగోలు, అమ్మకాలపై పన్నుల భారం గురించి ఒక పెట్టుబడిదారు ఆర్థిక మంత్రిని ప్రశ్నించారు.
నా లాభాలన్నీ ప్రభుత్వానికే
రిటైల్ పెట్టుబడిదార్లపై కేంద్ర ప్రభుత్వం CGST, IGST, స్టాంప్ డ్యూటీ, STT (Securities Transaction Tax), LTCG (Long Term Capital Gains Tax) వంటి పన్నులు విధిస్తోందని పెట్టుబడిదారు ఆర్థిక మంత్రికి చెప్పారు. దీనివల్ల, బ్రోకింగ్ కంపెనీల కంటే కేంద్ర ప్రభుత్వానికే ఎక్కువ ఆదాయం వస్తోందన్నారు. తాము (ఇన్వెస్టర్లు) చాలా రకాల రిస్క్‌లు తీసుకుని ఇన్వెస్ట్ చేస్తుంటే, భారత ప్రభుత్వం మాత్రం లాభాలన్నీ తీసుకుంటోందని ఆర్థిక మంత్రితో అన్నారు. నా డబ్బు, నా రిస్క్, నా సిబ్బందితో నేను వర్కింగ్ పార్టనర్‌గా పని చేస్తుంటే.. మీరు (ప్రభుత్వం) స్లీపింగ్ పార్టనర్‌గా (Sleeping Partner) ఉన్నారని అన్నారు. పెట్టుబడిదారు ప్రకటనకు ఆర్థిక మంత్రి సీతారామన్ నవ్వు ఆపుకోలేకపోయారు. హాల్లో కూర్చున్న వాళ్లంతా కూడా నవ్వారు.
నా దగ్గర ఉన్నదంతా తెల్లధనమే
పెట్టుబడిదారు ప్రశ్న ఇక్కడితో ఆగలేదు. ఇంటిని కొంటే వర్తించే జీఎస్టీ, స్టాంప్ డ్యూటీ గురించి కూడా ఆర్థిక మంత్రిని ప్రశ్నించారు. ఇంటి కొనుగోలుపై క్యాష్ రూపంలో పేమెంట్ రద్దు చేసినట్లు ఆర్థిక మంత్రికి ఫిర్యాదు చేశారు. "ముంబైలో ఇల్లు కొనడం ఇప్పుడు పీడకలలా మారింది. నేను అన్ని పన్నులు చెల్లిస్తా కాబట్టి, నా దగ్గర మిగిలినదంతా తెల్లధనమే. రియల్ ఎస్టేట్ డెవలపర్ మాత్రం నగదును అంగీకరించట్లేదు. ప్రభుత్వానికి పన్నులు కట్టిన తర్వాత మిగిలే మొత్తం నా బ్యాంకు ఖాతాలో ఉంది. నాలాంటి వాళ్లు ఇల్లు కొన్నప్పుడు స్టాంప్ డ్యూటీ, జీఎస్టీ చెల్లించాలి. ముంబయి లాంటి నగరాల్లో ఇల్లు కొంటే ఇంటి ధరలో మొత్తం 11 శాతం పన్ను రూపంలో ప్రభుత్వానికి వెళ్తోంది. ఇలాంటి పరిస్థితిలో, పరిమిత వనరులు ఉన్న మాలాంటి చిన్న వ్యక్తులకు మీరు ఎలా సహాయం చేస్తారు?. ఆదాయమంతా కోల్పోతూ వర్కింగ్ పార్టనర్‌గా ఉన్న ఇన్వెస్టర్‌పై ఇంత పన్ను భారం విధిస్తే, ఏ పెట్టుబడిదారుడైనా ఎలా పని చేస్తాడు?" అని ప్రశ్నించారు.
ఆ వ్యక్తి ఆర్థిక మంత్రిని అడిగిన ఈ ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆర్థిక మంత్రి చెప్పిన సమాధానం
రిటైల్ ఇన్వెస్టర్ అడిగిన ప్రశ్నపై ఆర్థిక మంత్రి చాలా తెలివిగా మాట్లాడారు. ఇన్వెస్టర్ అడిగిన ప్రశ్నకు తన దగ్గర సమాధానం లేదంటూనే, స్లీపింగ్ పార్ట్‌నర్ సమాధానం చెప్పరంటూ తప్పించుకున్నారు.
మరో ఆసక్తికర కథనం: AISలో వచ్చిన కొత్త మార్పుతో టాక్స్‌పేయర్లకు వచ్చే ప్రయోజనమేంటి?