Tata Group Top Executives' Salaries Hike: ప్రస్తుతం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద, చిన్న కంపెనీలన్నీ ఆర్థిక మాంద్యం భయంతో గడగడ వణుకుతున్నాయి. కంపెనీ ఖర్చులు తగ్గించుకోవడానికి, చిన్నాచితక వ్యయాల నుంచి ఉద్యోగాలు ఊడబీకే వరకు చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే, మన దేశంలోని అత్యంత విలువైన బిజినెస్‌ గ్రూప్‌ టాటా గ్రూప్, తన టాప్ ఎగ్జిక్యూటివ్‌కు అద్భుతమైన బహుమతి ఇచ్చింది. అది కూడా సాదాసీదా పెంపు కాదు, కళ్లు చెదిరే రేంజ్‌లో పే హైక్‌ (pay hike) ప్రజెంట్‌ చేసింది. 


రూ. 22 లక్షల కోట్ల విలువైన టాటా గ్రూప్‌లోని టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ల నెలవారీ ఆదాయాల్లో సిక్స్‌టీన్‌ నుంచి సిక్స్‌టీ పర్సెంట్‌ వరకు అద్భుతమైన పెరుగుదల కనిపించింది.


ఏ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌ల జీతాలు పెరిగాయి?


టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇండియన్‌ హోటల్స్ కంపెనీ లిమిటెడ్‌ (IHCL), టాటా పవర్ (Tata Power), ట్రెంట్ (Trent), టాటా కన్స్యూమర్ (Tata Consumer) వంటి గ్లోబల్‌ ఫేమస్‌ కంపెనీలున్న టాటా గ్రూప్‌లో, వ్యాపారంలో అధిక వృద్ధి చూపించిన ఎగ్జిక్యూటివ్‌ల జీతాలు పెరిగాయి. దేశంలోని ఇతర బిజినెస్‌ గ్రూప్‌ల కంటే ఎక్కువ హైక్‌ను టాటా గ్రూప్‌ టాప్‌ ఎగ్జిక్యూటివ్స్‌ అందుకున్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బిజినెస్‌ గ్రూప్‌గా మారే క్రమంలో, టాటా సన్స్‌ 97 బిలియన్‌ డాలర్ల అమ్మకాల ఆదాయ వృద్ధిని సాధించింది. దీంతో పాటు, దాని కంపెనీల్లో 20 శాతం బలమైన వృద్ధి కనిపించింది.


జీతంలో పెంపు, కమీషన్, ఇతర చాలా రకాల ప్రయోజనాలు కూడా శాలరీ ప్యాకేజీ హైక్‌లో భాగంగా పెరిగాయి. భారీగా జీతాల పెంపును నజరానాగా అందుకున్న టాటా గ్రూప్ టాప్ ఎగ్జిక్యూటివ్‌లలో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మాజీ CEO రాజేష్ గోపీనాథన్ పేరు కూడా ఉంది.


ఏ టాప్ ఎగ్జిక్యూటివ్‌ జీతం ఎంత పెరిగింది?


ట్రెంట్‌కు చెందిన పి.వెంకటేశ్వర్లు జీతం 62 శాతం పెరిగింది.


ఇండియన్ హోటల్స్‌కు చెందిన పునీల్ చత్వాల్ జీతపు ఆదాయం 37 శాతం పెరిగింది.


టాటా కన్జ్యూమర్‌కు చెందిన సునీల్ డిసౌజా జీతం 24 శాతం పెరిగింది.


టాటా కెమికల్స్‌కు చెందిన ఆర్,ముకుందన్ జీతం 16 శాతం పెరిగింది.


టాటా పవర్‌కు చెందిన ప్రవీర్ సిన్హా జీతం 16 శాతం పెరిగింది.


టీసీఎస్‌కు చెందిన రాజేష్ గోపీనాథన్ జీతం 13 శాతం పెరిగింది.


దేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌ TCS


టాటా గ్రూప్‌లోని ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, భారతదేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా నిలిచింది. బ్రాండ్ కన్సల్టెన్సీ కంపెనీ ఇంటర్‌బ్రాండ్ (Interbrand) ఈ రిపోర్ట్‌ను రిలీజ్‌ చేసింది. భారతదేశంలోని అత్యంత విలువైన బ్రాండ్‌లతో టాప్-50 లిస్ట్‌ను ప్రకటించింది. 


ఈ సంవత్సరం ఎడిషన్‌లోని మొత్తం కంపెనీల విలువ రూ. 8,31,005 కోట్లు ($100 బిలియన్లు). గత దశాబ్ద కాలంలో ఈ విలువ ఏకంగా 167% పెరిగింది. లిస్ట్‌ మొత్తం విలువ $100 బిలియన్‌ మార్కును దాటడం ఇదే తొలిసారి.


మోస్ట్‌ వాల్యూడ్‌ టాప్‌-10 ఇండియన్‌ బ్రాండ్స్‌:


ఇంటర్‌బ్రాండ్ రిపోర్ట్‌ ప్రకారం, ఫస్ట్‌ ర్యాంక్‌లో ఉన్న TCS బ్రాండ్‌ వాల్యూ రూ. 1,09,576 కోట్లు. సెకండ్‌ ర్యాంక్‌లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ బ్రాండ్‌ విలువ రూ. 65,320 కోట్లు. మూడో స్థానంలో ఉన్న ఇన్ఫోసిస్‌ బ్రాండ్‌ వాల్యూ రూ. 53,324 కోట్లు. 


4. HDFC బ్యాంక్‌ - రూ. 50,291 కోట్లు.
5. జియో - రూ. 49.027 కోట్లు.
6. ఎయిర్‌టెల్‌ - రూ. 46,553 కోట్లు
7. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) - రూ. 33,792 కోట్లు
8. మహీంద్ర & మహీంద్ర - రూ. 31,136 కోట్లు
9. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) - రూ. 30.055 కోట్లు
10. ICICI బ్యాంక్‌ - రూ. 25,915 కోట్లు


మరో ఆసక్తికర కథనం: పరుగులు పెడుతున్న పారిశ్రామిక రంగం, భారీగా పెరిగిన ఉత్పత్తి