బీఆర్‌ఎస్‌ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రావు, జూపల్లి కృష్ణారావు పొలిటికల్‌ హైడ్రామాకు 24 గంటల్లో తెరపడనుందని తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నప్పటికీ ఎక్కడా అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో వారి రాజకీయ ప్రయాణంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అన్నింటికి తెరదించుతూ బుధవారం కీలకమైన ప్రెస్‌మీట్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.


రేపు ప్రెస్ మీట్


పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు బుధవారం పెట్టే ప్రెస్‌మీట్‌లో మరో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ జాయిన్ అవుతున్నారని టాక్‌ బలంగా వినిపిస్తోంది. ఈ నెల 15న ఖమ్మంలో బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. దీంట్లో కేంద్రహోంమంత్రి అమిత్‌షా పాల్గొననున్నారు. దానికి ఒక్క రోజు ముందే పొంగులేటి ప్రెస్ మీట్ పెట్టనున్నారు. 


బీజేపీ రాయబారం ఫెయిల్


పొంగులేటితో కాషాయ కండువా కప్పించాలని బీజేపీ తీవ్రంగా శ్రమించింది. చాలా మందితో రాయబారం పంపించింది. చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్‌ కూడా వెళ్లి మాట్లాడారు. తన అనుచరులు ఎవరూ ఆ  పార్టీ వైపు మొగ్గు చూపకపోవడంతో పొంగులేటి ఆలోచించారు. ఎక్కువమంది కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపుతుండటంతో బీజేపీలో చేరేందుకు నిరాకరించారు. 


కాంగ్రెస్‌లో చేరడానికి కారణాలు


బుధవారం నిర్వహించే ప్రెస్‌మీట్‌లో తమ భవిష్యత్ కార్యాచరణను పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి ప్రకటించనున్నారు. తాము ఎందుకు బీఆర్‌ఎస్ వీడాల్సి వచ్చింది. అధిష్ఠానంతో ఎందుకు గ్యాప్ పెరిగిందో వివరిస్తారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి ఉన్న కారణాలు, బీజేపీలో చేరడానికి ఉన్న సమస్యలు ప్రజల ముందు ఉంచారు. 


ఖమ్మం నుంచి పొంగులేటి పోటీ?


ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ అధినాయకత్వంతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో తన అనుచరులకు ఎక్కువ మందికి టికెట్స్ ఇవ్వడానికి కాంగ్రెస్ అంగీకరించినట్టు సమాచారం. పొంగులేటి కూడా ఈసారి ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్‌ గెలిచి మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయనపై పోటీకి పొంగులేటి సిద్ధమైనట్టు కనిపిస్తోంది. 


పొంగులేటితోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీగా నేతలు కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతన్నారని తెలుస్తోంది. ఇది కాంగ్రెస్‌కు మంచి బూస్ట్‌లా పని చేస్తుందన్న విశ్లేషణుల గట్టిగానే వినిపిస్తున్నాయి.  2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం తర్వాత నుంచి పొంగులేటి పార్టీకి దూరంగా జరుగుతూ వచ్చారు. ఆయన మౌనంపై చాలా ఊహాగానాలు వినిపించాయి. కానీ చివరకు కారు దిగేందుకే సిద్ధమైనట్టు చెబుతూ ఆత్మీయ సమ్మేళనాలు పెట్టడం స్టార్ట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై, బీఆర్‌ఎస్‌ నాయకత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఒక్కరిగా ఉన్న ఆయనకు జూపల్లి కృష్ణారావు తోడుగా నిలబడ్డారు. 


వేటు వేయడంతో మరింతగా విమర్శలు


ఒక్కడు కాస్త ఇద్దరు అయ్యేసరికి బీఆర్‌ఎస్ సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఇద్దర్నీ పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో వార్‌ మరింత ముదిరింది. అప్పటి వరకు బీఆర్‌ఎస్‌లో వీళ్ల స్థానం ఏంటీ అన్న చర్చ జరిగింది. ఎప్పుడైతే వాళ్లపై వేడు పడిందో అప్పటి నుంచి వాళ్లిద్దరు ఎటువైపు వెళ్తారన్న చర్చ మొదలైంది. బీఆర్‌ఎస్‌ పార్టీయేతర పక్షాలన్నీ పొంగులేటిని సంప్రదించాయి. తమ పార్టీలో చేరాలంటూ రిక్వస్ట్‌లు పెట్టుకున్నాయి. 


అనుచరులకు టికెట్‌లు
తన జిల్లా ప్రజలు, అనుచరులు ఎటువైపు వెళ్లమంటే అటే వెళ్తానంటూ చెప్పుకొచ్చిన పొంగులేటి చివరకు కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. వచ్చే వారంలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ సాక్షిగా కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకోవాలని చూస్తున్నారు. దీనిపై బుధవారం అధికారిక ప్రకటన చేయబోతున్నారు. 


ముగ్గురితోపాటు మరెందరో?


పొంగులేటితోపాటు జూపల్లి కృష్ణారావు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరబోతున్నారని సమాచారం. వీళ్లిద్దరూ మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన నేతలు. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి మొన్నటి కేసీఆర్ టూర్‌లో పాల్గొన్నారు. ఆయనతో వేదిక కూడా పంచుకున్నారు. ఇంతలో సడెన్‌గా పొంగులేటి వర్గంలో చేరడంతో సంచలనంగా మారింది.