British awards in 2024:భారత్‌, యూకే మధ్య రిలేషన్ పటిష్టమయ్యేందుకు కృషి చేస్తున్న వివిధ రంగాల వాళ్లకు బ్రిటన్ అవార్డులు ప్రకటించింది. టాటా గ్రూప్ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌తోపాటు పలువురు ప్రముఖులను ఈ పురస్కారాలతో బ్రిటన్ గౌరవించింది. వాణిజ్య, వ్యాపార, ఇతర సంబంధాలు మెరుగుపరచడంలో వీళ్ల పాత్రను గుర్తిస్తూ 2024కి ఈ అవార్డులు ఇచ్చింది.  


Civil Divisionలో ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్ అవార్డు టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌కు వరించింది. UK, భారతదేశం వ్యాపార సంబంధాలకు చేసిన సేవలకు గానూ ఈ పురస్కారం ఇచ్చారు. ఇదే విభాగంలో మరో పారిశ్రామికవేత్త భారతీ ఎంటర్ప్రైజెస్‌ ఫౌండర్ ఛైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ని కూడా హానరీ డీబీఈ అవార్డుతో గౌరవించింది.  


బ్రిటన్‌లో సెటిల్ అయ్యి ఆ దేశానికి సేవ చేస్తున్న భారతీయులకి కూడా అవార్డులు అందించింది. అన్‌డివైడెడ్‌ ఇండియన్‌ ఎక్స్ సర్వీస్‌మెన్‌ అసోసియేషన్ ఫౌండర్ మెంబర్‌ అయిన రాజిందర్‌ దత్‌కి కూడా హానరీ ఎంబీఈ అవార్డుతో సత్కరించింది. యూకేలో సెటిల్ అయిన సౌత్‌ ఏసియన్‌ కమ్యూనిటీ కోసం చేసిన కృషికి అవార్డు వరించింది. బ్రిటిష్ హై కమిషన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ క్యాపిటల్ టీమ్‌ హెడ్‌ అయిన గౌరవ్ కపూర్‌కి అవార్డు ఇచ్చింది. భారతదేశంలో నివసిస్తున్న బ్రిటిష్ గూర్ఖా వెటరన్స్ కమ్యూనిటీకి సేవలు అందించిన బ్రిటిష్ గూర్ఖా వెటరన్స్ కమ్యూనిటీ హానరీ ఏరియా వెల్ఫేర్ ఆఫీసర్‌ అయిన సత్యసాగర్ ఘలే అనే వ్యక్తికి అవార్డు ఇచ్చింది. 


బ్రిటన్ ఇచ్చిన అవార్డుపై టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ నటరాజన్ చంద్రశేఖరన్ స్పందించారు. "ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. అవార్డుకు ఎంపిక చేసిన కింగ్ చార్లెస్‌కు కృతజ్ఞతలు. టెక్నాలజీ, కన్జూమర్, హాస్పిటాలిటీ, ఉక్కు, రసాయనాలు, ఆటోమోటివ్ రంగాల్లో యూకేతో పటిష్టమైన, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించడం టాటా గ్రూప్‌నకు గర్వకారణం. జాగ్వార్ ల్యాండ్ రోవర్,  టెట్లీ లాంటి మా ఐకానిక్ బ్రిటీష్ బ్రాండ్లు మాకెంతో గర్వకారణమైనవి. యూకేలో మా సంస్థల్లో 70,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, వార్విక్ యూనివర్సిటీ, స్వాన్‌సీ యూనివర్సిటీ సహా అనేక గొప్ప సంస్థల పరిశోధనలు, విద్యా ఫలాలను ఆస్వాదిస్తున్నాం.


మాకు ఎనలేని మద్దతు ఇస్తున్న యూకే ప్రభుత్వానికి టాటా గ్రూప్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యూకేతో బంధాలను, కార్యకలాపాలను మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నాను. ప్రతిష్టాత్మక పురస్కారంతో నన్ను గౌరవించినందుకు మరోసారి ధన్యవాదాలు" అని చంద్రశేఖరన్ తెలిపారు.