Tata Consumer - Bisleri: టాటా గ్రూప్‌లోని టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ చేతికి బిస్లరీ బాటిల్‌ చిక్కింది. బిస్లరీ ఇంటర్నేషనల్‌ను (Bisleri International) దాదాపు ₹7000 కోట్లతో కొనుగోలు చేయబోతోందని సమాచారం. బిస్లరీ చైర్మన్ రమేష్ చౌహాన్ ఈ విషయాన్ని చూచాయగా చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 


ఈ వార్తతో, ఇవాళ (గురువారం) ఓపెనింగ్‌ ట్రేడింగ్‌లో, నిఫ్టీ50 స్టాక్స్‌లో టాటా కన్స్యూమర్ టాప్ గెయినర్‌గా నిలిచింది. 2.5% లాభంతో ఓపెన్‌ అయింది.


డీల్‌ ఖరారైతే మరింత దూకుడు
టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (TCPL) పేరిట టాటా గ్రూప్ కన్స్యూమర్ బిజినెస్ చేస్తోంది. హిమాలయన్ బ్రాండ్‌తో ప్యాక్ చేసిన మినరల్ వాటర్‌ను, హైడ్రేషన్ సెగ్మెంట్‌లో టాటా కాపర్ ప్లస్ వాటర్, టాటా గ్లూకో+ బ్రాండ్లతో బాటిల్డ్‌ వాటర్‌ను ఇప్పటికే విక్రయిస్తోంది.


ఈ డీల్ ఖరారైతే, టాటా గ్రూప్‌నకు రాకెట్‌ లాంటి న్యూస్‌ అవుతుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న బాటిల్ వాటర్ సెగ్మెంట్‌లో ఈ కంపెనీ పెద్ద మార్కెట్‌ వాటా సొంతమయ్యే ఛాన్స్‌ ఉంది.


చౌహాన్ చెబుతున్న ప్రకారం, FY23 పూర్తయ్యేసరికి బిస్లరీ బ్రాండ్ టర్నోవర్ రూ. 2,500 కోట్లుగా ఉంటుంది. రూ. 220 కోట్ల లాభం వస్తుందని అంచనా వేశారు.


వాస్తవానికి బిస్లరీ ఒక ఇటాలియన్ బ్రాండ్. 1965లో ముంబైలో అడుగు పెట్టింది. నాలుగు సంవత్సరాల తర్వాత, 1969లో చౌహాన్‌ బ్రదర్స్‌ దీనిని కొనుగోలు చేశారు.


₹19,315 కోట్ల మంచినీళ్ల వ్యాపారం
FY2021లో, భారతదేశంలో బాటిల్ వాటర్ మార్కెట్ విలువ USD 2.43 బిలియన్లు (సుమారు ₹19,315 కోట్లు) అని మార్కెట్ రీసెర్చ్‌ ఫర్మ్‌ టెక్‌సై రీసెర్చ్‌ (TechSci Research‌) నివేదిక బట్టి తెలుస్తోంది.


ఖర్చు చేయగలిగిన ఆదాయం పెరగడం, ఆరోగ్యం & పరిశుభ్రతపై అవగాహన పెరగడం, నీటి ఉత్పత్తుల్లో వైవిధ్యం వంటి కారణాల వల్ల బాటిల్ వాటర్ మార్కెట్ విలువ 13.25 శాతం CAGR వద్ద వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు.


కిన్లీ (Kinley) బ్రాండ్‌తో కోకా-కోలా ఇండియా, ఆక్వాఫినా (Aquafina) బ్రాండ్‌తో పెప్సికో, బెయిలీ (Bailley) బ్రాండ్‌తో పార్లే ఆగ్రో, రైల్‌ నీర్‌ (Rail Neer) బ్రాండ్‌తో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సహా చాలా కంపెనీలు ఈ విభాగంలో పోటీపడుతున్నాయి. అయితే అవన్నీ మార్కెట్ లీడర్ బిస్లరీ కంటే వెనుకంజలో ఉన్నాయి. 


గతంలో, టాటా కెమికల్స్‌లో (Tata Chemicals) అంతర్భాగంగా ఉన్న వినియోగదారు ఉత్పత్తుల వ్యాపారాన్ని టాటా గ్లోబల్ బెవరేజెస్‌తో (Tata Global Beverages) విలీనం చేసిన తర్వాత, విలీన సంస్థగా TCPL ఏర్పడింది. FMCG కేటగిరీలో తన వ్యాపారాన్ని బాగా విస్తరిస్తోంది. కొత్త రంగాల్లోకి కూడా అడుగు పెడుతూ ఒక బలమైన ప్లేయర్‌గా పేరు సంపాదించేందుకు TCPL గట్టిగా ప్రయత్నం చేస్తోంది.


ఇవాళ ఉదయం 10 గంటల సమయానికి 2.77% లాభంతో రూ.791.50 దగ్గర TCPL షేర్లు ట్రేడ్‌ అవుతున్నాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.