T+0 Settlement Beta Version: స్టాక్ మార్కెట్‌లో ఈ రోజు (గురువారం, 28 మార్చి 2024) చిరస్థాయిగా నిలిచిపోతుంది. కొత్త సెటిల్‌మెంట్ సిస్టమ్ T+0 సెటిల్‌మెంట్ కోసం కొనసాగుతున్న నిరీక్షణ నేటితో ముగిసింది. మార్కెట్‌లో ఈ రోజు నుంచి T+0 సెటిల్‌మెంట్ అమల్లోకి వచ్చింది. ప్రస్తుతానికి దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నందున, అన్ని షేర్లకు T+0 సెటిల్‌మెంట్ సదుపాయం అందుబాటులో ఉండదు.


ఈ రోజు నుంచి, 25 షేర్లు T+0 సెటిల్‌మెంట్‌ కిందకు వస్తాయి. అంటే, ఈ 25 షేర్లకు బీటా వెర్షన్‌ అందుబాటులో ఉంది. ఇది కూడా పరిమిత బ్రోకింగ్‌ కంపెనీలకే అందుబాటులో ఉంటుంది. T+0 సెటిల్‌మెంట్‌కు సెబీ బోర్డు ఈ నెల ప్రారంభంలో ఆమోదం తెలిపింది. ఆ తర్వాత T+0 సెటిల్‌మెంట్ అమలయ్యే 25 స్టాక్స్‌ జాబితాను బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (BSE) విడుదల చేసింది. 


T+0 సెటిల్‌మెంట్ కింద ఉన్న 25 స్టాక్స్‌


అంబుజా సిమెంట్స్, అశోక్ లేలాండ్, బజాజ్ ఆటో, బ్యాంక్ ఆఫ్ బరోడా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL), బిర్లా సాఫ్ట్, సిప్లా, కోఫోర్జ్, దివీస్ లాబొరేటరీస్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఇండియన్ హోటల్స్, JSW స్టీల్, LIC హౌసింగ్ ఫైనాన్స్, LTI మైండ్‌ట్రీ, MRF, నెస్లే ఇండియా, NMDC, ONGC, పెట్రోనెట్ LNG, సంవర్ధన్ మదర్సన్ ఇంటర్నేషనల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా కమ్యూనికేషన్స్, ట్రెంట్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వేదాంత. ఈ 25 షేర్లు మినహా మిగిలిన అన్ని కంపెనీల షేర్లకు T+1 సెటిల్‌మెంట్ వర్తిస్తుంది.


బీటా వెర్షన్‌ కింద ఐచ్ఛికంగా మాత్రమే T+0 సెటిల్‌మెంట్‌ అమలవుతుంది. మార్కెట్‌ ప్రారంభమైన తర్వాత, ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల లోపు కొన్న/అమ్మిన షేర్లకు మాత్రమే T+0 విధానం వర్తిస్తుంది. ఇండెక్స్‌ విలువను లెక్కించేందుకు, T+0 కింద సెటిలైన షేర్ల విలువలను పరిగణనలోకి తీసుకోరు.


భారత మార్కెట్‌లో ఇన్‌స్టంట్ సెటిల్‌మెంట్ ‍‌(షేర్లు కొన్న, అమ్మిన రోజే సెటిల్‌ చేయడం) విధానాన్ని అమలు చేసేందుకు సెబీ (SEBI) చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో T+1 సెటిల్‌మెంట్ విధానం అమలవుతోంది. T+1 సెటిల్‌మెంట్ ప్రకారం, ఆర్డర్ పెట్టిన ఒక రోజు తర్వాత షేర్లు/ఫండ్స్‌ను సెటిల్‌ చేస్తున్నారు. ఇప్పుడు దాని స్థానంలో T+0 సెటిల్‌మెంట్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. అంటే, ఆర్డర్ పెట్టిన రోజునే  షేర్లు/ఫండ్స్‌ పరిష్కారమవుతాయి. 


T+0 సెటిల్‌మెంట్ వల్ల ప్రయోజనాలు


25 షేర్లలో ఈ రోజు ప్రారంభమైన T+0 బీటా వెర్షన్ 3 నెలల పాటు అమలవుతుంది. 3 నెలల తర్వాత దానిపై సమీక్షిస్తారు. ఆపై మరో 3 నెలల తర్వాత రెండో సమీక్ష ఉంటుంది. ఈ రెండు సమీక్షల తర్వాత, కొత్త పరిష్కార వ్యవస్థకు సంబంధించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటారు. సెటిల్‌మెంట్‌కు పట్టే సమయాన్ని తగ్గించడం వల్ల సమయం ఆదా కావడం మాత్రమే కాదు.. మార్కెట్‌ లావాదేవీల ఖర్చులు కూడా తగ్గుతాయి. మార్కెట్‌లో పారదర్శకత మెరుగుపడుతుందని కూడా భావిస్తున్నారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: భారీ షాక్‌ ఇచ్చిన స్వర్ణం - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి