Food Delivery Sector: ఫుడ్ డెలివరీ విభాగంలో స్విగ్గీ - జొమాటో మధ్య పోటీ చాలా సంవత్సరాల క్రితం నుంచి ఉంది. IPO ద్వారా ముందుగా స్టాక్ మార్కెట్లోకి రావడంలో జొమాటో (Zomato) విజయవంతమైంది. ప్రస్తుతం, జొమాటో స్టాక్ విపరీతమైన ఉత్సాహంతో పెరుగుతోంది. షేర్ మార్కెట్‌లోకి వచ్చే విషయంలో జొమాటో కంటే స్విగ్గీ చాలా వెనుకబడింది.
"ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా చూడాలి" అన్నట్లు.. ఇప్పుడు స్విగ్గీ కూడా భారీ వాల్యూయేషన్‌తో ప్రైమరీ మార్కెట్‌లో ఎంట్రీకి (Swiggy IPO) సిద్ధమైంది. భారీ సైజ్ IPOను ఇప్పటికే ప్రకటించింది. ఈ పబ్లిక్ ఆఫర్ అతి త్వరలో లైవ్‌లోకి వస్తుంది. IPOను సక్సెస్ చేసుకునేందుకు, నిరంతరం మార్కెట్ దృష్టిలో ఉండడానికి, ఈ కంపెనీ ఒకదాని తర్వాత ఒకటిగా పెద్ద నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల... స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ దిల్లీ-ఎన్‌సీఆర్‌లోని మూడు నగరాల్లో (దిల్లీ, నోయిడా, గురుగావ్) 24 గంటల డెలివరీని ప్రకటించింది. తాజాగా, మరో కీలక డెసిషన్ తీసుకుంది. కేవలం 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ చేస్తామని స్విగ్గీ శుక్రవారం (04 అక్టోబర్ 2024) వెల్లడించింది. ఈ సర్వీస్ పేరు స్విగ్గీ బోల్ట్ (Swiggy Bolt). అంటే, మెరుపు (Bolt) వేగంతో ఆహారాన్ని తీసుకొచ్చి అందిస్తుందట. నేషనల్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం, ప్రస్తుతం 6 నగరాల్లో ఈ సర్వీస్ ప్రారంభమైంది.
క్విక్ కామర్స్ రంగంలో విజయవంతమైన వ్యూహం
ఇప్పటివరకు, శీఘ్ర వాణిజ్య రంగంలోని కంపెనీలు ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి, ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ప్రధాన పోటీ స్విగ్గీ - జొమాటో మధ్యే ఉంది. క్విక్ కామర్స్‌లో (Quick Commerce), జొమాటోకు చెందిన బ్లింకిట్‌ను (Blinkit) ఓడించేందుకు ఇన్‌స్టామార్ట్ (Instamart) ద్వారా స్విగ్గీ కఠినమైన యుద్ధం చేస్తోంది.
స్విగ్గీ వెబ్‌సైట్ ప్రకారం... "బోల్ట్ సర్వీస్" కింద మీరు బర్గర్, టీ, కాఫీ, శీతల పానీయాలు, అల్పాహారం, ఐస్‌క్రీమ్, స్వీట్లు, స్నాక్స్, బిర్యానీ వంటి వాటిని ఆర్డర్ చేయొచ్చు. ఈ ఆహారాలను సిద్ధం చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది కాబట్టి ప్రస్తుతానికి మెనూలో వీటిని ఉంచింది.
స్విగ్గీ బోల్ట్ సేవలు ప్రస్తుతం హైదరాబాద్, ముంబై, దిల్లీ, పుణె, చెన్నై, బెంగళూరులో ప్రారంభమయ్యాయి. త్వరలో ఇతర నగరాల్లోనూ ప్రారంభమవుతాయి.
2 కి.మీ. పరిధిలో...
స్విగ్గీ బోల్ట్ సర్వీస్‌ను మీరు ఉపయోగించుకోవాలంటే ఒక చిన్న నియమాన్ని పాటించాలి. వినియోగదారు, తనకు 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్న రెస్టారెంట్ నుంచి మాత్రమే ఆర్డర్ చేయాలి. బోల్ట్ సర్వీస్ కింద సాధారణ ఆర్డర్ తరహాలోనే రెస్టారెంట్‌ను ఎంచుకోవచ్చు, ఆర్డర్ పెట్టొచ్చు. దీనికి ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని స్విగ్గీ సీఈవో రోహిత్ కపూర్ తెలిపారు. స్విగ్గీ ప్రారంభమైన రోజులతో పోలిస్తే, ఆర్డర్ డెలివెరీ సమయాన్ని 30 నిమిషాలకు తీసుకురావడానికి స్విగ్గీ చాలా చురుగ్గా పని చేసింది. ఇప్పుడు ఆ సమయాన్ని కేవలం 10 నిమిషాలకు పరిమితం చేసేలా ముందుకెళుతోంది.
మరో ఆసక్తికర కథనం: 27 అంతస్తుల ఆంటిలియాలో అంబానీ దంపతులు ఏ ఫ్లోర్‌లో ఉంటున్నారో తెలుసా?