Telangana News: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డు పైలెట్ సర్వే మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఓ వైపు ఈ సర్వేలో ఎదురవుతున్న సమస్యలు పరిష్కరిస్తూనే మరోవైపు కార్డు ఎలా ఉండాలనే విషయంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇది కూడా ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఆధార్ కార్డు మాదిరిగానే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉంటుందని అంటున్నారు.
కార్డులో ఏం ఉంటాయి
తెలంగాణలో తీసుకొస్తున్న ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో కుటుంబానికి చెందిన సభ్యుల వివరాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క యునిక్ నెంబర్ ఉంటుంది. అన్నీ కలిపి చూపించేలా ఓ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ ఫ్యామిలీకి వస్తున్న పథకాలు, ఏ పథకానికి అర్హులో, రేషన్ కార్డు ఉందా లేదా అనే వివరాలు ఇట్టే తెలిసిపోతాయి.
నాలుగు రాష్ట్రాల్లో పరిశోధన
కార్డు రూపకల్పనతోపాటు, లోటు పాట్లు తెలుసుకునేందుకు తెలంగాణ అధికారులు వివిధ రాష్ట్రాల్లో పర్యటించారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ నేతృత్వంలో అధికారుల బృందం ఈ పరిశీలన చేసింది. హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటకలో ఈ టీం పర్యటించింది. అక్కడ అమలులో ఉన్న డిజిటల్ కార్డు విధానాన్ని గమనించింది. లోటుపాట్లు తెలుసుకుంది. ఇక్కడ అమలు చేయాల్సిన విధానం గురించి అంచనాకు వచ్చింది. దీనిపై సీఎంకు ఓ నివేదిక కూడా సమర్పించింది.
అధికారులతో సీఎం డిస్కషన్
వన్ ఫ్యామిలీ వన్ డిజిటల్ కార్డు విధానంపై గత పది పదిహేను రోజులుగా సీఎం సమీక్షలు నిర్వహిస్తున్నారు. కార్డు రూపకల్పనపై కసరత్తు చేస్తున్నారు. కార్డు ఎలా ఉండాలి. ఏ ఏ అంశాలు కార్డులో ఉంచాలి. సర్వే చేపట్టే విధానం ఇలా అన్నింటిపై అధికారులతో దఫదఫాలుగా చర్చలు జరిపారు. మొత్తానికి కార్డు రూపకల్పన ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది.
ఏఏ పథకాలు చేరుస్తారు?
రేషన్ కార్డు, మహాలక్ష్మి పథకాల లబ్ధిదారులను ప్రస్తుతానికి తొలి దశలో డిజిటలైజేషన్ చేయాలని చూస్తున్నారు. డిజిటల్ కార్డుల్లో రేషన్ కార్డుల దారుల వివరాలు, మహాలక్ష్మి పథకాల లబ్ధిదారుల వివరాలు, పొందుపరుస్తారు. తర్వాత ఆరోగ్య శ్రీ, గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్ లబ్ధిదారుల పేర్లు చేరుస్తారు. అనంతరం పింఛన్ దారుల వివరాలు పొందుపరుస్తారు. ఇలా ఒక్కొక్క దశలో ఒక్కొ పథకం లబ్ధిదారులు చేరుస్తూ వెళ్తారు.
ఒకేసారి అందరి వివరాలు చేర్చడం ఇబ్బంది అవుతుందని అధికారులు భావిస్తున్నారు. దీని వల్ల తప్పులు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే విడతల వారీగా వివరాలు నమోదు చేస్తే సమస్య ఉండదని చిన్న చిన్న మార్పులు ఉంటే చేసుకోవచ్చని అంటున్నారు. కొత్త రేషన్ కార్డులు ఇవాల్సి ఉన్నా, పథకాల లబ్ధిదారులు చేరినా వారి పేర్లు తర్వాత చేర్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ కార్డులు లబ్ధిదారుల చేతికి వస్తే పదే పదే ఆధార్, ఇతర ధ్రువపత్రాలు అధికారులకు ఇవ్వాల్సిన పనిలేదు. అవసరమైనప్పుడు ఇందులో ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ ఫ్యామిలీ వివరాలు పూర్తిగా తెలిసిపోతాయి. దీని వల్ల వాళ్లకు ఇవ్వాల్సిన పథకాలు, అర్హత వివరాలు అన్నీ అందులో డిస్‌ప్లే అవుతాయి. ఇప్పుడు ఉచిత బస్ అమలు అవుతున్నందున ఆధార్, ఇతర కార్డులతో పని లేకుండా ఈ డిజిటల్ కార్డు చూపిస్తే సరిపోతుంది. దాన్ని స్కాన్ చేసిన తర్వాత వాళ్లు అర్హులా కాదా అనేది తేలిపోతుంది.
ఈ డిజిటల్ కార్డుకు సంబంధించి కుటుంబాల వివరాలు నమోదు చేసే పైలెట్ ప్రాజెక్టు మూడో తేదీ నుంచి కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని సికింద్రాబాద్‌లో ప్రారంభించారు. ప్రతి నియోజకవర్గంలో రెండు గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఒక వార్డులో అధికారులు తిరుగుతున్నారు. ప్రజలతో మాట్లాడి వారి ఫ్యామిలీ వివరాలు సేకరిస్తున్నారు. ఆ పైలెట్ ప్రాజెక్టు ఏడో తేదీతో గడువు ముగియనుంది. అనంతరం పూర్తిస్థాయి సర్వే ఎప్పటి నుంచి వంటి వివరాలు అధికారులు తెలియజేయనున్నారు.
Also Read: రేవంత్ రెడ్డిపై సూపర్ సీనియర్స్ అసంతృప్తి - కాంగ్రెస్ కల్చర్‌ను రేవంత్ ఇంకా వంటబట్టించుకోలేదా?