Name Of The Residence of Mukesh-Nita Ambani: ఆసియాలోనే అత్యంత ధనికుడైన ముకేష్ అంబానీ నివశించే ఇంటి పేరు "ఆంటిలియా". ముకేష్ అంబానీ, అతని భార్య నీతా అంబానీతో సహా అంబానీ కుటుంబ సభ్యులందరూ ఈ ఇంట్లోనే ఉంటున్నారు. ఆంటిలియా ప్రపంచంలోనే రెండో అత్యంత ఖరీదైన నివాస భవనం. ఇది 27 అంతస్తుల నిర్మాణం. ప్రస్తుతం దీని విలువ రూ. 15,000 కోట్లని అంచనా.


అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక ద్వీపం పేరు ఆంటిలియా. అదే పేరును తమ ఇంటికి పెట్టుకుంది అంబానీ కుటుంబం. ఈ భవనంలో చాలా ప్రత్యేకతల వల్ల తరచుగా వార్తల్లో నిలుస్తుంటుంది.


ఆంటిలియాలో ముకేష్-నీతా అంబానీ ఎక్కడ నివసిస్తున్నారు?
ముకేష్ అంబానీ, నీతా అంబానీతో పాటు వారి పిల్లలు ఆకాష్ అంబానీ- అతని భార్య శ్లోకా మెహతా, మనవరాళ్ళు పృథ్వీ ఆకాష్ అంబానీ- వేదా ఆకాష్ అంబానీ అదే ఇంటిలో ఉంటున్నారు. వాళ్లంతా, యాంటిలియాలోని 27వ అంతస్తులో నివసిస్తున్నారు. 


27వ అంతస్తులో నివాసం ఉండాలన్న ఐడియా నీతా అంబానీది. అత్యంత ఎత్తులో ఉండడం వల్ల అత్యున్నత స్థాయి సూర్యకాంతిని, నాణ్యమైన గాలి & వెలుతురును ఆస్వాదించొచ్చన్న ఆలోచనతో 27వ అంతస్తును నివాసంగా మార్చుకున్నారు. యాంటిలియాలోని 27వ అంతస్తులోకి ప్రవేశం అన్యులకు నిషిద్ధం. కేవలం అతి కొద్దిమంది ప్రముఖులకు మాత్రమే అనుమతి దొరుకుతుంది.


ఆంటిలియా వాల్యుయేషన్
ఆంటిలియా విలువ 1 బిలియన్‌ డాలర్ల నుంచి 2 బిలియన్‌ డాలర్ల మధ్య ఉంటుందని మార్కెట్‌ పండితులు లెక్కలు వేశారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ప్రైవేట్ నివాసాల్లో ఒకటిగా ఇది ఖ్యాతిగాంచింది. విలువ పరంగా చూస్తే, 4.9 బిలియన్‌ డాలర్ల విలువైన బకింగ్‌హామ్ ప్యాలెస్ మాత్రమే దీని కంటే ముందు ఉంది.


ఆంటిలియా విశేషాలు 
యాంటిలియాను రెండేళ్లలో నిర్మించారు. దీని నిర్మాణం 2008లో ప్రారంభమైంది - 2010లో పూర్తయింది. రిక్టర్ స్కేలుపై 8.0 తీవ్రతతో వచ్చిన భూకంపాన్ని కూడా అవలీలగా తట్టుకునే విధంగా కట్టారు. ఇదొక విలాసవంతమైన ఆకాశహర్మ్యం. సౌకర్యాల విషయానికి వస్తే... అంబానీ హౌస్‌లో కార్ పార్కింగ్, తొమ్మిది హై-స్పీడ్ ఎలివేటర్లు, హెల్త్ స్పా, సెలూన్, మూడు స్విమ్మింగ్ పూల్స్, యోగా & డ్యాన్స్ స్టూడియోలు ఉన్నాయి. అదనపు ఆరర్షణగా ఆంటిలియాలో అతి పెద్ద హాంగింగ్ గార్డెన్‌ కూడా ఉంది. దీనిలో ప్రతిరోజూ గార్డెనింగ్‌ జరుగుతుంది.


ఆంటిలియా నిర్వహణ కోసం దాదాపు 600 మంది నిపుణులైన సిబ్బంది పని చేస్తున్నారు. మొత్తం భవనం శుభ్రత, ఇతర నిర్వహణ పనులను వాళ్లే చూసుకుంటారు. అక్కడ పని చేసే సిబ్బంది అక్కడే నివాసం ఉండేలా ప్రత్యేక గదులు కూడా ఉన్నాయి.


ప్రపంచంలోని నివాస భవనాలన్నింటిలో ఆంటిలియా చాలా ప్రత్యేకం & విభిన్నం. ప్రతి ఫ్లోర్‌ను విభిన్నమైన మెటీరియల్‌తో నిర్మించారు. ప్రతి అంతస్తుకు ఒక కథ ఉంటుంది. ప్రతి అంతస్తులో వాస్తు, శిల్పం, అలంకరణలు భారతీయతను ప్రతిబింబిస్తాయి. వాస్తవానికి ఇది 27 అంతస్తుల భవనమే అయినప్పటికీ, సాధారణ భవనాలతో పోలిస్తే 60 అంతస్తుల భవనంతో సమాన ఎత్తులో ఉంటుంది. 


మరో ఆసక్తికర కథనం: యుద్ధం దెబ్బకు ఆకాశంలో గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి