Stock Market Today, 07 March 2024: బుధవారం సెషన్‌లో, రెండో సగం నుంచి ఆశ్చర్యకరమైన బౌన్స్‌ బ్యాక్‌తో ఉత్సాహపరిచిన మార్కెట్లు, అదే మూడ్‌ను ఈ రోజు కూడా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలోని చివరి ట్రేడింగ్ సెషన్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి పెట్టుబడిదార్లు కూడా సిద్ధంగా ఉన్నట్లు సిగ్నల్స్‌ కనిపిస్తున్నాయి.


ఉదయం 8.10 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 06 పాయింట్లు లేదా 0.03 శాతం రెడ్‌ కలర్‌లో 22,639 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు గ్యాప్‌-అప్‌ అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది. 


గ్లోబల్‌ మార్కెట్లు
ఈ ఉదయం, ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలోని మార్కెట్లు పచ్చ రంగుతో ఉన్నాయి. ఆసియా మార్కెట్లలో, జపాన్ నికాయ్‌ ఇండెక్స్ 0.8 శాతం ఎగబాకి 40,314.64 వద్ద కొత్త రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది. టోపిక్స్ కూడా 0.6 శాతం పెరిగి తాజా గరిష్టాన్ని తాకింది.


దక్షిణ కొరియా కోస్పి 0.42 శాతం, స్మాల్ క్యాప్ కోస్‌ డాక్ 0.1 శాతం పడిపోయింది. హాంకాంగ్ హాంగ్ సెంగ్ ఇండెక్స్ ఫ్యూచర్స్ 16,565 వద్ద ఉన్నాయి, లాభాలను కంటిన్యూ చేసే ఉద్దేశాన్ని స్పష్టంగా చెబుతూ గత ముగింపు 16,438.09ను ఇది అధిగమించింది.


అమెరికాలో, బుధవారం, నాస్‌డాక్ కాంపోజిట్ 0.58 శాతం పెరిగింది, అంతకుముందు రెండు రోజుల క్షీణత నుంచి కోలుకుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.2 శాతం లాభపడగా, S&P 500 0.51 శాతం పెరిగింది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


ఇన్ఫోసిస్: ATP టూర్‌తో తన డిజిటల్ ఇన్నోవేషన్ ఒప్పందాన్ని 2026 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది, ప్రొఫెషనల్ టెన్నిస్‌లో AI-ఫస్ట్‌ ఆవిష్కరణలపై దృష్టి పెట్టింది.


LIC: LIC మ్యూచువల్ ఫండ్ అసెట్ మేనేజ్‌మెండ్‌లో తన వాటాను ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ద్వారా 40.93 శాతం నుంచి 44.61 శాతానికి LIC పెంచుకుంది.


NLC ఇండియా: NLC ఇండియాలోని తన వాటాలో 7 శాతం వరకు వాటాను ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా అమ్మాలని ప్రభుత్వం యోచిస్తోంది. సుమారు రూ.2,000-2,100 కోట్లను సమీకరించాలన్నది లక్ష్యం.


హిందుస్థాన్ ఏరోనాటిక్స్: ఎల్‌సీఏ ఐఓసీ కాంట్రాక్ట్‌కు సవరణ జరిగింది. దీంతో కాంట్రాక్ట్ విలువ రూ.2,700.87 కోట్ల నుంచి రూ.5,077.95 కోట్లకు పెరిగింది.


IIFL ఫైనాన్స్: బంగారు రుణాలు ఇవ్వకుండా RBI నిషేధించిన తర్వాత, కంపెనీ వాటాదారు ఫెయిర్‌ఫాక్స్ ఇండియా హోల్డింగ్స్ కార్పొరేషన్, 200 మిలియన్ డాలర్లు సాయం చేయడానికి అంగీకరించింది.


IOC: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOC), ఫార్ములా వన్ లేదా F1 మోటార్ రేసింగ్‌లో ఉపయోగించే ఇంధనం తయారీని మరో మూడు నెలల్లో ప్రారంభించనుంది.


జొమాటో: యాంట్ గ్రూప్‌లోని అనుబంధ సంస్థ మోర్గాన్ స్టాన్లీ ఆసియా Pte బుధవారం జొమాటో లిమిటెడ్‌లో రూ.909.5 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసింది.


ఐజీఎల్: ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్, దిల్లీలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) ధరలను కిలోకు రూ.2.5 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.


టాటా మోటార్స్: మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ టాటా మోటార్స్ కార్పోరేట్ ఫ్యామిలీ రేటింగ్‌ను "Ba3" వద్ద ఉంచింది, "పాజిటివ్" ఔట్‌లుక్‌ను కొనసాగించింది.


వేదాంత: తమిళనాడులోని తూత్తుకుడి రాగి స్మెల్టర్‌లో కార్యకలాపాలను పునఃప్రారంభించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో, రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసే మార్గాలను అన్వేషిస్తోంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: కొత్త రికార్డ్‌ దిశగా పసిడి పరుగు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే