Stocks to watch today, 25 October 2022: ఇవాళ (మంగళవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 25 పాయింట్లు లేదా 0.14 శాతం రెడ్‌ కలర్‌లో 17,819 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


ఇవాళ Q2 ఫలితాలు ప్రకటించనున్న మేజర్‌ కంపెనీలు: చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌ (Chennai Petroleum Corporation) సహా మరో 4 కంపెనీలు సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలను ఇవాళ ప్రకటించనున్నాయి.


నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


రిలయన్స్ ఇండస్ట్రీస్: దేశంలో అతి పెద్ద కంపెనీ అయిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, సెప్టెంబర్ త్రైమాసికం (Q2FY23) ఏకీకృత నికర లాభంలో తగ్గుదలని నివేదించింది. రెండంకెల వృద్ధి అంచనాలకు వ్యతిరేకంగా బాటమ్‌లైన్ ఏడాది ప్రాతిపదికన రూ.13,656 కోట్లకు పడిపోయింది. ప్రధాన వ్యాపారమైన ఆయిల్-టు-కెమికల్స్ ఏకీకృత ఆదాయం 32% పెరిగి రూ.1.59 లక్షల కోట్లకు చేరుకుంది.


ICICI బ్యాంక్: రెండో అతి పెద్ద ప్రైవేట్ రంగ రుణదాత ఏకీకృత నికర లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో 31.43 శాతం జంప్ చేసి రూ. 8,007 కోట్లకు చేరుకుంది. ప్రధాన వ్యాపారంలో స్థిరమైన వృద్ధి కనిపించింది. మొండి బకాయిల కోసం కేటాయిపులు తగ్గాయి.


కోటక్ మహీంద్రా బ్యాంక్: ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కోటక్‌ బ్యాంక్ ఆరోగ్యకరమైన సంఖ్యలను ప్రకటించింది. నికర లాభం 27 శాతం వృద్ధితో రూ. 2,581 కోట్లకు చేరింది. రికార్డు స్థాయి మార్జిన్లు, రుణాల్లో వృద్ధి కనిపించింది.


DLF: హౌసింగ్ ప్రాపర్టీలకు మంచి డిమాండ్ కారణంగా ఈ రియల్టీ మేజర్ సేల్స్ బుకింగ్స్‌ ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో 62 శాతం పెరిగి రూ. 4,092 కోట్లకు చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో దీని సేల్స్‌ బుకింగ్స్ రూ. 2,526 కోట్లుగా ఉన్నాయని ఇన్వెస్టర్ల ప్రజెంటేషన్‌లో ఈ సంస్థ పేర్కొంది.


యెస్ బ్యాంక్: బ్యాడ్ అసెట్స్ వెంటాడుతూనే ఉండడంతో, ఈ ప్రైవేట్‌ సెక్టార్‌ లెండర్‌ సెప్టెంబర్ త్రైమాసికం నికర లాభం 32 శాతం తగ్గి రూ. 153 కోట్లుగా నమోదైంది, ఫలితంగా అధిక కేటాయింపులు చేయాల్సి వచ్చింది. క్రితం ఏడాది ఇదే కాలంలో బ్యాంక్ పన్ను అనంతర లాభం (PAT) రూ. 225 కోట్లుగా నమోదైంది.


వొడాఫోన్‌ ఐడియా: ATC టెలికాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు (ATC Telecom Infrastructure Ltd) చెల్లించాల్సిన రూ. 1,600 కోట్ల బకాయిలను 18 నెలల్లో చెల్లించని పక్షంలో, ఆ బకాయి మొత్తాన్ని ఈక్విటీగా మార్చి సెటిల్ చేయడానికి బోర్డు ఆమోదం లభించింది. సంవత్సరానికి 11.2 శాతం కూపన్ రేటుతో, ఈక్విటీ కన్వర్టబుల్ డెట్ బాండ్ల ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించుకుంటుంది.


ఫార్మా స్టాక్స్: US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) నివేదిక ప్రకారం.. ప్రముఖ ఔషధ సంస్థలు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, అరబిందో ఫార్మా వివిధ కారణాలతో తమ ఉత్పత్తులను US మార్కెట్‌ నుంచి వెనక్కు తీసుకుంటున్నాయి.


ఇంద్రప్రస్థ గ్యాస్: దేశ రాజధాని, పరిసర ప్రాంతాల్లో CNG & పైపుల ద్వారా వంట గ్యాస్‌ను విక్రయించే ఈ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్, సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభంలో 4 శాతం పెరుగుదలను నివేదించింది. ఈ ఏడాది జులై-సెప్టెంబర్‌లో నికర లాభం రూ. 416.15 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో రూ. 400.54 కోట్లుగా ఉంది.


RBL బ్యాంక్: ఈ మిడ్ సైజ్ రుణదాత ప్రొవిజన్స్‌లో భారీ తగ్గుదల కారణంగా, బ్యాంక్‌ బాటమ్ లైన్‌ దాదాపు ఏడు రెట్లు పెరిగి సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 202 కోట్లకు చేరుకుంది


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.