Stocks to watch today, 10 March 2023: ఇవాళ (శుక్రవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 148 పాయింట్లు లేదా 0.84 శాతం రెడ్‌ కలర్‌లో 17,470 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ గ్యాప్‌ డౌన్‌లో ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


గోకల్‌దాస్ ఎక్స్‌పోర్ట్స్: ప్రమోటర్ గ్రూప్ ఎంటిటీ 'క్లియర్ వెల్త్ కన్సల్టెన్సీ సర్వీసెస్ LLP', గోకల్‌దాస్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్‌లో దాదాపు 10% వాటాను బహిరంగ మార్కెట్ ద్వారా రూ. 235 కోట్లకు విక్రయించింది.


అజంతా ఫార్మా: షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనను కంపెనీ బోర్డు పరిశీలిస్తున్నందున, ఇవాళ మార్కెట్‌ దృష్టి అజంతా ఫార్మా షేర్లపై ఉంటుంది.


హిందుస్థాన్ ఏరోనాటిక్స్: మధ్యంతర డివిడెండ్‌ను పరిశీలించి ఆమోదించేందుకు హిందూస్థాన్ ఏరోనాటిక్స్ బోర్డు ఈరోజు సమావేశం కానుంది.


REC: 2023-24 ఆర్థిక సంవత్సరంలో వివిధ మార్గాల ద్వారా రూ. 1.2 లక్షల కోట్ల వరకు నిధుల సమీకరణకు REC డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. సంస్థ వాస్తవ అవసరాలు, ఆస్తి-అప్పుల పరిస్థితి, మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి వివిధ కాల అవధుల ‍‌(different maturities) కోసం నిధుల సమీకరణ జరుగుతుంది.


విప్రో: ప్రపంచంలోని అతి పెద్ద విమానయాన సేవల సంస్థ అయిన మెన్జీస్ ఏవియేషన్, తన ఎయిర్ కార్గో మేనేజ్‌మెంట్ సేవలను మరింత సమర్థంగా మార్చుకోవడానికి విప్రోను ఎంపిక చేసుకుంది.


రిలయన్స్ ఇండస్ట్రీస్: శుభలక్ష్మి పాలిస్టర్స్, శుభలక్ష్మి పాలిటెక్స్‌ల పాలిస్టర్ వ్యాపార కొనుగోలును RIL అనుబంధ సంస్థ రిలయన్స్ పాలిస్టర్ పూర్తి చేసింది. మరోవైపు, ఐకానిక్ బేవరేజెస్‌ బ్రాండ్ కాంపా కోలాను 'రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్' మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.


డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌: సదరన్ నేవల్ కమాండ్ కొచ్చి నుంచి 64 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఒక కాంట్రాక్టు దక్కించుకుంది. ఎర్నాకులం నావల్‌ ఛానెల్‌ నిర్వహణ కోసం ఈ కాంట్రాక్ట్‌ దక్కింది.


PNC ఇన్‌ఫ్రా టెక్: రూ. 2,004 కోట్ల మొత్తంతో, NHAIకు చెందిన రెండు హైవే ప్రాజెక్ట్‌ల బిడ్స్‌లో PNC ఇన్‌ఫ్రా టెక్ అత్యల్ప బిడ్డర్‌గా నిలిచింది.


జైడస్ లైఫ్ సైన్సెస్‌: ఎరిత్రోమైసిన్ మాత్రలను అమెరికాలో మార్కెట్‌ చేయడానికి కోసం యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) నుంచి జైడస్ లైఫ్ సైన్సెస్‌కు తుది ఆమోదం లభించింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.