Stocks to watch today, 02 November 2022: ఇవాళ (బుధవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 18 పాయింట్లు లేదా 0.10 శాతం గ్రీన్‌ కలర్‌లో 18,237 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్‌ ఇవాళ ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


ఇవాళ Q2 ఫలితాలు ప్రకటించనున్న మేజర్‌ కంపెనీలు: అదానీ ట్రాన్స్‌మిషన్, ప్రోక్టర్ & గాంబుల్ హైజీన్ అండ్‌ హెల్త్‌కేర్, దాల్మియా భారత్, మహీంద్ర & మహీంద్ర ఫైనాన్షియల్ సర్వీసెస్, రిలాక్సో ఫుట్‌వేర్, గ్రైండ్‌వెల్ నార్టన్, కజారియా సిరామిక్స్, EIH, రెడింగ్టన్ ఇండియా, త్రివేణి టర్బైన్, KSB


నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


టెక్ మహీంద్రా: దేశంలో ఐదో అతి పెద్ద ఐటీ సేవల కంపెనీ లాభం  సెప్టెంబర్ త్రైమాసికంలో 4 శాతం క్షీణతతో రూ. 1,285 కోట్లకు చేరుకుంది. లాభం మార్జిన్‌లోనూ కుదింపు ఉంది. మొత్తం ఆదాయం 20.7 శాతం పెరిగి రూ.13,129 కోట్లకు చేరింది.


ఇన్ఫోసిస్: నవంబర్ 3 నుంచి డిసెంబర్ 2 మధ్య కాలంలో రూ.9,300 కోట్ల షేర్ల బైబ్యాక్‌ కోసం పోస్టల్ బ్యాలెట్ ద్వారా షేర్‌హోల్డర్ల ఆమోదం కోరబోతోంది. ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.1,850 ధర మించకుండా, ఓపెన్ మార్కెట్ మార్గంలో రూ.9,300 కోట్ల విలువైన షేర్ బైబ్యాక్‌ను అక్టోబర్ 13న ఇన్ఫోసిస్ బోర్డు ప్రకటించింది.


యాక్సిస్ బ్యాంక్: USకు చెందిన ఈక్విటీ మేజర్ బెయిన్ క్యాపిటల్ ‍‌(Bain Capital), యాక్సిస్‌ బ్యాంక్‌లో 0.54 శాతం వాటా లేదా 1,66,80,000 షేర్లను సగటు ధర రూ.891.38 చొప్పున అమ్మేసింది. లావాదేవీ పరిమాణం రూ. 1,486.82 కోట్లు.


అదానీ పోర్ట్స్: ఈ అదానీ గ్రూప్ కంపెనీ ఏకీకృత లాభం సెప్టెంబర్ FY23తో ముగిసిన త్రైమాసికానికి 65.5 శాతం పెరిగి రూ. 1,738 కోట్లకు చేరుకుంది. టాప్ లైన్, నిర్వహణ ఆదాయం పెరగడం, తక్కువ పన్ను వ్యయం మద్దతుగా నిలిచాయి. ఈ త్రైమాసికంలో ఆదాయం 33 శాతం పెరిగి రూ. 5,211 కోట్లుగా నమోదైంది.


పంజాబ్ నేషనల్ బ్యాంక్: మొండి బకాయిలకు అధిక కేటాయింపుల (provisioning) కారణంగా సెప్టెంబర్ త్రైమాసికానికి ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ స్వతంత్ర ‍‌(standalone) నికర లాభం 63 శాతం క్షీణించి రూ.411 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో బ్యాంక్ రూ.1,105 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.


NMDC: 2022 ఏప్రిల్-అక్టోబర్ నెలల్లో ఈ ప్రభుత్వ రంగ సంస్థ ఇనుప ఖనిజం ఉత్పత్తి 6 శాతానికి పైగా పడిపోయి 19.71 మిలియన్ టన్నులకు (MT) తగ్గింది. ఈ మైనింగ్ దిగ్గజం గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 21.04 MT ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేసింది.


JK టైర్ & ఇండస్ట్రీస్: సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 23 శాతం క్షీణించి రూ. 50 కోట్లకు చేరుకుందని ఈ టైర్ తయారీ కంపెనీ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ కాలంలో రూ. 65 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.


మాక్రోటెక్ డెవలపర్స్‌ (లోధ): ఈ రియాల్టీ సంస్థ సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ. 933 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని నివేదించింది. ప్రాజెక్ట్‌ల అభివృద్ధి కోసం కంపెనీకి చెందిన బ్రిటిష్ విభాగానికి ఇచ్చిన రుణానికి రక్షణగా చేసిన కేటాయింపులు దీనికి కారణం. 


ఓల్టాస్: విదేశీ ప్రాజెక్ట్ కోసం చేసిన కేటాయింపుల కారణంగా సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికానికి రూ. 6.04 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని నివేదించింది. ఈ టాటా గ్రూప్ సంస్థ గత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.104.29 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.