Stock Market Closing Today: ఈ రోజు (గురువారం, 03 అక్టోబర్‌ 2024) ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లు రక్త స్నానం చేశాయి. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు దలాల్ స్ట్రీట్‌లో మంటబెట్టి, సెంటిమెంట్లను మసి చేశాయి. BSE సెన్సెక్స్, NSE నిఫ్టీ రెండూ 2 శాతం పైగా పతనమయ్యాయి. సెన్సెక్స్ ఇండెక్స్ ఇంట్రాడేలో 82,434 కనిష్ట స్థాయిని తాకగా, నిఫ్టీ 50 ఇండెక్స్ 25,230 స్థాయికి పడిపోయింది. F&O వీక్లీ కాంట్రాక్ట్‌ గడువు ముగియడం కూడా నష్టాలను పెంచింది. మిడ్‌ క్యాప్, స్మాల్‌ క్యాప్ షేర్లు కూడా సునామీని ఎదుర్కొన్నాయి. ఈ ఒక్కరోజే పెట్టుబడిదార్లు రూ. 9.6 లక్షల కోట్లను కోల్పోయారు.


మార్కెట్‌ ముగిసిన సమయానికి, BSE 1,769.19 పాయింట్లు లేదా 2.10% పడిపోయి 82,497.10 వద్ద ఉంది. NSE నిఫ్టీ 546.80 పాయింట్లు లేదా 2.12% తగ్గి 25,250.10 వద్ద ఆగాయి. ఈ ఉదయం సెన్సెక్స్‌ 83,002.09 దగ్గర, నిఫ్టీ 25,452.85 దగ్గర ఓపెన్‌ అయ్యాయి.


ఒకవేళ నిఫ్టీ 25,070 పాయింట్ల కన్నా దిగువకు పడిపోతే, 24,800 పాయింట్ల వరకు జారిపోయే ప్రమాదముందని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.


పెరిగిన & పడిపోయిన షేర్లు 
సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లో 28 స్టాక్స్‌, నిఫ్టీ 50 ప్యాక్‌లో 48 షేర్లు రెడ్‌లో క్లోజ్‌ అయ్యాయి. BPCL, శ్రీరామ్ ఫైనాన్స్, L&T, టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, మారుతి సుజుకీ, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ ఫైనాన్స్ 3.5 శాతం నుంచి 5 శాతం మధ్య పతనమయ్యాయి. మార్కెట్‌లో ఇంతటి బీభత్సాన్ని కూడా తట్టుకుని JSW స్టీల్, ONGC మాత్రమే ఈరోజు లార్జ్ క్యాప్ గెయినర్స్‌గా నిలిచాయి.


విస్తృత మార్కెట్ల విషయానికి వస్తే... నిఫ్టీ మిడ్‌ క్యాప్ ఇండెక్స్ 2.2 శాతం పడిపోయింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.9 శాతం పడిపోయింది. ఫియర్ గేజ్ అయిన ఇండియా VIX ఈ రోజు 9.4 శాతం పెరిగింది.


సెక్టార్ల వారీగా...
ఈ రోజు ట్రేడ్‌లో అన్ని సూచీల్లో రక్తపాతం తప్పలేదు. నిఫ్టీ రియాల్టీ 4.6 శాతం క్షీణించింది. నిఫ్టీ ఆటో ఇండెక్స్ 2.7 శాతం పడిపోయింది. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 2.5 శాతం ఆవిరైంది. ఐటీ, ఫార్మా, ఎనర్జీ, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, మెటల్స్‌, కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌, హెల్త్‌కేర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగాల షేర్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి.


నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్‌లోని 12 స్టాక్స్‌లో 11 క్షీణతతో ముగియగా, ఒక స్టాక్ మాత్రమే పెరుగుదలను చూపింది. నిఫ్టీ బ్యాంక్ 1077 పాయింట్ల లాస్‌లో ముగిసింది. 


మార్కెట్ క్యాప్
ఈక్విటీల్లో అమ్మకాల వరద కారణంగా ఇన్వెస్టర్లు భారీ నష్టాలను చవిచూశారు. బీఎస్‌ఈలో లిస్టయిన స్టాక్స్ మార్కెట్ క్యాప్ గత సెషన్‌లో రూ.474.86 లక్షల కోట్లుగా ఉండగా, నేటి ట్రేడ్‌లో రూ.465.25 లక్షల కోట్లకు పడిపోయింది. ఈ రోజు సెషన్‌లో ఇన్వెస్టర్లు రూ.9.61 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: కేఆర్‌ఎన్‌ హీట్ ఎక్స్ఛేంజర్ సూపర్ డూపర్ ఎంట్రీ - ఇన్వెస్టర్ల డబ్బులు డబుల్‌