బడ్జెట్‌ ముందు రోజు భారత స్టాక్‌ మార్కెట్లు కళకళలాడాయి. 2023 ఆర్థిక ఏడాదిలో జీడీపీని 8-8.85 శాతంగా అంచనా వేయడం, బడ్జెట్లో ఆర్థిక వ్యవస్థకు లాభం చేకూర్చే చర్యలు ఉంటాయన్న సంకేతాలు, ఆసియా, ఐరోపా మార్కెట్లు మెరుగ్గా ఓపెనవ్వడం ఇందుకు దోహదం చేశాయి. ఉదయం నుంచీ బెంచ్‌మార్క్‌ సూచీలు గరిష్ఠ స్థాయిల్లోనే కదలాడాయి.  ఒకానొక దశలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 900+, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 270+ వరకు లాభాల్లో ఉండటం గమనార్హం.


క్రితం రోజు 57,200 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 57,845 వద్ద భారీ గ్యాప్‌అప్‌తో మొదలైంది. వెంటనే 58,125 స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత ఇంట్రాడే కనిష్ఠమైన 57,746ను తాకిన సూచీ మళ్లీ పుంజుకొని 58,257 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. చివరకు 813 పాయింట్ల లాభంతో 58,014 వద్ద ముగిసింది.


శుక్రవారం 17,101 వద్ద ముగిసిన ఎన్ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 17,301 వద్ద గ్యాప్‌అప్‌తో ఆరంభమైంది. చూస్తుండగానే 17,380 స్థాయి అందుకుంది. 17,264 వద్ద కనిష్ఠాన్ని తాకినప్పటికీ కొనుగోళ్లు పుంజుకోవడంతో 17,410 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకొంది. మొత్తంగా 237 పాయింట్ల లాభంతో 17,339 వద్ద ముగిసింది.


నిఫ్టీ బ్యాంక్‌ మాత్రం ఒడుదొడుకుల మధ్య సాగింది. ఉదయం 38,091 వద్ద ఆరంభమైన సూచీ 38,217 వద్దకు ఎగిసింది.  గంటన్నరకే 37,647 వద్ద కనిష్ఠానికి చేరుకుంది. మళ్లీ అక్కడ మద్దతు తీసుకొంది. కొనుగోళ్లు పుంజుకోవడంతో 38,217 వద్ద ఇంట్రాడే గరిష్ఠ స్థాయికి చేరుకుంది. చివరికి 287 పాయింట్ల లాభంతో 37,975 వద్ద ముగిసింది.


నిఫ్టీలో 44 కంపెనీలు లాభాల్లో 6 నష్టాల్లో ముగిశాయి. టెక్‌ మహీంద్రా షేరు ఏకంగా 5.13 శాతం ఎగిసింది. టాటా మోటార్స్‌, విప్రో, బీపీసీఎల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ లాభపడ్డాయి. ఇండస్‌ ఇండ్‌బ్యాంక్‌, కొటక్‌ బ్యాంక్‌, కోల్‌ ఇండియా, యూపీఎల్‌, హింద్‌ యూనిలివర్‌ నష్టాల్లో ముగిశాయి. ఆటో, ఫార్మా, ఐటీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాలిటీ రంగాల సూచీలు 1-3 శాతం వరకు లాభపడ్డాయి.