Stock Market Closing Bell: భారత స్టాక్‌ మార్కెట్లను ఇంకా ఉక్రెయిన్‌, ద్రవ్యోల్బణం భయాలు వెంటాడుతున్నాయి. మదుపర్లు ఆచితూచి పెట్టుబడులు పెడుతున్నారు. ఆసియా మార్కెట్లూ మిశ్రమంగానే కనిపించడంతో ఇక్కడా సూచీలు ఫ్లాట్‌గా కదలాడాయి. కొవిడ్‌ ఆంక్షలు ఎత్తేయడంతో ఎకానమీ మరింత పుంజుకొనే అవకాశం ఉంది. దాంతో కొన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 89 పాయింట్లు నష్టపోగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 17,222 వద్ద ముగిసింది.


BSE Sensex


క్రితం సెషన్లో 57,684 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 57,190 వద్ద నష్టాల్లోనే మొదలైంది. కొనుగోళ్లు పుంజుకోవడంతో 57,800 వరకు పుంజుకుంది. 57,827 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం 12 గంటలకు హఠాత్తుగా అమ్మకాలు మొదలవ్వడంతో  57,138 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. ఐరోపా మార్కెట్లు తెరచుకున్న తర్వాత మదుపర్లు కాస్త కొనుగోళ్లు చేపట్టడంతో చివరికి 89 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ 57,595 వద్ద ముగిసింది.


NSE Nifty


బుధవారం 17,245 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,094 వద్ద ఓపెనైంది. 17,291 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆ తర్వాత విక్రయాలు మొదలవ్వడంతో 17,091 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. సాయంత్రం వరకు ఫ్లాట్‌గా కదలాడిన సూచీ 22 పాయింట్లు నష్టపోయి 17,222 వద్ద ముగిసింది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌లో మాత్రం సెల్లింగ్‌ ప్రెజర్‌ కనిపించింది. ఉదయం 35,633 వద్ద మొదలైంది. 35,957 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆ తర్వాత 35,421 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. చివరికి 620 పాయింట్ల నష్టంతో 35,527 వద్ద ముగిసింది. రెండు తప్ప మిగతా బ్యాంకులన్నీ నష్టాల్లోనే ఉన్నాయి.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 22 కంపెనీలు లాభపడగా 27 నష్టాల్లో ముగిశాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, హిందాల్కో, కోల్‌ ఇండియా, అల్ట్రాటెక్‌ సెమ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ లాభాల్లో ముగిశాయి. కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టైటాన్‌, హెచ్‌డీఎఫ్‌సీ నష్టాల్లో ముగిశాయి. ఐటీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఫార్మా సూచీలు ఒక శాతానికి పైగా ఎగిశాయి.