Adani Group Stocks Fall Continues: లంచం, తప్పుడు సమాచారం ఆరోపణలతో నిన్న అతి భారీగా నష్టపోయిన అదానీ గ్రూప్ షేర్లలో ఈ రోజు (శుక్రవారం, 22 నవంబర్ 2024) కూడా పతనం కొనసాగింది. స్టాక్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే అదానీ గ్రూప్ షేర్లు 8 శాతం వరకు పడిపోయాయి. వివాదానికి మూలకారణమైన అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ కూడా దాదాపు 5 శాతం క్షీణతతో ప్రారంభమయ్యాయి.
అమ్మకాలు వెల్లువెత్తడంతో, ఓపెనింగ్ సెషన్‌లో, అదానీ గ్రీన్ ఎనర్జీ స్టాక్ 10 శాతం క్షీణించి రూ.1021 స్థాయికి చేరుకుంది. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేర్లు 6.82 శాతం పడిపోయి రూ.650 వద్దకు; అదానీ ఎంటర్‌ప్రైజెస్ 4.24 శాతం దిగివచ్చి రూ. 2090 వద్దకు; అదానీ పోర్ట్స్ 5.32 శాతం నష్టంతో రూ.1055 వద్దకు; అదానీ పవర్ 5.27 శాతం కోల్పోయి రూ. 451 వద్దకు; అదానీ టోటల్ గ్యాస్ 6.12 శాతం తగ్గి రూ. 565 వద్దకు; అదానీ విల్మార్ 4.86 శాతం నష్టపోయి రూ. 280 వద్దకు; అంబుజా సిమెంట్ 0.30 శాతం క్షీణించి రూ. 482 వద్దకు; ACC 0.81 శాతం పడిపోయి రూ. 2009 వద్ద ట్రేడవుతున్నాయి.
నిధుల సమీకరణ మరింత ఖరీదు!
రేటింగ్ ఏజెన్సీ S&P, అదానీ గ్రూప్ కంపెనీల ఔట్‌లుక్‌ను సమీక్షిస్తూ, BBB- వద్ద అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ RG2 (AGEL RG2), అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ రేటింగ్‌లను కొనసాగించింది. గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సహా ఇతర కీలక ఎగ్జిక్యూటివ్‌లపై లంచం ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, అదానీ గ్రూప్ నిధుల సమీకరణ ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగలవచ్చు & సమీకరణ ఖర్చులు కూడా పెరగవచ్చని రేటింగ్ ఏజెన్సీ చెప్పింది.
అసలు విషయం ఏంటి?
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఇతర ఎగ్జిక్యూటివ్‌లు 265 మిలియన్ డాలర్ల (రూ. 2,100 కోట్లు) లంచం ఇవ్వడం, నిధుల సమీకరణ కోసం తప్పుడు సమాచారం ఇచ్చి మోసం చేశారని యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ అభియోగపత్రాలు నమోదు చేశాయి. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత, నిన్న, అదానీ గ్రూప్ స్టాక్స్ భారీగా పతనమయ్యాయి. ఫలితంగా అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ రూ.2.20 లక్షల కోట్లు తగ్గింది. గౌతమ్ అదానీ నికర విలువ కూడా 12 బిలియన్ డాలర్లు తగ్గింది.
గౌతమ్ అదానీ, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ డైరెక్టర్లపై యుఎస్ జస్టిస్ డిపార్ట్‌మెంట్, యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ చేసిన లంచం & మోసం ఆరోపణలను తిరస్కరిస్తూ అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన అవకాశాలను ఉపయోగించుకుంటామని తెలిపింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: భయపెట్టేలా పెరుగుతున్న పసిడి - ఈ రోజు 24K, 22K, 18K బంగారం, వెండి ధరలు ఇవీ