Stock Market News Today in Telugu: భారతీయ స్టాక్ మార్కెట్‌లో ఈ రోజు (శుక్రవారం, 06 సెప్టెంబర్‌ 2024) ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైనప్పటికీ, కొన్ని నిమిషాల్లోనే జారిపోవడం మొదలు పెట్టింది. ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ 1% పైగా భారీ పతనాన్ని చవిచూశాయి. 


ఈ రోజు మన మార్కెట్ ఇలా ప్రారంభమైంది...


గత సెషన్‌లో (గురువారం) 82,201 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 30 పాయింట్ల నష్టంతో 82,171 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. గురువారం 25,145 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 51.40 పాయింట్లు లేదా 0.20 శాతం క్షీణించి 25,093 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


మార్కెట్ ప్రారంభ నిమిషాల్లో ట్రేడింగ్ ఇలా ఉంది
ఈ రోజు ఓపెనింగ్‌ టైమ్‌లో, స్టాక్ మార్కెట్‌లో పెద్దగా మార్పు కనిపించ లేదు. ప్రారంభంలో ఐటీ షేర్లు కొంతమేర పుంజుకున్నట్లు కనిపించాయి. దీంతోపాటు బ్యాంకు షేర్లలోనూ ఓ మోస్తరుగా కదలిక వచ్చింది. ప్రారంభ నిమిషాల్లో, రిలయన్స్ ఇండస్ట్రీస్, TCS వంటి లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌ బలమైన ట్రేడింగ్‌ను చూశాయి. SBI షేర్లు బలహీనంగా ఉన్నాయి.


ఉదయం 10.30 గంటలకు, సెన్సెక్స్‌లో ప్రారంభ ర్యాలీ అదృశ్యమైంది, 704.61 పాయింట్లు లేదా 0.86 శాతం పడిపోయి 81,496 వద్దకు చేరుకుంది. అంటే 82,000 వద్ద గట్టి సపోర్ట్‌ను బద్దలు కొట్టి దిగువకు పడిపోయింది. ఆ సమయానికి, సెన్సెక్స్‌ ఇండెక్స్‌లోని 30 స్టాక్స్‌లో 5 మాత్రమే గ్రీన్‌ కలర్‌ను చూపగా, 25 స్టాక్స్‌ రెడ్‌ కలర్‌లో కనిపించాయి. ఉదయం 10.30 గంటల సమయానికి, NSE నిఫ్టీ 233.70 పాయింట్లు లేదా 0.93 శాతం నష్టంతో 24,911.40 స్థాయికి పడిపోయింది. నిఫ్టీ50 ఇండెక్స్‌లోని 50 స్టాక్స్‌లో 48 క్షీణించాయి.             


మార్కెట్‌ ప్రారంభమైన సరిగ్గా రెండు గంటల తర్వాత, ఉదయం 11.15 గంటలకు, సెన్సెక్స్ 892 పాయింట్లు లేదా 1.08% నష్టపోయి 81,309 వద్ద ట్రేడవుతోంది. ఉదయం 11.15 గంటలకు, నిఫ్టీ50 కూడా 279 పాయింట్లు లేదా 1.11% పతనంతో 24,865 స్థాయికి దిగజారింది. 


మధ్యాహ్నం 1.30 గంటల సమయానికి 969.70 పాయింట్లు లేదా 1.18% శాతం నష్టంలో ఉంది, 81,145.28 పాయింట్ల దగ్గర ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. నిన్నటి క్లోజింగ్‌తో పోలిస్తే సెన్సెక్స్‌ 1055 పాయింట్లు ఆవిరైంది. అదే సమయానికి, నిఫ్టీ 275.55 పాయింట్లు లేదా 1.10% శాతం నష్టంలో ఉంది, 24,839.40 పాయింట్ల దగ్గర ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. నిన్నటి క్లోజింగ్‌తో పోలిస్తే ఈ ఇండెక్స్‌ 305 పాయింట్లు ఆవిరైంది.            


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.