Stock Market News Updates Today in Telugu: ప్రపంచ స్థాయి శకునాలన్నీ శుభం పలకడంతో భారతీయ స్టాక్ మార్కెట్ల జోరు కొనసాగుతోంది. షేర్‌ మార్కెట్లు ఈ రోజు (సోమవారం, 23 సెప్టెంబర్‌ 2024) కొత్త రికార్డ్‌ స్థాయుల దగ్గర (Stock markets at record levels) ఓపెన్‌ అయ్యాయి. దీనికి ముందు ట్రేడింగ్‌ సెషన్‌లో, శుక్రవారం నాడు కూడా దేశీయ మార్కెట్లు కదం తొక్కాయి, కొత్త గరిష్టాలను అందుకున్నాయి.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది..


గత సెషన్‌లో (శుక్రవారం) 84,544 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు దాదాపు 107 పాయింట్ల లాభంతో  84,651.15 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. శుక్రవారం 25,791 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 80 పాయింట్లకు పైగా లాభంతో 25,872.55 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


రెండు సూచీలు గత రికార్డ్‌ స్థాయుల కంటే పైన ప్రారంభమయ్యాయి, ఓపెనింగ్‌ సెషన్‌లో అదే ఊపును కంటిన్యూ చేశాయి. ఈ వార్త రాసే సమయానికి, BSE సెన్సెక్స్ 84,862.89 పాయింట్ల దగ్గర లైఫ్‌ టైమ్‌ హై ‍(Sensex at fresh all-time high)ని టచ్‌ చేసింది. NSE నిఫ్టీ కూడా 25,911.70 పాయింట్ల దగ్గర కొత్త జీవితకాల గరిష్టాన్ని (Nifty at fresh all-time high) లిఖించింది.


ఉదయం 09.50 గంటలకు, BSE సెన్సెక్స్ 254.23 పాయింట్లు లేదా 0.30% పెరిగి 84,798.55 వద్ద ట్రేడవుతోంది. అదే సమయానికి NSE నిఫ్టీ కూడా 106.25 పాయింట్లు లేదా 0.41% లాభంతో 25,897.20దగ్గర ట్రేడవుతోంది.


లార్జ్‌ క్యాప్స్‌ స్టేటస్‌
ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌లోని చాలా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా దాదాపు 2 శాతం బలపడింది. భారతి ఎయిర్‌టెల్, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ 1 శాతానికి పైగా పెరిగాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌ అత్యధికంగా 1.30 శాతం నష్టపోయింది. హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.


ప్రి మార్కెట్‌
దేశీయ మార్కెట్‌లో ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభం కాకముందే, బుల్లిష్‌నెస్ కొనసాగే సూచనలు కనిపించాయి. ప్రి-ఓపెన్ సెషన్‌లో, సెన్సెక్స్ సుమారు 110 పాయింట్ల లాభంతో 84,650 పాయింట్ల పైన ట్రేడ్‌ అయితే, నిఫ్టీ సుమారు 80 పాయింట్ల లాభంతో 25,870 పాయింట్ల పైన ఉంది. ఉదయం, GIFT నిఫ్టీ ఫ్యూచర్స్ దాదాపు 100 పాయింట్ల ప్రీమియంతో 25,890 పాయింట్ల వద్ద కొనసాగింది.


శుక్రవారం నాడు మార్కెట్‌లో మెరుపులు
గత వారం చివరి రోజైన శుక్రవారం నాడు దేశీయ మార్కెట్‌లో విపరీతమైన వృద్ధి కనిపించింది. శుక్రవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1,359.51 పాయింట్ల (1.63 శాతం) లాభంతో 84,544.31 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 375.15 పాయింట్ల (1.48 శాతం) లాభంతో 25,790.95 పాయింట్ల వద్ద స్థిరపడింది.


గ్లోబల్‌ మార్కెట్లు
శుక్రవారం అమెరికా మార్కెట్‌లో మిశ్రమ ధోరణి కనిపించింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.09 శాతం స్వల్ప లాభంతో ముగిసింది. S&P 500 ఇండెక్స్ 0.19 శాతం క్షీణించింది. టెక్-ఫోకస్డ్ ఇండెక్స్ నాస్డాక్ 0.36 శాతం తగ్గింది. ఈ రోజు (సోమవారం) ఆసియా మార్కెట్లు సాఫ్ట్‌గా కదులుతున్నాయి. పబ్లిక్ హాలిడే కారణంగా జపాన్‌లో ట్రేడింగ్‌ జరగడం లేదు. దక్షిణ కొరియా కోస్పి 0.15 శాతం పతనమైంది. హాంగ్‌ కాంగ్‌ హ్యాంగ్‌సెంగ్‌ ఇండెక్స్‌ ఈ రోజు నష్టాలతో ప్రారంభమైంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: పెరుగుతూనే ఉన్న చమురు రేట్లు - ఈ రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇవి