Stock Market News Updates Today in Telugu: గ్లోబల్ మార్కెట్ నుంచి లభిస్తున్న మద్దతుతో భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (శుక్రవారం, 20 సెప్టెంబర్ 2024) బుల్లిష్‌గా ప్రారంభమయ్యాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ తప్ప అన్ని సెక్టార్లు ఈ రోజు పచ్చగా కళకళలాడుతున్నాయి.
ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది..
గత సెషన్‌లో (గురువారం) 83,185 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 421 పాయింట్లు లేదా 0.51 శాతం పెరిగి 83,603.04 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. గురువారం 25,416 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 112 పాయింట్లు లేదా 0.44 శాతం పెరిగి 25,525.95 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది.
నేటి ట్రేడ్‌లోనూ (ఉదయం 10.10 గంటల సమయానికి) BSE సెన్కెక్స్ కదం తొక్కింది, 83,805.26 వద్ద లైఫ్ టైమ్ హైని (Sensex at fresh all-time high) రికార్డ్ చేసింది. NSE నిఫ్టీ, 25,611.95 వద్దవున్న జీవితకాల గరిష్టాన్ని (Nifty at fresh all-time high) బ్రేక్ చేయడానికి కేవలం 1 పాయింట్ దూరంలో, 25,610.10 వద్ద ఉంది.
ఉదయం 9:20 గంటలకు, సెన్సెక్స్ లాభం 175 పాయింట్లకు తగ్గింది, 83,370 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 50 సూచీ దాదాపు 80 పాయింట్ల లాభంతో 25,500 పాయింట్లకు చేరువలో ఉంది.
ప్రారంభ ట్రేడింగ్‌లో మెటల్ స్టాక్స్ మెరిశాయి. JSW స్టీల్ షేర్లు దాదాపు 4 శాతం జంప్‌తో సెన్సెక్స్‌లో ముందంజలో ఉన్నాయి. టాటా స్టీల్, మహీంద్రా & మహీంద్రా వంటి షేర్లు కూడా తలో 1% పైగా పెరిగాయి. మరోవైపు... యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, టైటాన్ వంటి షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ఉదయం 10.15 గంటలకు, BSE సెన్సెక్స్ 412.73 పాయింట్లు లేదా 0.50% పెరిగి 83,597.53 వద్ద ట్రేడవుతోంది. అదే సమయానికి NSE నిఫ్టీ కూడా 134.80 పాయింట్లు లేదా 0.53% లాభంతో 25,550.60 దగ్గర ట్రేడవుతోంది.
ప్రి మార్కెట్
దేశీయ మార్కెట్‌లో ట్రేడింగ్ ప్రారంభానికి ముందే బుల్లిష్‌నెస్ కొనసాగే సూచనలు కనిపించాయి. ప్రి-ఓపెన్ సెషన్‌లో, సెన్సెక్స్ సుమారు 420 పాయింట్ల లాభంతో 83,600 పాయింట్ల పైన ట్రేడయింది. నిఫ్టీ 110 పాయింట్ల లాభంతో 25,525 పాయింట్లకు మించి ట్రేడయింది. ఉదయం మార్కెట్ ప్రారంభానికి ముందు, GIFT సిటీలో నిఫ్టీ ఫ్యూచర్స్ సుమారు 35 పాయింట్ల ప్రీమియంతో 25,525 పాయింట్ల వద్ద కొనసాగింది.
వడ్డీరేట్ల తగ్గింపుతో మెరుపులు
గురువారం US మార్కెట్ గట్టిగా పెరిగింది, ప్రధాన సూచీలు కొత్త గరిష్టాలను చేరుకున్నాయి. వాల్ స్ట్రీట్‌లో.. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 1.26 శాతం లాభంతో 42,025.19 పాయింట్ల వద్ద ముగిసింది. డౌజోన్స్ చరిత్రలో తొలిసారిగా 42 వేల పాయింట్లపైన క్లోజయింది. S&P 500 ఇండెక్స్‌లో 1.7 శాతం, టెక్-ఫోకస్డ్ ఇండెక్స్ నాస్‌డాక్‌లో 2.51 శాతం అద్భుతమైన పెరుగుదల ఉంది. S&P500 ఇండెక్స్ నిన్న తొలిసారిగా 5,700 పాయింట్లను దాటింది.
యూఎస్ మార్కెట్లు ఇచ్చిన సపోర్ట్‌తో ఈ రోజు ఆసియా మార్కెట్లు కూడా చెలరేగాయి. జపాన్ నికాయ్ 1.9 శాతం భారీ లాభంతో, టోపిక్స్ ఇండెక్స్ 1.63 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. దక్షిణ కొరియా కోస్పి 1.45 శాతం, కోస్‌డాక్ 1.51 శాతం చొప్పున పెరిగాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి