TCS Fixes November 25 as Record Date for Share Buyback: దేశంలోని అతి పెద్ద ఐటీ సేవల కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (Tata Consultancy Services - TCS) షేర్ బైబ్యాక్‌కు సంబంధించి, స్టాక్ మార్కెట్ ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్ పడింది. షేర్ బైబ్యాక్ రికార్డ్ తేదీ టీసీఎస్ ప్రకటించింది. నవంబర్ 25 తేదీని రికార్డ్ డేట్‌గా (TCS share buyback plan record date) టీసీఎస్ నిర్ణయించింది.
ఈ ఐటీ సేవల కంపెనీ, స్టాక్ మార్కెట్లకు గతంలోనే ఇచ్చిన సమాచారం ప్రకారం, షేర్ బైబ్యాక్ ప్లాన్‌లో భాగంగా షేర్‌హోల్డర్ల నుంచి రూ.17,000 కోట్ల విలువైన సొంత షేర్లను తిరిగి కొనుగోలు చేస్తుంది. ఒక్కో షేరును రూ.4,150 ధరతో మొత్తం 4.09 కోట్ల షేర్లను (కంపెనీలో 1.12% వాటాకు సమానం) మార్కెట్ నుంచి వెనక్కు తీసుకుంటుంది.
ఈ రోజు (గురువారం, 15 నవంబర్ 2023) ఉదయం 11 గంటల సమయానికి, BSEలో, టీసీఎస్ షేర్లు (TCS share price today) రూ.53.60 లేదా 1.58% పెరిగి రూ.3,452.90 వద్ద ఉన్నాయి. నిన్న (బుధవారం), ఈ కంపెనీ షేర్లు రూ.3399.30 వద్ద ముగిశాయి. 2023లో ఇప్పటి వరకు (TCS share price YTD), ఈ కంపెనీ షేర్ల విలువ రూ.204 లేదా 6% పైగా పెరిగింది. గత ఆరు నెలల్లో రూ.208.50 లేదా 6.40%, గత ఒక ఏడాది కాలంలో రూ.111.45 లేదా 3.32% చొప్పున ఈ కంపెనీ షేర్లు లాభపడ్డాయి. టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (TCS market cap) రూ.12.64 లక్షల కోట్లు. ఈ ఐటీ కంపెనీలో దాదాపు 6 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
TCS బైబ్యాక్‌ల చరిత్ర
యాక్సెంచర్ తర్వాత ప్రపంచంలోని రెండో అత్యంత విలువైన టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. గత ఆరేళ్లలో, టీసీఎస్‌కు ఇది 5వ బైబ్యాక్. చివరిసారి, 2022 జనవరిలో రూ.18,000 కోట్ల రూపాయల విలువైన సొంత షేర్లను తిరిగి కొనుగోలు చేసింది.
బైబ్యాక్ వల్ల ప్రయోజనం ఏంటి?
షేర్ బైబ్యాక్ అనేది వ్యూహాత్మక నిర్ణయం. ఒక కంపెనీ తన షేర్లను మార్కెట్ నుంచి తిరిగి కొనుగోలు చేయడాన్ని బైబ్యాక్ అంటారు. దీనివల్ల మార్కెట్‌లో ఆ కంపెనీ షేర్ల సప్లై తగ్గి, డిమాండ్ పెరుగుతుంది. తద్వారా షేర్ల ధర, దానికి అనుగుణంగా కంపెనీ మార్కెట్ విలువ పెరుగుతుంది. దీనివల్ల షేర్‌హోల్డర్లు, ఇన్వెస్టర్లు కూడా ప్రయోజనం పొందుతారు. లేదా, ఒక కంపెనీ షేర్లు విపరీతంగా పతనం అవుతున్న సందర్భంలో... ఆ పతనాన్ని ఆపి, షేర్ హోల్డర్లు & ఇన్వెస్టర్లలో తిరిగి నమ్మకం పెంచడానికి బైబ్యాక్ నిర్ణయాన్ని ఆ కంపెనీ తీసుకుంటుంది. తన ఆర్థిక స్థితి బలంగా ఉందని, షేర్ బైబ్యాక్ ద్వారా మార్కెట్‌కు సదరు కంపెనీ ఒక బలమైన సందేశాన్ని పంపుతుంది. ఫలితంగా, ఆ కంపెనీపై ఉన్న భయాందోళనలు తగ్గి షేర్‌హోల్డర్లు, ఇన్వెస్టర్లు నిశ్చింతగా ఉంటారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: ఆ రెండింటి మధ్య చిక్కుకున్న గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial