ఇన్వెస్టర్లు, ట్రేడర్లకు ఈ ఏడాది నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ నచ్చింది! దాంతో నేడు ఎగబడి మరీ షేర్లను కొనుగోలు చేశారు. బడ్జెట్‌ మరీ అతిగా లేకుండా స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌కు అనుకూలంగా ఉండటం, భారీ ప్రాజెక్టులకు కట్టుబడి ఉన్నామని చెప్పడం, జీఎస్‌టీ వసూళ్లు బాగున్నాయని తెలియడం మార్కెట్లో సానుకూల సెంటిమెంటుకు దారితీసింది. ఉదయం నుంచీ కీలక సూచీలు భారీ లాభాల్లో ట్రేడ్‌ అయ్యాయి. సెన్సెక్స్‌  848 పాయింట్లు లాభపడగా నిఫ్టీ 17,576 వద్ద ముగిసింది.


క్రితం రోజు 58,014 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 58,672 వద్ద భారీ గ్యాప్‌అప్‌తో మొదలైంది. 12 గంటల సమయంలో 800 పాయింట్లకు పైగా లాభపడింది. కానీ 1:30 గంటలకు 57,737 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. కానీ వెంటనే పుంజుకొని 59,032 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 848 పాయింట్ల లాభంతో 58,862 వద్ద ముగిసింది.


సోమవారం 17,339 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,529 వద్ద లాభాల్లో మొదలైంది. కొనుగోళ్లు పుంజుకోవడం 250 పాయింట్ల వరకు లాభపడింది. అయితే మధ్యాహ్నం ఒక్కసారిగా 17,244 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. మళ్లీ కొనుగోళ్లు పుంజుకోవడంతో 17,662 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 237 పాయింట్ల లాభంతో ముగిసింది.


బ్యాంక్‌ నిఫ్టీ ఒడుదొడుకులకు లోనైంది. ఉదయం 38,460 వద్ద ఆరంభమైంది. మధ్యాహ్నం నష్టపోయింది. 37,690 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి పతనమైంది. వెంటనే పుంజుకొని 38,802 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. చివరికి 530 పాయింట్ల లాభంతో 38,505 వద్ద ముగిసింది.


నిఫ్టీలో 35 కంపెనీలు లాభాల్లో, 15 నష్టాల్లో ముగిశాయి. టాటా స్టీల్‌, సన్‌ఫార్మా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, శ్రీసెమ్‌, ఎల్‌టీ నాలుగు శాతానికి పైగా లాభపడ్డాయి. బీపీసీఎల్‌, ఐఓసీ, టాటా మోటార్స్‌, ఎం అండ్‌ ఎం, ఓఎన్‌జీసీ నష్టపోయాయి. ఆటో, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు నష్టపోగా బ్యాంక్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, ఐటీ, రియాలిటీ, లోహ సూచీలు 1-5 శాతం వరకు లాభపడ్డాయి.