Stock Market Closing On 12 September 2024: భారత స్టాక్ మార్కెట్లు ఈ రోజు (గురువారం, 12 సెప్టెంబర్‌ 2024) చరిత్ర సృష్టించాయి. పెట్టుబడిదార్ల నుంచి భారీ కొనుగోళ్ల కారణంగా BSE సెన్సెక్స్ భారీగా 1600 పాయింట్ల జంప్‌ చేసింది, మొదటిసారిగా 83000 మార్క్‌ను దాటడంలో విజయం సాధించింది. NSE నిఫ్టీ కూడా 500 పాయింట్లకు పైగా జంప్‌తో 25,433 పాయింట్ల చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఈ రెండు ప్రధాన సూచీలు 1% పైగా లాభంతో ఈ రోజు క్లోజ్‌ అయ్యాయి.


మన మార్కెట్‌లో ఈ బలమైన ఊపు రావడంలో క్రెడిట్ మొత్తాన్ని ప్రపంచ స్టాక్ మార్కెట్లలో అద్భుతమైన పెరుగుదలకే ఇవ్వాలి. బ్యాంకింగ్, ఎనర్జీ ఆటో, ఐటీ స్టాక్స్‌లో ర్యాలీ పెద్ద సహకారాన్ని అందించాయి. 


నేటి సెషన్ బుల్స్‌కు అనుకూలంగా సాగింది. నెస్లే ఇండియా మినహా, నిఫ్టీ50లోని అన్ని స్టాక్స్‌ గ్రీన్‌లో ముగిశాయి. హిందాల్కో ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్‌టెల్, ఎన్‌టీపీసీ, శ్రీరామ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి, 4.15 శాతం వరకు లాభాలను ఆర్జించాయి.


సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లోనూ నెస్లే ఇండియా మినహా మిగిలిన అన్ని స్టాక్స్‌ పురోగమించాయి. ఇక్కడ లాభాలకు భారతీ ఎయిర్‌టెల్, ఎన్‌టీపీసీ, జేఎస్‌డబ్ల్యు స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా నేతృత్వం వహించాయి, 3.68 శాతం వరకు సానుకూలంగా ముగిశాయి.


అన్ని రంగాల సూచీలు కూడా గురువారం సానుకూల ధోరణితో స్థిరపడ్డాయి. నిఫ్టీ ఆటో, మెటల్ సూచీలు 2 నుంచి 3 శాతం లాభాలతో ముగిశాయి. నిఫ్టీ బ్యాంక్, పీఎస్‌యూ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ, ప్రైవేట్ బ్యాంక్ షేర్లు 1 శాతానికి పైగా ఎగబాకగా, నిఫ్టీ రియాల్టీ, ఫార్మా 0.9 శాతం చొప్పున లాభపడ్డాయి.


ఒక్క రోజులో రూ. 6 లక్షల కోట్ల సంపద
భారత స్టాక్ మార్కెట్‌లో చారిత్రక బూమ్ కారణంగా, ఇన్వెస్టర్ల ఆదాయాలు భారీగా పెరిగాయి. బీఎస్‌ఇలో లిస్టయిన స్టాక్స్‌ మార్కెట్ క్యాప్  (market capitalization of indian stock market) గత సెషన్‌లో రూ. 460.76 లక్షల కోట్లుగా ఉండగా, ఈ రోజు రూ. 466.66 లక్షల కోట్ల వద్ద ముగిసింది. అంటే.. నేటి సెషన్‌లో ఇన్వెస్టర్ల సంపదలో రూ. 5.90 లక్షల కోట్ల వృద్ధి నమోదైంది.


మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 1440 పాయింట్లు లేదా 1.77% ప్రాఫిట్‌తో 82,962 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 470 పాయింట్లు లేదా 1.89% జంప్‌తో 25,389 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ఫిక్సిడ్ డిపాజిట్లపై ఎప్పుడూ లేనంత వడ్డీ - ఇది మీరు కచ్చితంగా తెలుసుకోవలసిందే!