Airtel Finance Fixed Deposit: ఎయిర్‌టెల్‌ కంపెనీ టెలికాం సర్వీసులను మాత్రమే కాదు బ్యాంకింగ్‌ బిజినెస్‌ కూడా చేస్తోంది. ఇటీవలే, కొత్తగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ను లాంచ్‌ చేసింది. ప్రారంభ ఆఫర్‌ కింద భారీ వడ్డీ ఆదాయాన్ని ప్రజలకు ఆఫర్‌ చేస్తోంది.


సునీల్ మిత్తల్ నేతృత్వంలోని భారతి ఎయిర్‌టెల్ (Bharti Airtel), తన అనుబంధ సంస్థ అయిన 'ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్' (Airtel Payments Bank) ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్ల మార్కెట్‌ప్లేస్‌ను ప్రారంభించింది. 'ఎయిర్‌టెల్ ఫైనాన్స్' (Airtel Finance) పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్లను తీసుకుంటోంది. 


ఎయిర్‌టెల్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై వడ్డీ రేటు
ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తే, సంవత్సరానికి 9.10 శాతం వరకు ఆకర్షణీయమైన వడ్డీ రేటు ఇస్తామని భారతి ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఈ అధిక వడ్డీ రేటుతో హామీతో కూడిన ఆదాయాన్ని ప్రజలు ఎంజాయ్‌ చేయొచ్చని చెబుతోంది. 


వివిధ బ్యాంక్‌లతో టై-అప్‌
ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ సేవలను అందించడానికి... ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, శివాలిక్ బ్యాంక్, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్‌ సహా మరికొన్ని స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంక్‌లు, NBFCలతో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌ ఒప్పందం కుదుర్చుకుంది.


ఇప్పటికే అందిస్తున్న ఫైనాన్స్‌ సర్వీస్‌లు
'ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌' (Airtel Thanks App) ద్వారా ఎయిర్‌టెల్‌ ఫైనాన్స్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతా ఓపెన్ చేయొచ్చు. అంతేకాదు... వ్యక్తిగత రుణాలు, ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ కోబ్రాండ్ క్రెడిట్ కార్డ్‌లు, ఎయిర్‌టెల్ బజాజ్ ఫిన్‌సర్వ్ ఇన్‌స్టా EMI కార్డ్‌లు, గోల్డ్ లోన్‌ వంటి సర్వీసులను కూడా ఇప్పటికే ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ లాంచ్‌ చేసింది. వీటిని కూడా ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌ ద్వారా పొందొచ్చు. దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఈ సర్వీసులను ఉపయోగించుకుంటున్నారు. 


డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC, ఇది 100% RBI అనుబంధ సంస్థ) ద్వారా బ్యాంక్ FD మీద రూ. 5 లక్షల వరకు ఇన్సూరెన్స్‌ ఉంటుంది. ఒకవేళ ఆ బ్యాంక్‌ మూతపడినా/దివాలా తీసినా, కస్టమర్‌కు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ అసలు + వడ్డీ కలిపి రూ. 5 లక్షల వరకు అందుతాయి. ఒక్కో ఎఫ్‌డీ మీద రూ. 5 లక్షల చొప్పున తిరిగి వస్తాయి. కాబట్టి, ఏ బ్యాంక్‌లోనైనా ఎఫ్‌డీలపై రూ. 5 లక్షల వరకు పెట్టుబడి భయం ఉండదు.


ఇతర స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌ల్లాగే, FD వేసిన రోజు నుంచి 7 రోజుల తర్వాత ఎప్పుడైనా FD డబ్బును విత్‌డ్రా చేసుకునే ఆప్షన్‌ ఉంది. కాబట్టి.. లాక్-ఇన్ పిరియడ్‌, లిక్విడిటీ గురించి కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదని బ్యాంక్‌ చెబుతోంది.


ఎయిర్‌టెల్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ కనీస మొత్తం
కస్టమర్‌లు కనీసం రూ. 1000 పెట్టుబడితో కొత్త బ్యాంక్ ఖాతాను తెరవకుండానే ఫిక్స్‌డ్ డిపాజిట్లను నేరుగా బుక్ చేసుకోవచ్చు.


ఎయిర్‌టెల్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ ఖాతాను ఎలా తెరవాలి?


చాలా సింపుల్‌గా, కేవలం మూడు స్టెప్పుల్లో ఎయిర్‌టెల్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ ప్రారంభించొచ్చు. ఇది పూర్తిగా డిజిటల్ ప్రక్రియ.


స్టెప్‌ 1: ఎయిర్‌టెల్‌ ఫైనాన్స్‌ అందిస్తున్న వివిధ రకాల FDలను పోల్చుకుని, మీ అవసరాలు/ ఆర్థిక లక్ష్యాలకు సూటయ్యే ఒక స్కీమ్‌ను ఎంచుకోండి.


స్టెప్‌ 2: యాప్‌లో అడిగిన వివరాలను ఎంటర్‌ చేసి, KYC పనిని పూర్తి చేయండి.


స్టెప్‌ 3: ఇప్పటికే ఉన్న ఏదైనా బ్యాంక్ ఖాతా ద్వారా ఎయిర్‌టెల్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లోకి డబ్బు చెల్లించండి.


ఈ సర్వీస్‌ ప్రస్తుతం ఆండ్రాయిడ్ పరికరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో iOSలోనూ అందుబాటులోకి వస్తుంది అని ఎయిర్‌టెల్‌ ఫైనాన్స్‌ వెల్లడించింది.


మరో ఆసక్తికర కథనం: కొండ నుంచి దిగొచ్చిన పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి